సెర్ప్ ఉద్యోగులు ఇచ్చిన సమ్మె నోటీసుపై తెలంగాణ సర్కారు కసరత్తు ముమ్మరం చేసింది. ఈనెల 30 లోగా తమ డిమాండ్లు పరిష్కరించకపోతే 31 తర్వాత సమ్మెతో పాటు కుటుంబాలతో కలిసి ఆమరణ దీక్షకు దిగుతామని సెర్ప్ ఉద్యోగుల జెఎసి ఇప్పటికే ప్రకటించింది.
ఈ నేపథ్యంలో సంబంధిత పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. తక్షణమే సెర్ప్ ఉద్యోగులు లేవనెత్తిన అంశాలేమిటి? పరిశీలించాలని ఆదేశాలు జారీ చేశారు. మంత్రి ఆదేశాల మేరకు మంగళవారం సచివాలయంలో ఉన్నతాధికారులు సెర్ప్ ఉద్యోగుల జెఎసి నేతలతో సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజ్, సెర్ప్ సిఇఓ పౌసమీ బసు, త్రిసభ్య కమిటీ కన్వీనర్ విద్యాసాగర్ రెడ్డి, సెర్ప్ హెచ్ ఆర్ డైరెక్టర్ బాలయ్య, సెర్ప్ హెచ్ ఆర్ పిఎం ఖాలిద్ పాల్గొన్నారు. ఉద్యోగుల జెఎసి తరుపున నాయకులు ఏపూరి నర్సయ్య, కె గంగాధర్, సుభాష్ గౌడ్, మహేందర్ రెడ్డి పాల్గొన్నారు.
సచివాలయంలో సుమారు రెండు గంటల పాటు చర్చ జరిగిందని జెఎసి నేతలు ‘తెలుగురాజ్యం’ కు తెలిపారు. తాము ప్రభుత్వం ముందు ఉంచిన ఐదు డిమాండ్లను అధికారుల కమిటీకి నివేదించినట్లు వారు పేర్కొన్నారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించి జిఓ రూపంలో ఆర్డర్స్ ఇష్యూ చేయాలని విన్నవించారు. దీనికి స్పందించిన అధికారులు అన్ని డిమాండ్లను ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని చెప్పినట్లు వారు తెలిపారు.
దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సింది సంబంధిత శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, సిఎం కేసిఆర్ అని అధికారులు వివరించారు. వారి ఆదేశాల మేరకు రాతపూర్వక ఉత్తర్వులు జారీ చేయబడతాయన్నారు. ఏ నిర్ణయమైనా 30వ తేదీలోపు ప్రకటించాలని అధికారులను జెఎసి నేతలు కోరారు.
జెఎసి నేతలు పిఆర్సీ విషయంలో లేవనెత్తిన అంశాల్లో… పదో పిఆర్సీ ప్రకారం గా పే స్కేల్ అమలు చేయాలన్నారు. అందులో…
ఎంఎస్ సిసి లకు జూనియర్ అసిస్టెంట్ పే స్కేల్ అమలు చేయాలి.
మినిస్టీరియల్ స్టాఫ్ కు సంబంధిత పే స్కేల్ అమలు చేయాలి.
ఎల్ 1 కేడర్ వారికి సీనియర్ అసిస్టెంట్ కు వర్తించే పే స్కేల్
ఎల్ 2 కేడర్ వారికి సూపరింటెండెంట్ కు వర్తించే పే స్కేల్
ఎల్ 3 వారికి ఎంపిడిఓ కు వర్తించే పే స్కేల్ఎ
ఎల్ 4 వారికి అసిస్టెంట్ డైరెక్టర్ స్థాయి పే స్కేల్
ఎల్ 5 వారికి డిప్యూటీ డైరెక్టర్ కేడర్ లో ఉన్న పే స్కేల్ అమలు చేయాలని కోరారు.
ఇదంతా అమలు చేస్తే ఏడాదికి తెలంగాణ సర్కారుకు 84 కోట్లా 50 లక్షలు మాత్రమే అదనపు భారం అవుతుందని జెఎసి నేతలు వివరించారు. 4వేల మంది ఉద్యోగుల కోసం ఈ భారం పెద్దగా లెక్కలోకి రాదని పేర్కొన్నారు. న్యాయపరమైన అంశాలను పరిశీలించి డిమాండ్లపై ప్రభుత్వానికి నివేదిస్తామని అధికారులు హామీ ఇచ్చినట్లు జెఎసి నేతలు చెప్పారు.
అధికారులతో జరిగిన చర్చల పట్ల జెఎసి నేతలు సానుకూలతను వ్యక్తం చేశారు. త్వరితగతిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ విషయంలో అధికారుల పాత్ర ముగిసిందని జెఎసి నేతలు చెబుతున్నారు. ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకోవాల్సింది మంత్రి జూపల్లి, సిఎం కేసిఆర్ అని వారు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.