ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి ప్రవర్తిస్తున్నారని అందిన ఫిర్యాదుపై ఈ సీ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ కు నోటిసులు జారీ చేసింది. సీఎం అధికారిక నివాసం ప్రగతి భవన్ తో పాటు మంత్రుల నివాసాల్లో టిఆర్ ఎస్ సమావేశాలు నిర్వహిస్తున్నారంటూ అందిన ఫిర్యాదు పై ఎన్నికల సంఘం స్పందించింది. తక్షణమే 24 గంటల్లోగా సమాధానం చెప్పాలని ఈసీ కేసీఆర్ ను ఆదేశించింది.
ఎన్నికల కోడ్ కు విరుద్దంగా సీఎం, మంత్రుల నివాసాల్లో పార్టీ సమావేశాలు నిర్వహిస్తున్నారని ఆరోపిస్తూ పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి , టిడిపి రమణ, సిపిఐ చాడ వెంకట్ రెడ్డి, టిజెఎస్ కపిలవాయి దిలిప్ కుమార్ లు సీఈసీ రజత్ కుమార్ ను కలిసి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు పై తక్షణమే స్పందించిన ఈసీ కేసీఆర్ కు నోటిసులు జారీ చేసింది. సరైన వివరణ లేకపోతే ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు సంబంధించిన కేసు నమోదు చేస్తామని హెచ్చరించింది.
అసెంబ్లీ రద్దైన తర్వాత దాదాపు 10 సార్లు సీఎం అధికారిక నివాసం ప్రగతి భవన్ లో సమావేశాలు నిర్వహించారని వాటి తేదిలు, సమయం, వార్త క్లిప్పింగులతో సహా నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుల ప్రతిని కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ఎన్నికల సంఘం పంపింది.
మరో వైపు ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి కూడా నేతలు ఫిర్యాదు చేశారు. ప్రతిపక్ష నాయకులకు చెందిన ఫోన్లను ప్రభుత్వం ఇంటెలిజెన్స్ అధికారులతో ట్యాపింగ్ చేయిస్తుందని వారు ఆరోపించారు. దీని పై వివరణ కోరుతూ హోం శాఖ కార్యదర్శి, డిజిపి, ఇంటలిజెన్స్ ఐజిలకు ఎన్నికల సంఘం నోటిసులు జారీ చేసింది. నిజంగానే ట్యాపింగ్ చేస్తున్నారా, ఎందుకోసం ట్యాపింగ్ చేస్తున్నారో అనే అంశాన్ని 24 గంటల్లో తెలియజేయాలని ఆదేశించింది.
ప్రతిపక్ష నాయకుల వాహనాలనే వివక్ష పూరితంగా తనిఖీ చేస్తున్నారన్న మరో ఫిర్యాదు పైన కూడా వివరణ ఇవ్వాలని డిజిపిని ఎన్నికల సంఘం ఆదేశించింది. అదే విధంగా మెట్రో రైళ్లు, పలు రైళ్ల పై కేసీఆర్ బొమ్మ ఉందని వాటిపైన కూడా అందిన ఫిర్యాదుతో వివరణ ఇవ్వాలని రైల్వే శాఖకు ఈసీ నోటిసులు జారీ చేసింది.
కేసీఆర్ ఆపద్దర్మ ప్రభుత్వాన్ని అడ్డు పెట్టుకొని ప్రతిపక్షాలను అణచి వేస్తున్నారని ప్రతిపక్ష నేతలు అన్నారు. ఫోన్లను ట్యాపింగ్ చేసి ఎప్పటికప్పుడు ప్రతిపక్షాలను ఇరుకున పెట్టాలని చూస్తున్నారని వారు ఆరోపించారు. ఫోన్ ట్యాపింగే కనుక నిజమని తేలితే కేసీఆర్ కు జైలు తప్పదన్నారు. ప్రతిపక్షాల ఫోన్లను ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ప్రభుత్వానికెందుకని వారు ప్రశ్నించారు. ఇప్పటి వరకు ప్రతిపక్ష నాయకుల వాహనాలే సోదాలు చేస్తున్నారని అధికార వాహనాలు ఏమి కూడా సోదాలు చేయట్లేదన్నారు. అధికార యంత్రాగాన్ని కేసీఆర్ తన చేతుల్లో పెట్టుకొని ఆటాడుతున్నారని ప్రతిపక్ష నాయకులు దుయ్యబట్టారు.
సీఎం కేసీఆర్ కు నోటిసులు రావడం పై సర్వత్రా చర్చనీయాంశమైంది. సీఎం గా కొనసాగిన కాలంలో కూడా ప్రగతి భవన్ కే అధికారులను పిలిపించుకొని కేసీఆర్ పని చేసేవారు. పార్టీ సమావేశాలు, ఇతర ఏ సమావేశాలైనా సరే ప్రగతి భవన్ వేదికగానే చేసేవారు. సచివాలయానికి ఆయన అసలు వచ్చిన పాపాన పోలేదని ప్రతిపక్షాలు అనేక సార్లు విమర్శించాయి. అయినా కూడా కేసీఆర్ సచివాలయానికి రాలేదు. అసెంబ్లీ రద్దు తర్వాత కూడా ముఖ్య సమావేశాలు, నేతలతో మీటింగ్ లు అన్ని కూడా ప్రగతి భవన్ వేదికగానే సాగాయి. ప్రతిపక్షాల ఫిర్యాదుతో దీనిని సీరియస్ గా తీసుకున్న ఈసీ కేసీఆర్ కు నోటిసులు జారీ చేసింది. మరీ దీని పై కేసీఆర్ ఎటువంటి వివరణ ఇస్తారో అంతటా చర్చనీయాంశమైంది.