ఉత్తమ్ మా ఇంటికొచ్చింది నిజమే, కానీ నేను టిఆర్ఎస్ వీడను

ఎన్నికల సమయంలో ఎవరు ఏ పార్టీలో ఉంటారో తెలియని పరిస్థితి. ఇప్పుడున్న పార్టీలో టికెట్ వస్తుందంటే ఉంటారు. టికెట్ లేదని తెలిస్తే మరు క్షణమే పార్టీ మారుతారు. కరుడుగట్టిన నేతలుగా ముద్ర పడ్డ వారి మీద కూడా పార్టీ మారతారంటూ ప్రచారం సాగుతున్న రోజులివి. అలా ప్రచారం నడుస్తుందంటే రేపో మాపో పార్టీ మారుతారు అన్న సిగ్నల్ గా కూడా చెప్పుకోవచ్చు.

తెలంగాణ ఉద్యమ కాలంలో అనేక మంది నాయకులు కాంగ్రెస్, టిడిపి నుంచి టిఆర్ఎస్ లో చేరారు. వారు చేరుతారని మీడియాలో కథనాలు రాగానే నేను చేరే ప్రసక్తే లేదు అంటూ కొందరు నేతలు డవిలాగులు కొట్టేవారు. కానీ సీన్ కట్ చేస్తే కొద్ది గ్యాప్ లో వారంతా గులాబీ పార్టీలో చేరిపోయారు. ఇలా ఆంధ్రలోనూ ఇటువంటి జాయినింగ్సే జరిగాయి.

తాజాగా తెలంగాణకు చెందిన గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే, రోడ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ తూంకుంట నర్సారెడ్డి పార్టీ మారుతున్నారంటూ జోరుగా మీడియా, సోషల్ మీడియా కథనాలు కుమ్మరిస్తున్నాయి. తూంకుంట టిఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరతారంటూ జోరుగా చర్చ నడుస్తున్నది. ప్రస్తుతం గజ్వేల్ లో గతంలో టిడిపి నుంచి పోటీ చేసిన ఒంటేరు ప్రతాపరెడ్డి కాంగ్రెస్ లో చేరారు. ఆయనకు కాంగ్రెస్ టికెట్ ఖాయమన్న చర్చ ఉంది.

తూంకుంట నర్సారెడ్డి, టిఎస్ ఆర్డీసి ఛైర్మన్, గజ్వేల్

 

ఈ నేపథ్యంలో తూంకుంట నర్సారెడ్డి కాంగ్రెస్ లో చేరతాడని చర్చ జరగడంతో హాట్ టాపిక్ అయింది. తూంకుంట నర్సారెడ్డి ఇంటికి పిసిసి ఉత్తమ్ వెళ్లి కలిసి వచ్చారు. ఉత్తమ్ తో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు కూడా తూంకుంట నర్సారెడ్డి ఇంటికి వెళ్లి వచ్చారు. దీంతో పార్టీ మారుతారన్న చర్చకు మరింత బలం చేకూరింది. 

ఈసారి కూడా కేసిఆర్ గజ్వేల్ లోనే పోటీ చేస్తున్నారు. ఒంటేరు కాంగ్రెస్ లోకి రావడంతో కాంగ్రెస్, టిడిపి వర్గాల నుంచి ఒంటేరుకు మద్దతు ఉంటుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో నర్సారెడ్డిని కాంగ్రెస్ లోకి తీసుకుంటే కేసిఆర్ కు మరింత టఫ్ ఫైట్ ఇవ్వొచ్చన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఏ ఇద్ద‌రు నేత‌లు క‌లిసినా… వార్తే. అయితే అదీ కేసిఆర్ సొంత నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయ ప‌రిణామాలు టీఆర్ఎస్ పార్టీలో క‌ల‌క‌లం రేపుతున్నాయి.

