రేవంత్ రెడ్డి అరెస్టు పై హైకోర్టు సీరియస్

తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రసిడెంట్, కొడంగల్ నియోకవర్గ అభ్యర్థి రేవంత్ రెడ్డి అరెస్టుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏ ఆధారాలతో రేవంత్ రెడ్డిని అరెస్టు చేశారని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అల్లర్లు జరగవచ్చని ఇంటెలిజెన్స్ నివేదిక ఆధారంగానే తాము రేవంత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నట్లు కోర్టుకు తెలిపిన పబ్లిక్ ప్రాసిక్యూటర్.

రేవంత్ రెడ్డి అరెస్టును నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ నేత, రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన వేం నరేందర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడంతో ఈ పిటిషన్ పై న్యాయమూర్తి విచారణ జరిపారు. 

విచారణలో భాగంగా రేవంత్ రెడ్డి అరెస్టు తాలూకు ఇంటెలిజెన్స్ నివేదికను కోర్టుకు సమర్పించాలని ఆదేశించిన న్యాయమూర్తి తదుపరి విచారణను మధ్యాహ్నం 3.15కు వాయిదా వేశారు.

 

ఇదిలా ఉంటే పది నిమిషాల వాయిదా తర్వాత తిరిగి ఈ కేసులో ప్రారంభమయ్యాయి. అప్పటికి పబ్లిక్ ప్రాసిక్యూటర్ రేవంత్ రెడ్డి అరెస్టుకు సంబంధించిన ఇంటెలిజెన్స్ నివేదికను సమర్పించలేదు. దీంతో రేవంత్ రెడ్డి అరెస్ట్ కి సంబంధించి వివరాలు ఎందుకు సమర్పించలేదు అంటూ ప్రశ్నించింది హైకోర్టు. అయితే 4;30 గంటలకు రేవంత్ రెడ్డి ని విడుదల చేస్తామని ప్రభుత్వ తరుపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. 

ఈ విషయంలో హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇంత టెక్నోలజీ అందుబాటులో ఉన్న వివరాలు సమర్పించడానికి మీకు ఏంటి అడ్డంకులు అని ప్రశ్నించింది  హై కోర్టు. తిరిగి తదుపరి విచారణ 4:30కు వాయిదా వేసింది. 

 

మరోవైపు రేవంత్ రెడ్డిని వెంటనే విడుదల చేయాలని ఎలక్షన్ కమిషన్ సిఇఓ రజత్ కుమార్ డిజిపి మహేందర్ రెడ్డిని ఆదేశించారు. రజత్ కుమార్ ఆదేశాల మేరకు రేవంత్ రెడ్డిని పోలీసులు మరికాసేపట్లో విడుదల చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అయితే సిఎం కేసిఆర్ 3గంటల సమయంలో గద్వాల సభలో మాట్లాడారు. ఆయన అక్కడి నుంచి మక్తల్ లో జరిగే సభలో పాల్గొంటారు. అక్కడ సభ పూర్తయిన తర్వాత తర్వాత కొడంగల్ లో జరగనున్న బహిరంగసభలో పాల్గొంటారు. కొడంగల్ సభ పూర్తయిన తర్వాత వికారాబాద్ సభలో కేసిఆర్ ప్రసంగిస్తారు. 5 గంటల వరకు కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గిలో కేసిఆర్ సభ పూర్తయ్యే అవకాశాలు కనిపించడంలేదు. 

మరి కేసిఆర్ సభ పూర్తయ్యే వరకు రేవంత్ ను పోలీసులు విడుదల చేయకుండా అదుపులోనే ఉంచుకుంటారా? లేదంటే రజత్ కుమార్ ఆదేశాల మేరకు వెంటనే విడుదల చేస్తారా అన్నది తేలాల్సి ఉంది.

రేవంత్ కు స్వల్ప అస్వస్థత :

కొడంగల్ లోని తన నివాసంలో మిడ్ నైట్ 3 గంటల సమయంలో తలుపులు పగలగొట్టి మరీ అరెస్టు చేసిన పోలీసులు ఆయనను నేరుగా జడ్చర్ల లోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో ఉంచారు. రాత్రి అరెస్టు చేసే సమయంలో పోలీసులతో తీవ్ర వాగ్వాదం జరిగింది. రేవంత్ కు బిపి ఎక్కువ కావడంతో ఆయనకు ట్రైనింగ్ సెంటర్ లోనే డాక్టర్లతో వైద్యం అందించారు. ప్రాథమిక చికిత్స అందించిన డాక్టర్లు రేవంత్ కు ప్రమాదం ఏమీ లేదని సూచించారు.

రేవంత్ అరెస్టు పై రాహుల్ గాంధీ సీరియస్..

రేవంత్ రెడ్డి అరెస్టు పై ఎఐసిసి అధినేత రాహుల్ గాంధీ స్పందించారు. ఈ విషయమై ఆయన ట్వీట్ చేశారు. రేవంత్ అరస్టు ను ఖండించారు. అరెస్టులతో కాంగ్రెస్ ప్రభంజనాన్ని అడ్డుకోలేరని రాహుల్ గాంధీ హెచ్చరించారు. కేసిఆర్ నిరంకుశ ధోరణికి పరాకాష్టే రేవంత్ రెడ్డి అరెస్టు అని రాహుల్ పేర్కొన్నారు. ఓటమి భయంతోనే రేవంత్ రెడ్డిని అరెస్టు చేశారని రాహుల్ పేర్కొన్నారు. టిఆర్ఎస్ ను ప్రజలు చిత్తుగా ఓడించి కేసిఆర్ కు విశ్రాంతి ఇవ్వబోతున్నారు అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ఆయన తెలుగులో ట్వీట్ చేయడం గమనార్హం. రాహుల్ ట్వీట్ లింక్ కింద ఉంది చూడండి.

\https://twitter.com/RahulGandhi/status/1069896061177790464