ఆంధ్రప్రదేశ్‌కి ‘నమస్తే’ చెబుతున్న కేసీయార్.?

నమస్తే తెలంగాణ తరహాలో.. నమస్తే ఆంధ్రప్రదేశ్ అట.! పేరు అయితే అదిరిపోయింది.! ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈటీవీ తెలంగాణ తరహాలోనన్నమాట.! భారత్ రాష్ట్ర సమితి దేశవ్యాప్తంగా విస్తరించే క్రమంలో ‘నమస్తే’ ఓ ఆయుధం కాబోతోంది. ‘నమస్తే’ పత్రిక ద్వారా, దేశవ్యాప్తంగా తనదైన రాజకీయం చేయాలనుకుంటున్నారు గులాబీ బాస్ కేసీయార్.

నమస్తే ఆంధ్రప్రదేశ్ పేరుతో త్వరలో ఆంధ్ర ప్రదేశ్‌లో పొలిటికల్ మీడియా కార్యకలాపాల్ని బీఆర్ఎస్ అధినేత కేసీయార్ విస్తృతం చేయబోతున్నారట. అంటే, ఆంధ్రప్రదేశ్‌లో తమకు అనుకూలంగా ‘నమస్తే ఆంధ్రప్రదేశ్’ పత్రిక ద్వారా కథనాలు రాయించుకోనున్నారనే కదా అర్థం. రాజకీయం, మీడియా.. ఇప్పుడు ఈ రెండిటినీ విడదీసి చూడలేం. రెండిటినీ అవిభాజ్య కవలలు అనడం సబబేమో.! అంతలా మీడియా – రాజకీయం కలగలిసిపోయాయి. సరే, ఈ మీడియా ప్రభావం ఓటర్లపై ఎంత.? అంటే, అది మళ్ళీ వేరే చర్చ.

కానీ, ఆంధ్రప్రదేశ్ వైభవం గురించి నస్తే ఆంధ్రప్రదేశ్ చెప్పగలుగుతుందా.? చెబితే, ఏపీ మీడియా వ్యవహారాలు ఎవరు చూసుకుంటారు.? ఒకప్పుడు తెలంగాణలో తమ మీడియా ద్వారా ఆంధ్రప్రదేశ్‌పై విషం చిమ్మింది గులాబీ పార్టీ. పేడ బిర్యానీ దగ్గర్నుంచి.. చాలా వుంటాయ్ చెప్పుకోడానికి. వచ్చే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జనసేనని తమవైపుకు తిప్పుకోవాలని బీఆర్ఎస్ చూస్తోందన్నది ఇంకో వాదన. అంతకన్నా ముందు తెలంగాణలో కలిసొచ్చే మిత్రుల్ని కలుపుకుపోవాలని బీఆర్ఎస్ చూస్తుందనుకోండి.. అది వేరే సంగతి.