తెలంగాణ ఎన్నికల్లో 88 సీట్లతో అప్రతిహాత విజయాన్ని సొంతం చేసుకున్న టిఆర్ఎస్ మరింత మంది ఎమ్మెల్యేలను టిఆర్ఎస్ లో చేర్చుకునేందుకు ఆసక్తి చూపుతున్నది. అసెంబ్లీలో ప్రతిపక్ష వాయిస్ అనేదే లేకుండా చేయాలన్న కసితో ఉన్న టిఆర్ఎస్ ఆ దిశగా కసరత్తు చేస్తున్నారు. తాజాగా ఖమ్మం జిల్లాలో ప్రజా కూటమి తరుపున గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలు కారెక్కే అవకాశాలున్నట్లు జిల్లా రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
ఎన్నికల ఫలితాలు వచ్చి 24 గంటలు గడవకముందే ఇద్దరు ఇండిపెండెంట్లు కారెక్కేశారు. రామగుండంలో గెలిచిన కోరుకంటి చందర్ (మాజీ టిఆర్ఎస్ నేత) కేటిఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. అలాగే వైరాలో గెలిచిన రాములు నాయక్ కూడా కేటిఆర్ సమక్షంలో గులాబీ దళంలో చేరారు. తాజాగా మరింత మంది ఖమ్మం ఎమ్మెల్యేలు కారెక్కేందుకు మంతనాలు జరుగుతున్నట్లు గుసగుసలు వినబడుతున్నాయి. ఖమ్మంలో కారెక్కనున్న ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఎవరు? ఏమిటా కథ? అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలు చవదండి.
తెలంగాణలోని ఉమ్మడి పది జిల్లాల్లో టిఆర్ఎస్ జోరు కొనసాగింది. కానీ ఖమ్మం జిల్లా మాత్రం కేసిఆర్ మళ్లీ ఎదురు నిలిచింది. 2014 ఎన్నికల్లో కేసిఆర్ కు తెలంగాణ అంతటా మంచి ఫలితాలే వచ్చినా ఖమ్మం జిల్లా మాత్రం మింగుడు పడలేదు. అదే సాంప్రదాయాన్ని 2018లోనూ ఖమ్మం జిల్లా నిలుపుకుంది. 2014లో టిఆర్ఎస్ కు ఒకే ఒక సీటు కట్టబెట్టిన ఖమ్మం జిల్లా ఈసారి కూడా ఒక సీటుకే పరిమితం చేసింది. అప్పుడు కొత్తగూడెంలో జలగం వెంకట్రావ్ గెలిచారు. ఇప్పుడు ఖమ్మం హెడ్ క్వార్టర్ లో పువ్వాడ అజయ్ గెలిచారు. అయితే ఖమ్మం జిల్లాలో గెలిచిన మిగతా పార్టీల వారిని ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో గుంజుకున్నది టిఆర్ఎస్. అదే ఫార్ములాను ఇప్పుడు కూడా అమలు చేసే పనిలో టిఆర్ఎస్ వ్యూహరచన చేస్తున్నట్లు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో జిల్లాకు పెద్ద దిక్కుగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు పాలేరులో అనూహ్యంగా ఓటమిపాలయ్యారు. ఆయన ఓడిపోయినా టిఆర్ఎస్ బలోపేతం కోసం వ్యూహరచన చేస్తున్నట్లు చెబుతున్నారు. టిడిపి తరుపున సత్తుపల్లిలో గెలిచిన సండ్ర వెంకట వీరయ్య, అశ్వారావుపేట ఎమ్మెల్యే మచ్చా నాగేశ్వరరావు ఇద్దరూ తుమ్మల కు టచ్ లో ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. వీరిద్దరూ తుమ్మల నేతృత్వంలో టిఆర్ఎస్ లో చేరేందుకు మంతనాలు సాగుతున్నాయని చెబుతున్నారు. వీరిద్దరే కాకుండా ఇల్లెందులో కాంగ్రెస్ పార్టీ తరుపున గెలిచిన హరిప్రియ నాయక్ కూడా టిఆర్ఎస్ లో చేరవచ్చని చెబుతున్నారు. తుమ్మల మనుషులు ఆమెతో కూడా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.
హరి ప్రియ నాయక్, కాంగ్రెస్ ఎమ్మెల్యే
ఇక వీరు ముగ్గురే కాకుండా కొత్తగూడెంలో టిఆర్ఎస్ వెలమ నేత జగలం వెంకట్రావును ఓడించిన వనమా వెంకటేశ్వరరావు కూడా టిఆర్ఎస్ లో చేరవచ్చని జోరుగా జిల్లాలో టాక్ నడుస్తోంది. వనమా ఇప్పుడు కాంగ్రెస్ తరుపున గెలిచారు. 2014 ఎన్నికల్లో ఆయన వైసిపి తరుపున పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పటికే ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మనషులు టచ్ లోకి వెళ్లినట్లు సమాచారం అందుతోంది. అతి తొందర్లోనే వనమా కారెక్కే చాన్స్ ఉందని చెబుతున్నారు. ఇప్పటికే వైరా నుంచి గెలిచిన ఇండిపెండెంట్ ను ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డే టిఆర్ఎస్ లో చేర్పించారు. ఇప్పుడ ఆపరేషన్ వనమా పనిలో నిమగ్నమయ్యారు ఎంపి పొంగులేటి అని ఖమ్మం జిల్లాకు చెందిన ఒక టిఆర్ఎస్ నేత వెల్లడించారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 స్థానాలకు గాను టిఆర్ఎస్ కారు గుర్తు ఒక సీటులోనే గెలిచినా ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం నాటికి ఆ సంఖ్య ఏ ఐదారుకు మించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని జిల్లా నేతల్లో టాక్ నడుస్తోంది. ఇప్పటికే ఒక ఇండిపెండెంట్ చేరారు. మరో నలుగురితో మంతనాలు జరుగుతున్నాయి. ఈ సంఖ్య చూసినా మొత్తం సంఖ్య 6కు చేరే చాన్స్ ఉంది. జిల్లాలో బలమైన కాంగ్రెస్ నేత బట్టి మినహా మిగతావారంతా చేరతారా? అన్న ఊహాగానాలు వినబడుతున్నాయి. బట్టి మినహా మిగిలిన వారిలో పోడెం వీరయ్య భద్రాచలం, రేగా కాంతారావు పినపాక మాత్రమే మిగులుతారా అన్నది కూడా చూడాలి.
ఇప్పటికే కారెక్కిన వైరా ఎమ్మెల్యే రాములు నాయక్, కోరుకంటి చందర్ ఫొటోలు కింద ఉన్నాయి చూడొచ్చు.