తూంకుంట నర్సారెడ్డిని తన నివాసంలో పరామర్శించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి చిత్రంలో ఒంటేరు ప్రతాపరెడ్డి

గ‌తంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న తూంకుంట న‌ర్సారెడ్డి 2014 ఎన్నిక‌ల అనంత‌రం టీఆర్ఎస్ లో చేరిపోయారు. ప్ర‌స్తుతం ఆయ‌న ఆర్డీసీ చైర్మ‌న్ గా ఉన్నారు.  అప్ప‌టికే టీడీపీలో ఉండే ప్ర‌తాప్ రెడ్డి, తూంకుంట ఉప్పూ నిప్పుల ఉంటారు. అయితే మారిన ప‌రిణామాల నేప‌థ్యంలో… ప్ర‌తాప్ రెడ్డి కాంగ్రెస్ లో చేర‌గా, తూంకుంట టీఆర్ఎస్ లో ఉన్నారు. అయితే, సీఎం నియోజ‌క‌వ‌ర్గంలో త‌న వ‌ర్గానికి అన్యాయం జ‌రుగుతుంద‌న్న అసంతృప్తితో ఉన్నా, టీఆర్ఎస్ లో కొన‌సాగుతూ వ‌చ్చారు.

గత నాలుగు నెల‌ల క్రితం రోడ్డు ప్ర‌మాదంలో గాయ‌ప‌డ్డారు నర్సారెడ్డి. దీంతో ఆయ‌న గ‌జ్వేల్ కు కొంత దూరంగా ఉంటూ వ‌చ్చారు. అయితే, న‌ర్సారెడ్డికి కొన్ని మండ‌లాల్లో గ‌ట్టిప‌ట్టుంది. ఇప్ప‌టికీ ఆయ‌న‌కు మంచి ఓటు బ్యాంకు ఉండ‌టంతో, కాంగ్రెస్ ఆయ‌న‌కు గాలం వేసే ప‌నిలో ఉంది. ప్ర‌తాప్ రెడ్డి, న‌ర్సారెడ్డి క‌లిస్తే… కేసిఆర్ ను ఓడించ‌టం క‌ష్టంకాదు  అన్న భావ‌న‌లో కాంగ్రెస్ ఉంది.

అందుకోసమే ప‌రామ‌ర్శ పేరుతో న‌ర్సారెడ్డి ఇంటికి వ‌చ్చిన పీసీసీ ప్రెసిడెంట్ ఉత్త‌మ్, స్థానిక గ‌జ్వేల్ నేత‌లు ఆయ‌న్ను పార్టీలోకి ఆహ్వానించినా… ఆయ‌న తిరస్క‌రించిన‌ట్లు తెలుస్తోంది. ఇదే అంశం వైర‌ల్ కావ‌టంతో… ఆయ‌న ఓ ప‌త్రికా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. అదే అంశాన్ని యాధావిధిగా మీ కోసం. 

 

ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌.

నేను నాలుగు నెల‌ల క్రితం రోడ్డుప్ర‌మాదంలో గాయ‌ప‌డ్డాను. నాలుగు నెల‌లుగా చికిత్స‌, ఆప‌రేష‌న్ చేయించుకొని ఇటీవ‌లే కోలుకున్నాను. దాంతో చాలా మంది నేత‌లు, కార్య‌క‌ర్త‌లు న‌న్ను ప‌రామ‌ర్శించ‌డానికి నా ఇంటికి వ‌స్తూ వెళ్తున్నారు. అనారోగ్యం విష‌యం తెలిసిన కాంగ్రెస్ అద్య‌క్షుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, మ‌రికొంత మంది నాయ‌కులు నా ఇంటికి ఆదివారం రాత్రి వ‌చ్చి, ప‌రామ‌ర్శించారు. ఇందులో ఏలాంటి రాజ‌కీయాల చ‌ర్చ‌లు జ‌ర‌గ‌లేదు.

మీ న‌ర్సారెడ్డి, మాజీ ఎమ్మెల్యే గ‌జ్వేల్
రోడ్ డెవ‌ల‌ప్మెంట్ కార్పోరేష‌న్ చైర్మ‌న్.

 

రోడ్డు ప్రమాదంలో గజ్వేల్ నర్సారెడ్డి కారు నుజ్జు నుజ్జు అయిన ఫొటోలు కింద ఉన్నాయి చూడండి.