ఒక్క దెబ్బకు మూడు పిట్టలు, డిఎస్ కథ నడిపిందెవరు ?

ఒక్క దెబ్బకు ఒక్క పిట్ట నేలకూలడం చూశాం.. ఒకే దెబ్బకు రెండు పిట్టలు కూడా నేలకూలిన దాఖలాలున్నాయి. ఒక్క దెబ్బకు మూడు పిట్టలను కొట్టిన ఘనమైన వేటగాళ్లు కూడా ఉన్నారు. ఇప్పుడు నిజామాబాద్ టిఆర్ఎస్ రాజకీయాల్లో ఒక్క దెబ్బకు మూడు పిట్టలు అని జనాలు మాట్లాడుకుంటున్న మాటలు. ఇంతకూ ఒక్క దెబ్బ మూడు పిట్టల కథ ఏంటబ్బా అనుకుంటున్నారా? ఒక్క దెబ్బ కొట్టిందెవరు? రాలిన మూడు పిట్టలేమిటి? తెలుసుకోవాలనుందా? అయితే చదవండి.

ఇప్పుడు నిజామాబాద్ పాలిటిక్స్ తెలంగాణ అంతటా చర్చనీయాంశమవుతున్నాయి. నిజామాబాద్ నగర మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ ను రేపో మాపో తెలంగాణ పోలీసులు అరెస్టు చేయనున్నారు. ఇప్పటికే సంజయ్ మీద నిర్భయ చట్టం కింద కేసు నమోదైంది. ఆయన నడుపుతున్న శాంకరి నర్సింగ్ కాలేజీ అమ్మాయిల పట్ల ధర్మపురి సంజయ్ అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా లైంగిక వేధింపులకు పాల్పడినట్లు కాలేజీ విద్యార్థులు హైదరాబాద్ తరలివచ్చి హోంమంత్రి నాయిని నర్సింహ్మారెడ్డికి ఫిర్యాదు చేశారు. కాలేజీ స్టూడెంట్స్ మాత్రమే కాదు వారి తల్లిదండ్రులు కూడా వారితోపాటు హైదరాబాద్ తరలివచ్చి నాయినిని సచివాలయంలో కలిశారు. సంజయ్ అరెస్టు తప్పదని అర్థమైపోయింది. ఈ ముచ్చట సంజయ్ తోనే ముగుస్తుందా? లేక మరింత ముందుకు, మరింత వేగంగా కదులుతుందా అన్నది చర్చనీయాంశమైంది.

మాజీ పిసిసి అధ్యక్షుడుగా పనిచేసిన డి.శ్రీనివాస్ టిఆర్ఎస్ లో చేరిపోయారు. తెలంగాణ రాగానే ఆయన టిఆర్ఎస్ లో చేరడంతో ఆయనకు రాజ్యసభ సీటు ఇచ్చారు కేసిఆర్. అంతకుముందు ప్రభుత్వ సలహాదారు పదవి కట్టబెట్టారు. అంతా సాఫీగా సాగుతున్నవేళ  డిఎస్ మీద నిజామాబాద్ ఎంపి, సిఎం బిడ్డ కవిత పెద్ద బాంబు విసిరారు. డిఎస్ అనే నేత టిఆర్ఎస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని, తక్షణమే ఆయన మీద వేటు వేయాలని కవిత సిఫార్సు చేశారు. ఆమెకు జిల్లాలో ఉన్న టిఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా మద్దతు పలికారు. డిఎస్ మీద వేటు ఖాయం అన్న ప్రచారం సాగింది. కానీ తనకు అత్యంత సన్నిహితుడు కావడంతో డిఎస్ మీద కేసిఆర్ వేటు వేయలేకపోయారు. నాన్చివేత ధోరణి అనుసరించారు. ఈ విషయం ఎంపి కవితకు మింగుడు పడలేకపోయింది. 

ఒక దశలో డిఎస్ ను టిఆర్ఎస్ లో విలన్ మాదిరిగా క్రియేట్ చేయడంలో ఎంపి కవిత సక్సెస్ అయ్యారు. డిఎస్ పలుకుబడి టిఆర్ఎస్ లో తగ్గిపోయింది. ఆయన ప్రతిష్ట మసకబారే పరిస్థితి దాపురించింది. ఈ నేపథ్యంలో డిఎస్ మీద కేసిఆర్ వేటు వేసి ఉంటే వివాదం సమసిపోయి ఉండేది. కానీ కేసిఆర్ ఆ పనిచేయలేదు. అదే క్రమంలో పార్టీలో ఇబ్బందికర పరిస్థితి వచ్చిందని భావించిన డిఎస్ తనంతట తానుగా పార్టీని వీడినా వివాదం సమసిపోయి ఉండేది. కానీ ఈ రెండూ జరగలేదు. దీంతో కవిత కొత్త స్కెచ్ వేశారు. అదేమంటే రెండో ఫేస్ లో డిఎస్ కొడుకు ధర్మపురి సంజయ్ వివాదంలోకి వచ్చారు. ధర్మపురి సంజయ్ తమను లైంగికంగా వేధిస్తున్నాడని శాంకరి నర్సింగ్ కాలేజీలో చదివే 13 మంది మొదటి సంవత్సరం విద్యార్థులలో 11 మంది హైదరాబాద్ తరలివచ్చి సచివాలయం వెళ్లి హోంంమంత్రి నాయినికి ఫిర్యాదు చేశారు. దానికి పిఓడబ్ల్యూ సంధ్య నాయకత్వం వహించారు. ఇందులో ఏదైనా మతలబు ఉందా అన్న అనుమానాలైతే అందరికీ కలుగుతున్నాయి. 

