మంత్రి వర్గం నుంచి తనను తొలగిస్తారనే సమాచారంతో, ఈటెల రాజేందర్ అప్రమత్తమై తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుని శరణు వేడుకున్నారట ఓ లేఖ ద్వారా. ఇదెంత నిజం.? అన్న డౌట్ చాలామందికి రావొచ్చు. నిజమేనంటూ అధికార తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి ఓ లేఖ లీక్ అయ్యింది. ‘ఆ లేఖతో మాకు సంబంధం లేదు’ అని టీఆర్ఎస్ రేప్పుద్దున్న చెప్పుకోవచ్చుగాక. కానీ, అలా లీక్ చేయాల్సిన అవసరం ఎవరికి వుంటుంది.? సోషల్ మీడియా అంటేనే.. ఫేక్ దందా అన్నట్టు తయారైంది పరిస్థితి.
దాంతో, ఈటెల రాజేందర్ పేరుతో వచ్చిన లేఖని చాలామంది ‘ఫేక్’ అనే తేల్చేశారు. ‘ఒక్క ఈటెల రాజేందర్ చుట్టూ ఇన్ని కుట్రలా.?’ అన్న చర్చ తెలంగాణ సమాజంలో జరుగుతోంది. ‘ఆ లేఖతో ఈటెలకు అస్సలేం సంబంధం లేదు..’ అంటూ ఈటెల మద్దతుదారులు స్పష్టం చేసేశారు. ‘తల నరుక్కుంటాగానీ.. ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టబోను..’ అని తెగేసి చెప్పిన ఈటెల రాజేందర్.. ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేసిన ఈటెల రాజేందర్, ‘క్షమాపణ’ లేఖని ఎలా రాస్తారని అనుకోగలం.? అన్నది అసలు సిసలు వాదన.
రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు. లేఖని ఈటెల రాజేందర్ కూడా రాసి వుండొచ్చు.. అంటారు మరికొందరు. ఎవరి గోల వారిది. కానీ, ఈ లేఖ లీక్ అవడం వల్ల ఈటెల ఇమేజ్ మాత్రం పెరిగింది.. అదే సమయంలో తెలంగాణ రాష్ట్ర సమితి బదనాం అయ్యింది. అలా గులాబీ పార్టీని బదనాం చేయడానికి భారతీయ జనతా పార్టీ ఈ లేఖ లీక్ వ్యూహాన్ని రచించలేదు కదా.? హుజూరాబాద్ ఉప ఎన్నిక తప్పనిసరి కావడంతో.. రాజకీయాల్లో ఎత్తులు.. పై ఎత్తులు సర్వసాధారణమే. ఈ క్రమంలోనే ఈటెల లేఖ వ్యవహారం వెలుగులోకి వచ్చిందని అనుకోవాలేమో. ఈ లేఖలతో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోతాయనలేంగానీ.. కొంత ప్రభావం అయితే వుండొచ్చు.