కడియం శ్రీహరి గృహనిర్బంధం

స్టేషన్ ఘన్పూర్ టిఆర్ ఎస్ అభ్యర్థిగా ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరియే ఉండాలని వేల సంఖ్యలో  స్టేషన్ ఘన్పూర్ ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు వరంగల్ తరలి వచ్చారు. దీనితో సర్క్యూట్ గెస్ట్ హౌజ్ జనసంద్రంగా మారింది.

‘స్టేషన్ ఘన్పూర్ నుంచి పోటీచేయాలని ఆయనను ఒప్పించేందుకు ‘కడియం గృహనిర్భందం’ పిలుపు తో వారంతా ఇలా తరలి వచ్చారు.  గెస్ట్ హౌజ్ ను చుట్టుముట్టారు. ఇలాంటిదెపుడూ ఎక్కడా జరగలేదు.

వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలకు, అభిమానులకు ముకుళిత హస్తాలతో  కడియం శ్రీహరి నమస్కరించారు.

ముఖ్యమంత్రి కెసియార్ ప్రకటించిన 105 పేర్ల జాబితా ప్రకారం స్టేషన్ ఘన్ పూర్ నుంచి డాక్టర్ రాజయ్య పోటీ చేయాలి. అయితే, రాజయవద్దు మీరే రావాలంటూ  ఆయన్ని గ‌‌ృహనిర్బంధం చేసి తమ అభిమానం చాటాలనుకున్నారు. ఇలాంటి ప్రయత్నం తెలంగాణలో జరగడం ఇదే మొదటిసారి. కడియం శ్రీహరికి వున్న విశేష పలుకుబడిని ఇది చాటుతుంది.

కార్యకర్తల, ప్రజల అభిమానానికి పాదాభివందనం చేస్తున్నానని ఉప ముఖ్య మంత్రి కడియం ప్రకటించారు.

అయితే, అలా డిమాండ్ చేయడం సరికాదని  వారికి ఆయన  నచ్చ చెప్పారు.  ముఖ్యమంత్రి కేసిఆర్ గారి నిర్ణయం ఏదైనా తు.చ తప్పకుండా పాటించే వ్యక్తినని, స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి విజయం కోసం పనిచేస్తానని ఆయన అభిమానులకు చెప్పారు.

క్రమశిక్షణ గలిగిన నాయకునిగా, కార్యకర్తగా పార్టీ అధ్యక్షుని నిర్ణయానికి కట్టుబడి ఉంటాను. అదే కార్యకర్తలకు చెబుతున్నానని అన్నారు..

వరంగల్ లో 12 నియోజకవర్గాల్లో గులాబీ జెండా ఎగురవేసే విధంగా అందరం కలిసి సమన్వయంతో పనిచేద్దామని ఆయన పిలుపు నిచ్చారు.

కడియం అభిమానులకు చెప్పిన మాటలు :

 *ప్రధానంగా పార్టీ అభ్యర్థిగా మీరు పోటీ చేయాలని మీరు  డిమాండ్ చేశారు. కానీ నేను ఉప ముఖ్యమంత్రిగా, ఎమ్మెల్సీగా ఉన్నాను. పార్టీ అధ్యక్షుడు కేసిఆర్ ఎంతో నమ్మకంతో నాకు ఉన్నతమైన స్థానం కల్పించారు.

 * టిఆర్ఎస్ పార్టీలోగానీ, ప్రభుత్వంలోగానీ నేను ఆశించిన దానికంటే ఎక్కువగా గౌరవం, స్థానం లభించింది.

* నియోజక వర్గంలో కొంత అసంతృప్తి ఉంది. ఆశించిన అభివృద్ధి జరగలేదనే బాధ ఉంది. కడియం శ్రీహరి మళ్లీ అభ్యర్థిగా వస్తే నియోజకవర్గం బాగు పడుతదనే నమ్మకంతో నా దగ్గరకు వచ్చినట్లు నేను భావిస్తున్నాను.

* ముఖ్యమంత్రి కేసిఆర్ గారు అన్ని సమగ్రంగా ఆలోచించి, అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని పార్టీ అభ్యర్థులను ప్రకటించారు. ఈ నేపథ్యంలో పార్టీ క్రమశిక్షణకు లోబడి ప్రకటించిన అభ్యర్థులకు సహకరించవలసిన అవసరం ఉంది. మీరు సహకరించండి.

రెండు రోజుల కిందట పార్టీ అభ్యర్థి రాజయ్య,  శ్రీహరికి పాదాభివందనం చేసి గెలిచేందుకు ఆశీస్సులందించాలని కోరారు.

నియోజకవర్గంలో ప్రజల్లో ఉన్న మూడ్ డాక్టర్ రాజయ్యకు తెలిసినట్లే ఉంది. మరి ఏమవుతుందో చూడాలి.