సాధారణంగా ఇలాంటి ఆరోపణలు వస్తే తక్షణమే విద్యార్థినిలు తమ పేరెంట్స్ కు చెబుతారు. వారు స్థానిక పోలీస్ స్టేషన్ లోనో, లేదంటే జిల్లా ఎస్పీనో కలుస్తారు. ఫిర్యాదు చేస్తారు. కానీ ఏకంగా రాష్ట్ర రాజధానికి వచ్చి సచివాలయంలో ఉన్న హోంమంత్రికి ఫిర్యాదు చేయడం అనుమానాలను రేకెత్తిస్తున్నది. ఇది నిజంగా సీరియస్ సమస్యే కావొచ్చు కానీ వెనుక ఎవరో ఉండి నడిపించకపోతే ఇంతదాకా వస్తుందా అన్న చర్చ ఉంది. ఈ వ్యవహారంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంపి కవిత జోక్యం ఉన్నట్లు డిఎస్ అనుచర వర్గం ఆరోపిస్తోంది. అయితే ఈ విషయాన్ని డిఎస్ తెర మీదకు వచ్చి చెప్పేవరకు డిఎస్ అనుచరులు సైలెంట్ గా ఉన్నారు. నిన్నమొన్నటి వరకు డిఎస్ ఒక్కడికే ఇరకాటం ఉందంటే ఇప్పుడు డిఎస్ పెద్ద కొడుకు కూడా ఇరకాటంలో పడిపోయారు.

ఇక ఈ ఇద్దరూ ఇలా ఇరకాటంలోకి నెట్టబడగా ఈ ఇద్దరి కారణంగా డిఎస్ చిన్నకొడుకు ధర్మపురి అర్వింద్ కూడా అనివార్యంగా ఇరకాటంలోకి నెట్టబడ్డారు. డిఎస్ కాంగ్రెస్ లో చేరతారంటూ ఎంపి కవిత వర్గం బలమైన ఆరోపణలు గుప్పించింది. ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలను డిఎస్ రహస్యంగా కలిశారని ఆరోపించింది. అంతేకాకుండా తన చిన్నకొడుకు అర్వింద్ ను బిజెపికిలోకి పంపడమే కాకుండా ఆయనకు తెరచాటున డిఎస్ మేలు చేస్తున్నాడని ఆరోపించింది. రానున్న ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంటుకు బిజెపి తరుపున పోటీ చేసే యోచనలో ఉన్నారు అర్వింద్. ఆయనను బలోపేతం చేసేందుకు డిఎస్ టిఆర్ఎస్ లో ఉండి ప్రయత్నాలు చేస్తున్నారని కవిత వర్గం ఆరోపణ. ఇటు డిఎస్ మీద మరక, దాంతోపాటు పెద్దకొడుకు సంజయ్ మీద మరక కారణంగా రానున్న ఎన్నికల్లో అర్వింద్ ప్రతిష్ట కూడా మంటగలిసే ప్రమాదం ఉందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. 

మొత్తానికి డిఎస్ టిఆర్ఎస్ లోనే కొనసాగితే తన ఫ్యామిలీ మరిన్ని ఉపద్రవాలను ఎదుర్కోవాల్సి వస్తుందన్న సంకేతాలు ఇప్పటికే బలంగా అందాయి. మరి డిఎస్ ఆలస్యం చేయకుండా టిఆర్ఎస్ కు గుడ్ బై చెబుతారా? లేదంటే టిఆర్ఎస్ మీద ఎదురుదాడికి దిగుతారా అన్నది చర్చనీయాంశమైంది. ఆనాడే డిఎస్ టిఆర్ఎస్ ను వీడితే ఇప్పుడు సంజయ్ వివాదం వచ్చేది కాదేమో అన్న చర్చ కూడా ఉంది. ఏది ఏమైనా ఎంపి కవిత ఒక్క దెబ్బతో ఇటు డిఎస్ ను, ఆయన పెద్ద కొడుకు సంజయ్, చిన్నకొడుకు అర్వింద్ ను కింద పడేశారన్న చర్చ ఉంది. మరి ఇప్పుడు డిఎస్ ఏం చేస్తాడన్నది నిజామాబాద్ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ అయింది.