వరంగల్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. మాజీ ఉపముఖ్యమంత్రి, స్టేషన్ గన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తాజాగా సంచలన ప్రకటనలు గుప్పించారు. స్టేషన్ గన్ పూర్ నుంచి ప్రస్తుత ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి కుమార్తె డాక్టర్ కడియం కావ్య పోటీ చేస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో రాజయ్య సీరియస్ గా స్పందించారు. ‘‘స్టేషన్ గన్ పూర్ గడ్డ నా అడ్డా.. ఇక్కడ సీటు నాదే.. గెలిచేది నేనే’’ అని బలంగా చెప్పారు. తాను కాంగ్రెస్ పార్టీతో టచ్ లో ఉన్నట్లు వస్తున్న వార్తలను ఖండించారు. ఎప్పుడైతే టిఆర్ఎస్ లో చేరానో అప్పటి నుంచి కాంగ్రెస్ తో టచ్ లో లేను అని స్పష్టం చేశారు. రాజయ్య ఒక టివి చానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు కింద చదవండి.
గన్ పూర్ గడ్డ నా అడ్డా. టికెట్టు నాదే గెలిచేది నేనే. నేను టిఆర్ఎస్ లో చేరిన తర్వాత ఇప్పటి వరకు కాంగ్రెస్ తో నేను టచ్ లో లేను. కడియం కావ్యకు గన్ పూర్ లో ఓటే లేదు. ఆమె పోటీ ఎలా చేస్తారు. గన్ పూర్ లో కనీసం ఆమెకు పరిచయాలు కూడా లేవు. ఆమె ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. ముస్లింలంటే నాకు అపారమైన గౌరవం ఉంది. మరి ఆమె ఎలా ఇక్కడ పోటీ చేస్తారు. ఆమె గన్ పూర్ కు పెద్దగా వచ్చిన దాఖలాలు కూడా లేవు. ఏదో పెళ్లిళ్లకు, పేరంటాలకు తప్ప ఆమె ఇక్కడకు రాలేదు.
అసలు కడియం శ్రీహరికి ముగ్గురు బిడ్డలు ఉన్నారని మాత్రమే గన్ పూర్ జనాలకు తెలుసు తప్ప వారేం చేస్తున్నారో అనే విషయాలేం తెలియవు. రాజకీయాల్లోకి వస్తామంటూ ఇప్పటి వరకు కడియం కూతుళ్లు ఎవరూ గన్ పూర్ లో అడుగు పెట్టలేదు. వారసులు అంటే కొడుకులే తప్ప కూతుళ్లు కాదు. మరి కడియం కూతురు కావ్య ఎట్లా వారసురాలు అవుతారు. వారసత్వ రాజకీయాలు చేయాలంటే నా ఇద్దరు కొడుకులు డాక్టర్లు. నా ఇద్దరు కోడళ్లు కూడా డాక్టర్లే. వాళ్లను రాజకీయాల్లోకి తీసుకువస్తానని నేను ఏనాడు చెప్పలేదు కదా? గన్ పూర్ లో వారసత్వం ముచ్చట పనికిరాదు.
తెలంగాణలో నా కులం చాలా పెద్దది. అతి పెద్ద సామాజికవర్గం మాదిగనే. అ మాదిగ కులానికి నేను ప్రాతినిథ్యం వహిస్తున్నాను. కడియం శ్రీహరి కులానికి గన్ పూర్ లో 300 ఓట్లు కూడా లేవు. కడియం కావ్య గన్ పూర్ కు రావడమనేది అభూత కల్పన. ఒక ముస్లిం కోడలికి గన్ పూర్ ప్రజలు ఓట్లేస్తారని నేను అనుకోను. మాదిగలు అయితే ఎవరూ ఓటు వేయరు.
మనిషి ఇక్కడ లేకుండా, చుట్టపు చూపుగా వచ్చే కావ్యకు సీటెలా ఇస్తారు. ఒటే లేని ఆమెకు జనాలు ఓట్లెలా వేస్తారు. కేవలం కడియం శ్రీహరి కూతురు అన్న ఒక్క అర్హతతో పోటీ చేస్తామనుకుంటే సరికాదు. ఆ ఒక్క అర్హతతో సీటు ఇస్తారని కూడా నేను అనుకోను. దయచేసి ఈ చర్చకు పులిస్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది.