హరీష్ రావుపై అప్రకటిత నిషేధం… గులాబీ పార్టీలో గుబులు

తెలంగాణలో డైనమిక్ రాజకీయ నేతల జాబితాలో హరీష్ రావు కూడా అగ్రభాగాన ఉంటారు. టిఆర్ఎస్ లో మామ కేసిఆర్ తర్వాత హరీష్ రావే ఉంటారు. తన చాతుర్యత, వ్యూహాత్మక ఎత్తుగడలతో టిఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో హరీష్ పాత్ర లెక్క పెట్టలేనిది. అమెరికా నుంచి కేటిఆర్ తెలంగాణకు రావడం, రాజకీయాల్లోకి అడుగు పెట్టే వరకు కూడా హరీష్ రావు టిఆర్ఎస్ లో నెంబర్ 2 గానే ఉన్నారు. అయితే తాజాగా టిఆర్ఎస్ లో కేసిఆర్ తనయుడు కేటిఆర్ నెంబర్ 2 అన్న వాతావరణమైతే పార్టీ వర్గాల్లో నెలకొంది. అయితే ఈ విషయంలో హరీష్ రావు ఎక్కడా అసంతృప్తిని వ్యక్తం చేయలేదు. రామూ, నేను ఒకటే అని ఆయన చెప్పుకుంటారు. తమ మధ్య విబేధాలున్నట్లు వచ్చిన వార్తలు చూసి ఇద్దరం నవ్వుకుంటామని ఇటీవల మంత్రి కేటిఆర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. 

సిద్ధిపేటలో ప్రచారాన్ని షురూ చేసిన హరీష్ రావు

టిఆర్ఎస్ పార్టీలో ట్రబుల్ షూటర్ ఎవరు అన్న ప్రశ్నకు ఠక్కున వచ్చే సమాధానం హరీష్ రావే. టిఆర్ఎస్ పార్టీ పుట్టినప్పటి నుంచి ఉప ఎన్నికలకు పెట్టింది పేరు. సందు దొరికితే రాజీనామాలు చేసి ఉప ఎన్నికలకు వెళ్లడం ద్వారానే టిఆర్ఎస్ పెద్ద పార్టీగా అవతరించింది. అయితే పార్టీలో ఎవరైనా చేరిన సందర్భంలో వారు తమ పదవులకు రాజీనామాలు చేసి వచ్చారు. అప్పుడు వారందరినీ గెలిపించుకున్న వ్యూహకర్త, పోరాట యోధుడు హరీష్ రావే. టిఆర్ఎస్ చరిత్రలో ఏ ఆపరేషన్ చేయాలన్నా ఇప్పటి వరకు హరీష్ రావే చేశారు. మామను మించిన అల్లుడు అనిపించుకున్నారు. 

ఇబ్రహింపూర్ లో జరిగిన సభలో హరీష్ కు సన్మానం చేస్తున్న మహిళలు

అయితే తెలంగాణ వచ్చి టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు సందర్భాల్లో మాత్రమే హరీష్ రావుకు బాధ్యతలు అప్పగించలేదు. అదేమంటే ఒకటి జిహెచ్ఎంసి ఎన్నికలు. ఈ ఎన్నికల బాధ్యతను గులాబీ బాస్ మంత్రి కేటిఆర్ కు అప్పగించారు. అయితే కేటిఆర్ తొలిసారి బాధ్యతలు నెత్తికెత్తుకుని విజయవంతం అయ్యారు. గత గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేయకుండానే అస్త్ర సన్యాసం చేసిన టిఆర్ఎస్ ను ఈసారి గ్రేటర్ ఎన్నికల్లో వంద సీట్లకు దగ్గరగా తీసుకొచ్చారు కేటిఆర్. జిహెచ్ఎంసి ఎన్నికల ద్వారా కేటిఆర్ ఇమేజ్ అమాంతం పార్టీలో పెరిగిపోయింది. 

ఇబ్రహింపూర్ లో హరీష్ రావుకు సన్మానం శుక్రవారం నాడు

ఇక మరో ఎన్నిక బాధ్యతను కేసిఆర్ కుమార్తె, ఎంపి కవితకు అప్పగించారు. అదేమంటే సింగరేణి బొగ్గు గని కార్మిక సంఘాల ఎన్నికలు. వాటిని గెలిచే బాధ్యత కవిత భుజాలపై పెట్టారు కేసిఆర్. అయితే కవిత శక్తి వంచన లేకుండా సింగరేణి అంతటా కలియదిరిగి సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో విజయబావుటా ఎగురవేశారు. తద్వారా కవిత కూడా పార్టీలో స్టార్ ఇమేజ్ తెచ్చుకోగాలిగారు. ఈ రెండు ఎన్నికలు మినహా మిగిలిన అన్ని ఎన్నికలు హరీష్ రావే ముందుండి నడిపారు. ఆపరేషన్ ఆకర్ష్ లాంటి కార్యక్రమాలన్నీ హరీష్ రావు ముందుండి చేపట్టారు. తద్వారా టిఆర్ఎస్ పార్టీని బలోపేతం చేశారు.

