ఫ్లాష్ న్యూస్ : అఖిలప్రియకి బెయిల్ నిరాకరణ !

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బోయినపల్లి కిడ్నాప్‌ కేసు నిమిషానికో మలుపు తిరుగుతోంది. ప్రవీణ్‌ సోదరుల కిడ్నాప్‌ కేసును తక్కువ సమయంలో చేధించిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ కేసులో మాజీ మంత్రి భూమా అఖిల ప్రియను అదుపులోకి తీసుకుని.. 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించారు.

ఇక ఈ కేసులో బెయిల్ కోసం అఖిలప్రియ అప్లై చేసుకోగా .. తాజాగా అఖిలప్రియకి బెయిల్ ఇవ్వడానికి సికింద్రాబాద్ కోర్టు నిరాకరించింది. అలాగే మూడు రోజుల పాటు అఖిలప్రియను పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం అఖిలప్రియ చంచల్ గూడాజైల్లో రిమాండ్ ఖైదీగా ఉంది.

సీన్ రేకంస్ట్రక్షన్ తో పాటుగా కేసులో ఇంకా దర్యాప్తు చేయాల్సి ఉందని పోలీసులు కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు.ఈ నేపథ్యంలో కోర్టు ఆమెకి బెయిల్ ఇవ్వడం కుదరదు అంటూ తేల్చేసింది. కేసు దర్యాప్తు సాగుతున్న ఈ సమయంలో బెయిల్ మంజూరు చేస్తే సాక్షులని ప్రభావితం చేసే అవకాశం ఉందని పోలీసులు అంటున్నారు. కాగా, మెరుగైన వైద్యం కోసం తనను ఆసుప‌త్రికి తరలించాలని అఖిలప్రియ ఇంత‌కు ముందూ పిటిషన్‌ దాఖలు చేయ‌గా ఆ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. జైలులోనే అందుబాటులో వైద్యులు, తగిన వైద్య సదుపాయాలు ఉన్నాయని చెప్పింది.