ఓదేలు మనుషులు నన్ను చంపాలని చూసిర్రు : బాల్క సుమన్

 

మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు నియోజకవర్గ అభ్యర్థి మార్పు టిఆర్ఎస్ పార్టీలో చిచ్చు రాజేసింది. సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన నల్లాల ఓదేలును పక్కనపెట్టి కేసిఆర్ పెద్దపల్లి ఎంపి బాల్క సుమన్ ను అక్కడ అభ్యర్థిగా ప్రకటించారు. నల్లాల ఓదేలు సర్వేల్లో వెనకబడ్డారని, ఆయనకు టికెట్ ఇస్తే గెలవలేమని కేసిఆర్ నిర్ణయానికి వచ్చిన తర్వాతే టికెట్ నిరాకరించారు. తెలంగాణ సిట్టింగ్ స్థానాల్లో నల్లాల ఓదేలు తోపాటు ఆందోల్ సీటులో సినీ నటుడు బాబూమోహన్ కు కూడా టికెట్ ఇవ్వలేదు. బాబూ మోహన్ స్థానంలో జర్నలిస్టు నేత క్రాంతికి టికెట్ దక్కింది.

నల్లాల ఓదేలుకు టికెట్ రాలేదని తెలిసిన నాటినుంచి ఆయన అనుచరులు ఆందోళనబాట పట్టారు. పార్టీ అధిష్టానంపై వత్తిడిపెంచేప్రయత్నంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో బుధవారం చెన్నూరులోని ఇందారంలో దారుణ సంఘటన జరిగింది. బాల్క సుమన్ ప్రచారంలో పాల్గొన్న సమయంలో నల్లాల ఓదేలు అనుచరుడు గట్టయ్య ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు.  బాల్క సుమన్ కు టికెట్ ఇవ్వొద్దని, నల్లాల ఓదేలుకే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆయన పరిస్థితి విషమంగా ఉంది. ఆయనను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో మరో ముగ్గురిపై కిరోసిన్ పడి వారికి కూడా గాయాలయ్యాయి. ఈ ఘటన టిఆర్ఎస్ వర్గాల్లో కలవరం రేపింది.

అయితే జరిగిన ఘటనపై ఎంపి బాల్క సుమన్ ఘాటుగా స్పందించారు. స్థానిక మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు మనుషులు తనను చంపాలని చూసిర్రని ఆరోపించారు. తన మీద కిరోసిన్ పోసి అంటుపెట్టేందుకు ప్రయత్నించారని అన్నారు. చెన్నూరు నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందంటే తాను చావడానికైనా సిద్ధమని ప్రకటించారు. ఓదేలు వర్గం చేస్తున్న బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. టికెట్ అనౌన్స్ అయిన తర్వాత తొలిసారి నియోజకవర్గంలో కాలు పెట్టగానే దాడికి దిగారని మండిపడ్డారు. ఆపద్ధర్మ సిఎం కేసిఆర్ ఆదేశాల మేరకే తాను చెన్నూరులో పోటీకి దిగనున్నట్లు చెప్పారు. చెన్నూరును సిద్ధిపేట లాగా అభివృద్ధి చేస్తానని భరోసా ఇచ్చారు. 

బాల్క సుమన్ పై దాడికి యత్నించడాన్ని టిఆర్ఎస్ వి అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఖండించారు. పెద్దపెల్లి ఎంపీ బాల్క సుమన్ పై కిరోసిన్ పోసి చంపాలని ప్రోత్సహించిన  వారిని అరెస్ట్ చేయాలన్నారు. ఎన్నికలను ఎన్నికలతో ఎదుర్కొలేని అసమర్దుల చర్యలను ఖండిస్తున్నామన్నారు. హత్యా రాజకీయాలు అంబేద్కర్ స్ఫూర్తికి విరుద్ధమని హితవు పలికారు.