తెలంగాణలో నమస్తే తెలంగాణ పత్రిక ఎవరిది? అని పత్రికలు చదివే వారిలో ఎవరిని అడిగినా టక్కున చెప్పేది సిఎం కేసిఆర్ ఫ్యామిలీ అని. రాజకీయాల్లో ఉన్నంత మాత్రాన పత్రికలు, టివిలు నడపడం తప్పేం కాదని జనాలు భావిస్తున్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖరరెడ్డి సిఎం గా ఉన్న రోజుల్లో ఆయన కుటుంబం సాక్షి పత్రిక, సాక్షి చానెల్ పెట్టుకున్నారు. కేసిఆర్ ఫ్యామిలీ మాత్రం తెలంగాణ రాకముందే అంటే అధికారంలోకి రాకముందే నమస్తే తెలంగాణ, టిన్యూస్ చానెళ్లు ప్రారంభించారు.
అయితే అధికార పార్టీ తాలూకు పత్రికలో ఏదైనా వార్త వచ్చిందంటే అది ప్రభుత్వ గెజిట్ అన్నట్లుగానే జనాలు రిసీవ్ చేసుకుంటున్నారు. నమస్తే తెలంగాణ పత్రికలో వచ్చిన వార్త కానీ, పత్రికా ప్రకటన (యాడ్) కానీ జనాలకు ఆసక్తిని కలిగించేవే. అయితే ఇవాళ నమస్తే తెలంగాణ పత్రిక మొదటి పేజీ నిండా ఒక యాడ్ పరచబడింది. ఆ యాడ్ ఒక రియల్ ఎస్టేట్ కంపెనీది. మాతృభూమి ఫార్మ్స్ ల్యాండ్ పేరుతో విడుదలైన ఆ యాడ్ లో ఏముందో తెలుసా? బంగారం కంటే విలువైనది భూమి అని ఇచ్చారు. కలర్ ఫుల్ యాడ్ ను ఫుల్ పేజీలో పరిచేశారు. ఆ ఫార్మ్ ల్యాండ్ తీసుకుంటే గజం కేవలం 1200 లకే ఇస్తామని ప్రకటించారు. ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కొత్త మనోహర్ రెడ్డి పేరుతో, ఆయన ఫొటోతో బ్రహ్మాండ్లంగా యాడ్ పబ్లిష్ అయింది. దానికి తగ్గట్టుగానే నమస్తే తెలంగాణ కు కొత్త మనోహర్ రెడ్డి దగ్గరి నుంచి పైకం కూడా దండిగానే ముట్టి ఉంటది. పత్రికలో వచ్చిన యాడ్ కింద ఉంది చూడండి.
ఇటువైపు సర్కారు గెజిట్ పత్రిక లాంటి నమస్తే తెలంగాణలో బంగారం లాంటి భూములు కొనుక్కోండి అని యాడ్ ఇస్తే ఆ యాడ్ అంతా తూచ్ అని హెచ్ఎండిఎ కమిషనర్ చిరంజీవులు ఒక ప్రెస్ నోట్ జారీ చేశారు. అసలు ఔటర్ పరిధిలో ఇలాంటి వెంచర్స్ చేసి భూములు అమ్మడానికి అనుమతి లేనే లేదని తేల్చి పారేశారు. నమస్తే తెలంగాణ పత్రికలో వచ్చిన యాడ్ ను నమ్మొద్దని జనాలను హెచ్చరించారు. మొత్తానికి నమస్తే తెలంగాణ పత్రిక బంగారం లాంటి భూములు కొనమంటూ జనాలకు చెబుతుంటే అధికారులేమో ఆ భూములు కొంటే మీ పని ఖతం అని హెచ్చరికలు జారీ చేయడం వింతగా ఉందంటూ రాజకీయ వర్గాల్లో చర్చలు సాగుతున్నాయి. చిరంజీవులు పేరుతో విడుదలైన పత్రికా ప్రకటన కింద ఉంది చూడండి.
పత్రికా ప్రకటన
నేడు, అనగా తేదిః 28-7-2018 రోజున ప్రముఖ తెలుగు దినపత్రిక ‘నమస్తే తెలంగాణ‘ మొదటి పేజీ లో మాతృభూమి ఫార్మ్స్ ల్యాండ్ పేరిట ఆ సంస్ధ ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ కొత్త మనోహర్ రెడ్డి, మహేశ్వరం ఎలక్ట్రానిక్ సిటీ ప్రక్కన, ఓఆర్ఆర్ ఎక్జిట్ నెం. 15 కు దగ్గర లో 100 ఎకరాల ఫాం ల్యాండ్ ను చదరపు గజాలలో అమ్ముటకు బంగారం కన్నా విలువైన భూమి అని అకర్శనీయంగా ఫుల్ పేజీ ప్రకటన ఇచ్చి గజం కేవలం రూ. 1200 లకు అమ్మజూపారు. కాని వాస్తవానికి మాస్టర్ ప్లాన్ ప్రకారం (ఎండిపి 20131) సర్వే నెం. 28 మరియు 29 లు మహేశ్వరం మండలం పరండ్ల గ్రామం ప్రభుత్వం కన్జర్వేషన్ జోన్ నిర్దారించబడినది. అందులో ఎలాంటి అభివృధ్ధి కార్యక్రమాలకు గాని రెసిడెన్సియల్ లే-అవుట్లకు (నివాసిత ప్లాట్లు) లేదా ఫాం లే-అవుట్స్ ( వ్యవసాయ గృహ నిర్మాణాలు) అనుమతించబడవు. హెచ్ఎండీఎ చట్టం-2008 మరియు జోనల్ రెగ్యులేషన్స్ (మండలి నిబంధనలు) జీ.ఓ.ఎం.ఎస్ నెం.33 ( మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవెలప్ మెంట్) తేదిః త24-01-2013 ప్రకారం ఫార్మ లే-అవుట్ గా అభివృద్ధి చేయడం నిబంధనలకు విరుధ్ధము. అంతే కాకుండా ఎలాంటి అనుమతులు లేకుండా పెద్ద ఎత్తున ప్రకటన ఇచ్చి ప్రజలను మోసం చేసేవిధంగా తప్పుదోవ పట్టించడం నేరపూర్వక పనిగా భావించి, సదరు మాతృభూమి ఫార్మ్ ల్యాండ్స్ సంస్ధ యాజమాన్యానికి వ్యతిరేకంగా చట్టపరమైన చర్యలు తీసుకొనుటకు నోటీసులు జారీచేయబడినవి. కావున ఈ విషయాన్ని మీ పత్రికలో ప్రముఖంగా ప్రచురించి అమాయక ప్రజలను అనుమతి లేని ఫాం లే-అవుట్ ప్లాట్లు కొనకుండా చైతన్య పరచగలరని మనివి.
……..టి. చిరంజీవులు, కమీషనర్, హెచ్ఎండీఎ, హైదరాబాద్.
జారీచేసిన వారు పి.ఆర్.ఓ., హెచ్ఎండీఎ