మొన్న కొంగర కలాన్ లో జరిగిన ప్రగతి నివేదన సభ బాధ్యతలను కేసిఆర్ తన తనయుడు కేటిఆర్ కు అప్పగించారు. ఈ కార్యక్రమంలో హరీష్ రావు అంతంతమాత్రంగానే పాల్గొన్నట్లు ఒక దశలో చర్చ జరిగింది. అయితే ప్రగతి నివేదన సభ ఆశించిన రీతిలో విజయవంతం కాలేదన్న చర్చ ఉంది. మీటింగ్ కు ఒకరోజు ముందు ఈదురుగాలులకు, వర్షాలకు కేసిఆర్ కటౌట్ కూలిపోవడం, బస్సుల్లో మందు బాబుల హంగామా, అధినేత కేసిఆర్ స్పీచ్ చప్పగా ఉండడం లాంటివి చోటు చేసుకోవడంతో ప్రగతి నివేదన సభ ఆశించిన రీతిలో జరగలేదన్న చర్చ ఉంది.

సెప్టెంబరు 10న నమస్తే తెలంగాణ పత్రికలో మెయిన్ ఫస్ట్ పేజీలో వచ్చిన ఈ వార్తే చివరి వార్త. ఆ తర్వాత ఫస్ట్ పేజీలో హరీష్ రావు వార్త రాలేదు.

 

ఇక అసలు విషయానికి వస్తే నమస్తే తెలంగాణ పత్రిక టిఆర్ఎస్ పార్టీకి అనుకూలమన్నది జగమెరిగిన సత్యమే. ఆ పత్రికలో టిఆర్ఎస్ వార్డు మెంబరు ఏ కార్యక్రమం చేసినా గ్యారెంటీగా వార్త వస్తది. అటువంటి టిఆర్ఎస్ లో టాప్ మోస్ట్ లీడర్ అయిన హరీష్ రావు వార్తలపై నిషేదం నడుస్తున్నది. ఇది ప్రకటిత నిషేదం కాదు. అప్రకటిత నిషేదం. ఎందుకంటే సెప్టెంబరు 11వ తేదీ నుంచి హరీష్ రావు వార్తలపై నిషేదం కొనసాగుతున్నది. సెప్టెంబరు 10వ తేదీన హరీష్ రావు వార్త నమస్తే తెలంగాణ పత్రికలో తొలిపేజీలో అడుగు భాగంలో వచ్చింది. ఆ తర్వాత గత పదిరోజులుగా వచ్చిన వార్తలు లెక్కేస్తే కేవలం రెండు వార్తలు మాత్రమే హరీష్ రావుకు సంబంధించిన వాటికి చోటు కల్పించారు. అంటే సెప్టెంబరు పదో తేదీ తర్వాత హరీష్ రావు మీద నమస్తే పత్రిక యాజమాన్యం నిషేదం విధించింది అన్న అనుమానాలు కలుగుతున్నాయి.

ఇక 11 వ తేదీన మూడో పేజీలో చిన్న వార్త ఒకటి వచ్చింది. అలాగే ఈనెల 16 వేతదీన 7వ పేజీలో మేనిఫెస్టో కమిటీ సమావేశం జరిగిందన్న వార్త వచ్చింది. కేశవరావు నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఆమేరకు హరీష్ రావు ఫొటో, ఆయన పేరు మాత్రం వచ్చాయి. 

సెప్లెంబరు 11వ తేదీన 7వ పేజీలో వచ్చిన చిన్న వార్త ఒకటి.

ఆ తర్వాత ఈనెల 21వ తేదీ వరకైతే మెయిన్ పేజీలో ఒక్క వార్త కూడా హరీష్ రావు గురించి లేదు. అయితే హరీష్ రావు ఈ పదిరోజుల కాలంలో ప్రజల్లో లేడా అంటే అదీ లేదు. ఆయన నిత్యం పొద్దున లేస్తే, రాత్రి నిద్ర పోయే వరకు ప్రజల్లోనే ఉంటున్నాడు. తన నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం హోరెత్తిస్తున్నారు. ఆయన వస్తుండంటే ఊరు ఊరు కదిలి వచ్చి స్వాగతాలుె పలుకుతున్న వాతావరణం ఉంది. హరీష్ కు నామినేషన్ ఖర్చుల కోసం చందాలు ఇస్తూ ఆశీర్వదిస్తున్నారు జనాలు. ప్రతి నిత్యం సిద్ధిపేట లోని ఏదో ఒక గ్రామంలో హరీష్ రావు ప్రచారంలో పాల్గొంటున్నారు. 

