తెలంగాణ సర్కారుకు మరో తీపి కబురు

కాళేశ్వరం పై హాయాతుద్దిన్ వేసిన పిటిషన్ ను డిస్మిస్ చేసిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్.

కేంద్ర అనుమతులను రద్దు చేయాలని వేసిన పెటిషన్ విచారణ సెప్టెంబరు 17 కు వాయిదా.

అన్ని అనుమతులు వచ్చిన కాళేశ్వరంపై విచారణ, క్షేత్ర స్థాయి పరిశీలన అవసరం లేదన్న ట్రిబ్యునల్.

కోర్టులు కేసు కొట్టేసిన తర్వాత తాము విచారణ జరిపేది ఏముందని ప్రశ్నించిన ఎన్. జి.టీ.

న్యూ ఢిల్లీ నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీర్ చీఫ్ చెరవేసిన సమాచారం ప్రకారం… కాళేశ్వరం ప్రాజెక్టు అనుమతులపై హయాతుద్దిన్ అనే వ్యక్తి జాతీయ హరిత ట్రిబ్యునల్ లో వేసిన కేసు OA NO. 372 ను జాతీయ హరిత ట్రిబ్యునల్ డిస్మిస్ చేసింది. అలాగే ఎంక్వైరీ కమిటీ వేయాలని వేసిన అప్పీల్ నంబరు 20 నీ జాతీయ హరిత ట్రిబ్యునల్ కొట్టివేసింది. రాజ్యాంగ న్యాయస్థానాలే కేసు కొట్టేసిన తరువాత ఈ అంశంపై విచారించడానికి ఏముందని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పిటిషన్ దారుడ్ని ప్రశ్నించింది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు వచ్చాయని, దీనిపై విచారణ జరపాల్సిన అవసరం లేదని, దీనిపై కమిటీ వేసి.. క్షేత్ర స్థాయి పరిశీలన జరపాల్సిన అవసరం లేదని జస్టిస్ రాఘవేంద్ర రాథోడ్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం తెల్చిచెప్పింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పర్యావరణ, అటవీ అనుమతులు రద్దు చేయాలని వేసిన మరో పిటిషన్ విచారణను సెప్టెంబర్ 17 తేదీకి వాయిదా వేసింది. కాళేశ్వరం పై జాతీయ హరిత ట్రిబ్యునల్ లో వేసిన ముఖ్యమైన కేసు కొట్టివేయడం శుభ సూచకమని అని ఈ కేసును పర్యవేక్షిస్తోన్న ఈఎన్సీ.. హరిరాం వ్యాఖ్యానించారు. ఇప్పటికే కేంద్ర జలవనరుల శాఖతో పాటు, పర్యావరణ, అటవీ, హైడ్రాలజీ అనుమతులన్నీ వచ్చిన తర్వాత కొత్తగా విచారించేది ఏముందని జాతీయ హరిత ట్రిబ్యునల్ వ్యాఖ్యానించినట్లు హరిరాం తెలిపారు.

పిటిషన్ కొట్టివేయడం పట్ల మంత్రి హరీష్ రావు హర్షం.

ఈ కేసులని కొట్టివేయడంపై సాగునీటి మంత్రి హరీష్ రావు హర్షం వెలిబుచ్చారు. ప్రాజెక్టు వ్యతిరేకులకు జాతీయ హరిత ట్రిబ్యునల్ తీర్పు ఒక చెంప పెట్టు లాంటిదన్నారు. ఇప్పటికైనా తెలంగాణకు జీవధార అయిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సహకరించాలని ప్రతిపక్షాలను మంత్రి కోరారు. దేశంలో ప్రాజెక్టులకు కేంద్రం ఇచ్చిన అనుమతులను రద్దు చెయ్యమని పెటిషన్లు వేసిన చరిత్ర తెలంగాణలో తప్ప మరెక్కడా కానరాదన్నారు. ప్రాజెక్టుల గురించి, ఇతర రాష్ట్రాల్లో తమ రాష్ట్ర ప్రయోజనాల గురించి అంతా ఒక్క తాటిపై నిలిస్తే…మన రాష్ట్రంలో ప్రతిపక్షాలు మాత్రం ప్రాజెక్టులు కట్టకుండా అడ్డం పడుతున్నారని విమర్శించారు. తెలంగాణలో ఏడ్డెం అంటే తెడ్డెం అనే లాప్రతిపక్షాలు వ్యవహరించడం దురదృష్టకరమన్నారు. ఇవ్వాళ్టి నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ తీర్పును చూసి అయినా అనుమతుల రద్దు పిటిషన్లను వెనక్కి తీసుకోవాలని హితవు పలికారు.