టిఆర్ఎస్ పెద్దపల్లి ఎంపి బాల్క సుమన్ చెన్నూరు టిఆర్ఎస్ అభ్యర్థిగా చేపట్టిన ర్యాలీలో నిరసన తెలిపిన రేగుంట గట్టయ్య కొద్దిసేపటి క్రితం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈనెల 12న చెన్నూరులో బాల్క సుమన్ చెన్నూరు నియోజకవర్గంలోని ఇందారం గ్రామంలో ర్యాలీ సందర్భంగా నిరసన తెలిపాడు రేగుంట గట్టయ్య. ఒంటిపై కిరోసిన పోసుకుని నిప్పంటించుకున్నాడు. గత ఆరు రోజులుగా హైదరాబాద్ మలక్ పేట యశోద ఆసుపత్రిలో గట్టయ్యకు చికిత్స అందిస్తున్నారు. ఒల్లంతా కాలిపోవడంతో ఆయన కోలుకోలేక తుది శ్వాస విడిచారు. గట్టయ్య మృతి టిఆర్ఎస్ వర్గాల్లో విషాదం నింపింది.
టిఆర్ఎస్ పార్టీ అధినేత కేసిఆర్ ఒకేదశలో 105 సీట్లకు అభ్యర్థులను ప్రకటించారు. అందులో ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మొండి చేయి చూపారు. వారిలో ఒకరు అందోల్ ఎమ్మెల్యే బాబూమోహన్ కాగా, మరొకరు చెన్నూరు ఎమ్మెల్యే నల్లాల ఓదేలు. వీరిద్దరికీ సీట్లు లేవని తేల్చి చెప్పేశారు. అంతేకాదు వారి స్థానాల్లో కొత్త పేర్లను ప్రకటించారు. అందోల్ సీటులో జర్నలిస్టు నేత క్రాంతి, చెన్నూరు సీటులో పెద్దపల్లి ఎంపి బాల్క సుమన్ పేర్లను ప్రకటించారు.
సుమన్ పేరును చెన్నూరుకు ప్రకటించిన నాటినుంచి ఆ నియోజకవర్గం అట్టుడికిపోయింది. సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన నల్లాల ఓదేలు సుదీర్ఘ కాలం చెన్నూరు ఎమ్మెల్యేగా ఉన్నారు. తనకు సీటు రాలేదని తెలియడంతో ఆయన, ఆయన అనుచరులు జీర్ణించుకోలేకపోయారు. ఎలాగైనా ఆందోళన చేసి అధిష్టానంపై వత్తిడి పెంచి సీటు దక్కించుకోవాలన్న ఉద్దేశంతో పోరుబాట పట్టారు.
సిట్టింగ్ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు ఇంట్లో స్వీయ నిర్బంధం చేసుకుని ఆందోళన చేశారు. బాల్క సుమన్ తప్పుడు సర్వే నివేదికలు ఇప్పటించి తన సీటు కొల్లగొట్టాడని ఆరోపించారు. ఓయు విద్యార్థి నేత అని చెప్పుకుంటున్న బాల్క సుమన్ నేడు ఉస్మానియాలోనే కాలు పెట్టలేని స్థితిలో ఉన్నాడని మండిపడ్డారు. అటువంటి బాల్క సుమన్ తప్పుడు పద్ధతుల్లో చెన్నూరు సీటు దక్కించుకున్నాడని విమర్శించారు.
చెన్నూరు టికెట్ తిరిగి నల్లాల ఓదేలుకే ఇవ్వాలని ఓదేలు అనుచరులు చేస్తున్న పోరాటం అదుపు తప్పింది. గట్టయ్య ఒంటిపై పెట్రోలు పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయడంతో ఆయన తీవ్రంగా గాయపడి తుదకు మరణించాడు. ఆయనతోపాటు మరో 10 మంది వరకు ఆ ఘటనలో గాయపడ్డారు. అయితే గట్టయ్య మాత్రమే తీవ్రంగా గాయపడ్డాడు. టికెట్ల పంచాయితి చెన్నూరులో వివాదం రేపింది. ఈ కారణంగానే గట్టయ్య మరణించాడని స్థానిక టిఆర్ఎస్ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గట్టయ్య ఆత్మహత్యాయత్నం చేసుకున్న సమయంలో ఎంపి బాల్క సుమన్ ఆయన మీద ఫైర్ అయ్యారు. తనను హత్య చేసేందుకు గట్టయ్య ప్రయత్నించాడని ఆరోపించారు. నల్లాల ఓదేలు మనుషులు తనను చంపాలని చూస్తున్నారని మండిపడ్డారు. చెన్నూరు నియోజకవర్గం బాగుపడుతుందంటే తాను చావడానికైనా సిద్ధమే అని స్పష్టం చేశారు. అంతేకాకుండా తనమీద ఇందారం ర్యాలీలో హత్యాయత్నం చేశారంటూ గట్టయ్యతోపాటు ఓదేలు అనుచరులపై బాల్క సుమన్ కేసు కూడా పెట్టారు.
ఆసుపత్రిలో ఆరు రోజులపాటు మృత్యువుతో పోరాడిన గట్టయ్య మంగళవారం మధ్యాహ్నం తుది శ్వాస విడిచాడు.