అయితే ముందస్తు ఎన్నికల వేల టిఆర్ఎస్ లో హరీష్ రావు చుట్టూ ఏదో బయటకు కనిపించని గూడు పుఠానీ నడుస్తుంది అన్న అనుమానాలు కలుగుతున్నాయి. పైకి ఏమీ కనిపించకపోయినా లోలోపల మాత్రం హరీష్ రావుకు ఇబ్బందికరమైన పరిణామాలు పార్టీలో ఉన్నాయా అన్న చర్చ కేడర్ లో నడుస్తున్నది. టిఆర్ఎస్ లో టాప్ మోస్ట్ లీడర్ అయిన హరీష్ రావు ఇంట్లోంచి కదిలితే వార్త ఇచ్చిన నమస్తే తెలంగాణ పత్రిక ఇప్పుడు హరీష్ వార్తలను ఎందుకు పక్కన  పెడుతున్నట్లు అంతుచిక్కడంలేదు.

కేకే నాయత్వంలో మేనిఫెస్టో కమిటీ సమావేశమైంది. ఆ సమయంలో హరీష్ రావు పాల్గొన్నారు. ఆ వార్తలో హరీష్ ఫోటో, పేరు వచ్చాయి. మూడో పేజీలో

ప్రతిరోజు ఎన్నికల హడావిడిపై మంత్రులు, ఎమ్మెల్యే ప్రచార పర్వాన్ని లోపలి పేజీల్లో అచ్చు ఒత్తుతున్న నమస్తే తెలంగాణ హరీష్ రావు వార్తలను మాత్రం దూరం పెట్టింది. ఎంతగా అంటే కేవలం ఆయన వార్తలను జోన్ పేజీకే పరిమితం చేశారన్న విమర్శ ఉంది. జిల్లా టాబ్లాయిడ్ లలో కూడా పెద్దగా ప్రభావవంతంగా రాలేదన్న చర్చ ఉంది. ఈనెల పదో తేదీ నుంచి ఇప్పటి వరకు మూడు వార్తలు మాత్రమే హరీష్ రావుకు సంబంధించినవి నమస్తే లో మెయిన్ పేజీలో వచ్చాయి. కానీ మిగతా మంత్రుల వార్తలు ప్రతిరోజూ వస్తూనే ఉన్నాయి. గత పదిరోజులుగా టిఆర్ఎస్ లో ఏరకమైన పరిణామాలు జరిగాయో, జరుగుతున్నాయో తెలియక టిఆర్ఎస్ వర్గాల్లో గుసగుసలు మొదలయ్యాయి.

టి న్యూస్ ఛానల్ లోనే అంతంత మాత్రమే :

టిఆర్ఎస్ పార్టీకి అనుకూల న్యూస్ ఛానెల్ గా ముద్ర పడ్డ టిన్యూస్ లోనూ హరీష్ రావు వార్తల మీద అప్రకటిత నిషేధం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. గత పది రోజులుగా టి న్యూస్ లోనూ హరీష్ రావు వార్తా కథనాలు, ప్రచార కార్యక్రమాలను చూపించడంలేదన్న చర్చ ఉంది. మిగతా పత్రికలు, ఛానెళ్లు కూడా పతాక శీర్షికన హరీష్ రావు వార్తలు చూపిస్తుంటే నమస్తే తెలంగాణ, టి న్యూస్ లో మాత్రం హరీష్ వార్తల జాడ లేదని అంటున్నారు. బూతద్ధం పెట్టి వెతికినా హరీష్ రావు వార్తలు దొరుకుతలేవని ఎందుకో ఆ రెండు సంస్థల్లో హరీష్ వార్తలు వస్తలేవు అని ఒక సీనియర్ జర్నలిస్టు వ్యాఖ్యానించారు. 

ఇదిలా ఉంటే ఇబ్రహీంపూర్ సభలో హరీష్ రావు సంచలన వ్యాఖ్యాలు చేశారు. శుక్రవారం ఇబ్రహింపూర్ గ్రామంలో జరిగిన సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. పార్టీలో ఏదో జరుగుతుందా అన్న అనుమానాలకు హరీష్ ఇబ్రహింపూర్ సభలో మాట్లాడిన మాటలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఇబ్రహీంపూర్ లో ఆయన ఏమన్నారో చదవండి. ‘‘మీ ప్రేమ, అభిమానం చూస్తుంటే ఇలా ఆదరణ ఉన్నప్పుడే రాజకీయాల్లో నుండి శాశ్వతంగా నిష్క్రమించాలి అనే నాకు అనిపిస్తున్నది. ఇక రాజకీయాలు చాలు అనిపిస్తుంది. ఈ జన్మకు ఇది చాలు అనిపిస్తున్నది’’