బ్రేకింగ్ న్యూస్… తెలంగాణ ప్రభుత్వానికి మరోసారి హైకోర్టులో దిమ్మతిరిగే షాక్ తగిలింది. శాసన వ్యవస్థలో న్యాయ వ్యవస్థ జోక్యం సరికాదంటూ సిఎం కేసిఆర్ కామెంట్ చేసి 24 గంటలు గడవకముందే సర్కారుకు హైకోర్టు పెద్ద షాక్ ఇచ్చింది. సర్కారుకే కాదు ఏకంగా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కు కూడా షోకాజ్ నోటీసులు జారీ చేసి సంచలనం రేపింది న్యాయస్థానం. పూర్తి వివరాలు ఇవి.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ ల అసెంబ్లీ సభ్యత్వాలు రద్దు చేసిన నేపథ్యంలో వారి సభ్యత్వాలు పునరుద్ధరించాలని హైకోర్టు గతంలో ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసేందే. కానీ ఈ విషయంలో కోర్టు ఆదేశాలను అసెంబ్లీ సెక్రటరీ పెడచెవిన పెట్టారు. దీంతో తమ సభ్యత్వాలు పునరుద్ధరించాలని న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను భేఖాతరు చేశారంటూ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు ఆ ఇద్దరు నేతలు. కోర్టు ధిక్కరణ పిటిషన్ మీద విచారణ జరిపిన బి. శివశంకర్ రావు ఏక సభ్య ధర్మాసనం ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
అసెంబ్లీ సెకట్రరీ, అసెంబ్లీ లా సెక్రటరీ, మహబూబ్ నగర్ ఎస్పీ, నల్లగొండ ఎస్పీలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయస్థానం ఆదేశాలు పాటించకపోతే ఎవరికైనా కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించింది. తాము ఇచ్చిన ఇచ్చిన ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదో వివరించాలంటూ తెలంగాణ స్పీకర్ కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
ఈ విషయంలో ఇద్దరు ఎమ్మెల్యేలు అయిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ లకు గన్ మెన్లను కేటాయించాలని కోర్టు ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదంటూ తెలంగాణ డిజీపీ కి జోగులంబా ఎస్పీ ,నల్గొండ ఎస్పీలకు సుమోటోగా షోకాజ్ నోటీసులు జారీ చేసింది న్యాయస్థానం. షోకాజ్ నోటీసు జారీ చేసి కేసును నెల 28 కి వాయిదా వేసింది.
అసెంబ్లీ సెక్రెటరి వి నరసింహాచార్యులు, అసెంబ్లీ లా సెక్రెటరి నిరంజన్ రావులకు ఫారమ్-01 నోటీసులు జారీ చేసింది హైకోర్టు. వారిద్దరూ వ్యక్తిగతంగా సెప్టెంబరు 17 నాడు ఇద్దరు నేరుగా కోర్టు హాజరు కావాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు కోర్టు ఆదేశాలు ఎవరు ధిక్కరించినా శిక్షార్హులే అని హైకోర్టు హెచ్చరించింది. అంతేకాకుండా ఎమ్మెల్యేల జీత భత్యాల వివరాలు, అసెంబ్లీ రిజిస్టర్ ను కోర్టుకు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది.