అడ్డంగా బుక్కయిపోయిన అఖిలప్రియ: కొంప ముంచేసిన ‘అతి’

akhilapriya-cross-booked

చిన్న చిన్న తప్పులు కాదు.. పెద్ద పెద్ద తప్పులే చేసేశారు భూమా అఖిల ప్రియ రాజకీయంగా. ఇది ఇప్పుడు కొత్తగా మొదలైన కథ కాదు. వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన భూమా అఖిల ప్రియ, తన తండ్రి భూమా నాగిరెడ్డితోపాటు టీడీపీలోకి జంప్ చేసేసిన విషయం విదితమే. అదే రాజకీయంగా ఆమె చేసిన అతి పెద్ద తప్పిదం. భూమా నాగిరెడ్డి అకాలమరణంతో అఖిలప్రియకు మంత్రి పదవి వచ్చిందిగానీ.. లేదంటే, ఆమెకు ఆ యోగం పట్టి వుండేది కాదు చంద్రబాబు హయాంలో. తరచూ అఖిల ప్రియ మీదకు సొంత పార్టీకి చెందిన నేతల్నే టీడీపీ అధినేత చంద్రబాబు ఎగదోసేవారు.

akhilapriya-cross-booked
akhilapriya-cross-booked

టీడీపీ అధికారంలో వున్నప్పుడూ, టీడీపీ అధికారం కోల్పోయాక కూడా, టీడీపీలో ఆమె అనేక సమస్యల్ని ఎదుర్కొన్నారు.. అనేక సమస్యల్ని పార్టీలో సృష్టించారు కూడా. ఇప్పడామె ఒంటరి. టీడీపీ నుంచి ఆమెకు మద్దతు లభించడంలేదు. కిడ్నాప్ కేసులో అరెస్టయిన అఖిల ప్రియకు బెయిల్ దొరకడం కూడా గగనమైపోతోంది. ‘తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్‌గారూ మా కుటుంబాన్ని ఆదుకోండి.. మమ్మల్ని అర్థం చేసుకోండి..’ అంటూ భూమా కుటుంబం వేడుకుంటోంది. కానీ, అఖిలప్రియ ఇరుక్కుపోయిన కేసు ఆషామాషీగా లేదు. పోలీసులు పక్కా ఆదారాలు సేకరించారు. దాంతో, అఖిలప్రియ ఈ కేసులో సూత్రధారిగా ఇప్పటికే తేలిపోయింది. దాంతో, ఆమె ఈ కేసు నుంచి బయటపడటం అంత తేలిక కాదన్నది న్యాయ నిపుణుల వాదన. రాజకీయం వేరు, ఈ తరహా వ్యవహారాలు వేరు.

 

కానీ, అటు రాజకీయం.. ఇటు ఇలాంటి వ్యవహారాలూ నడపాలంటే, దానికి బోల్డంత అనుభవం కావాలి. రాజకీయాల్లో చాలామంది తెరవెనుక వ్యవహారాలు నడుపుతారు.. ప్రత్యర్థికి చిక్కకుండా వ్యవహారాలు చక్కబెడతారు. ఈ క్రమంలో తమ చేతికి మట్టి అంటకుండా జాగ్రత్తపడతారు. కానీ, అఖిల ప్రియ మాత్రం తన చేతికే స్వయంగా మట్టి అంటించుకున్నట్లు కనిపిస్తోంది పరిస్థితి. పైగా, ఆమె దూకుడుకి, ఆమె భర్త దూకుడు మరింత పెద్ద సమస్యను తెచ్చిపెట్టిందిప్పుడు. ‘మేం ఏ తప్పూ చేయలేదు’ అని భూమా కుటుంబం చెబుతోంటే, ‘ఇవిగో ఆధారాలు’ అని పోలీసులు చెబుతున్నారు. పార్టీ ఫిరాయించిన సమయంలో అండగా నిలిచిన టీడీపీ అధినేత చంద్రబాబు, ఇప్పుడామెను అస్సలు పట్టించుకోకపోవడం గమనార్హం. అదే వైసీపీలో ఆమె వుండిపోయి వుంటే.. అసలామె ఇలాంటి దుస్థితిలోకి నెట్టివేయబడేవారే కాదేమో.!