Revanth Reddy: తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కొద్దిసేపటి క్రితం జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసం వద్ద తెలంగాణా పోలీసులు అరెస్ట్ చేశారు. కేసీఆర్ దత్తత గ్రామమైన ఎర్రవల్లిలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించబోయే రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనేందుకు రేవంత్ రెడ్డి వెళుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో కాంగ్రెస్ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగగా కొందరికి స్వల్పగాయాలయ్యాయి.
ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ లో 150 ఎకరాలలో పండిస్తున్న వరి పంటను మీడియాకు చూపెడతానని రేవంత్ రెడ్డి నిన్న ప్రకటించటం జరిగింది. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం నుండే కొందరు కాంగ్రెస్ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఇక రేవంత్ రెడ్డి ఎర్రవల్లి వెళ్లేందుకు బయటకు రాగా అరెస్ట్ చేసి భారీ బందోబస్తుతో అక్కడినుండి తరలించారు. దీంతో రేవంత్ ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
రేవంత్ అరెస్ట్ ని కాంగ్రెస్ నేతలు బట్టి విక్రమార్క, మల్లు రవి ఖండిస్తూ తెరాస ప్రభుత్వ తీరును విమర్శించారు. బట్టి మాట్లాడుతూ… రాజ్యాంగానికి విరుద్ధంగా టిఆర్ఎస్ ప్రభుత్వం భావ ప్రకటన స్వేచ్ఛను హరించడం అప్రజాస్వామికమని మండిపడ్డారు. టిఆర్ఎస్ నియంతృత్వ, నిరంకుశ పరిపాలనను తెలంగాణ ప్రజలు ప్రజలు నిలదీయాలని పేర్కొన్నారు. అన్నదాతలు అధైర్యపడొద్దని, కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా ఉంటుందని. ధాన్యం కొనుగోలు చేయకుంటే బీజేపీ, టీఆర్ఎస్ సర్కార్ లపై కాంగ్రెస్ పార్టీ యుద్ధం చేస్తుందని ప్రకటించారు.
ఇక ఈ అరెస్ట్ లపై మీడియాతో మాట్లాడిన మల్లు రవి ఢిల్లీ వెళ్లి కేంద్రాన్ని కలిసొచ్చిన తెరాస పెద్దలు ధాన్యం కొనుగోలు విషయంలో ఏం చేశారని ప్రశ్నించారు. రైతులను వరి పండించొద్దన్న కేసీఆర్ తన వ్యవసాయ క్షేత్రంలో ఎందుకు పండిస్తున్నారని నిలదీశారు. రాష్ట్రంలో పలుచోట్ల నిర్వహిస్తున్న రచ్చబండ కార్యక్రమాలకు వెళుతున్నట్లుగానే ఎర్రవల్లి కి వెళ్లటంలో తప్పేముందని అన్నారు. ఇది కేసీఆర్ నిరంకుశ పరిపాలనకు నిదర్శనమని, తెలంగాణ పోలీసులు కేసీఆర్ ఆర్మీ లాగా వ్యవహరిస్తున్నారని తప్పుపట్టారు.