తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు ముహూర్తం పెట్టిన టిఆర్ఎస్ పార్టీకి రోజు రోజుకూ గట్టి ఎదురు దెబ్బలు తాకుతున్నాయి. 2014లో వరంగల్ జిల్లాలో టిఆర్ఎస్ ను నిలబెట్టిన కొండా దంపతులు ఆ పార్టీకి గతంలో గుడ్ బై చెప్పారు. వారి తర్వాత వలసల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా మరో టిఆర్ఎస్ వికెట్ డౌన్ అయింది.
అసెంబ్లీ రద్దు రోజే 105 సీట్లకు అభ్యర్థులను ప్రకటించారు. తర్వాత మరో రెండు సీట్లకు ప్రకటించారు కేసిఆర్. కానీ అభ్యర్థులను మారుస్తారంటూ కొందరు బలమైన నేతలు ఇప్పటికీ నమ్ముతున్నారు. అలా నమ్ముతున్నవారిలో ఒకరు స్టేషన్ ఘన్పూర్ కు చెందిన రాజారపు ప్రతాప్. ఆయన ఇప్పటి వరకు నమ్మకున్నారు. కానీ అభ్యర్థుల మార్పు ఉండదని తేలిపోయింది. దీంతో ఆయన తన నిర్ణయం తీసేసుకున్నారు.
అయితే అభ్యర్థులను మార్చేది లేదు.. గీర్చేది లేదని టిఆర్ఎస్ అధిష్టానం నిక్కచ్చిగా ప్రకటించింది. ఒక్కసారి కాదు పలుమార్లు తేటతెల్లం చేసింది. దీంతో ఇక తమకు సీటు రాదేమో అన్న అనుమానం ఉన్నవారు కారు దిగేందుకు రెడీ అవుతున్నారు. అలా అభ్యర్థిని ప్రకటించినప్పటికీ సీటు కోసం ప్రయత్నం చేసి చివరకు రాదని తేలిపోవడంతో టిఆర్ఎస్ కు గుడ్ బై చెప్పిన నేతల్లో రాజారపు ప్రతాప్ తొలి వ్యక్తిగా రికార్డు కెక్కారు.
జనగామ జిల్లాలోని స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గానికి చెందిన నాయకుడు రాజారపు ప్రతాప్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆయన త్వరలోనే బిఎస్పీ లో చేరి ఆ పార్టీ తరుపున జనగామలో పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. స్టేషన్ ఘన్పూర్ లో మాజీ ఉపముఖ్యమంత్రి తాటికొండ రాజయ్యను మళ్లీ అభ్యర్థిగా కేసిఆర్ ప్రకటించారు.
అయితే రాజయ్య తొలి సర్కారులోనే తీవ్ర వివాదాలు మూటగట్టుకున్నారు. ఆయనను అవమానకరంగా ఉపముఖ్యమంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేశారన్న చర్చ ఉంది. ఆయన అవినీతి అక్రమాలు చేశాడని, ఇతర అలిగేషన్లు ఆయన మీద ఉన్నాయి. దీంతో ఆయనను ఉపముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించారు. తర్వాత సర్వేల ఆధారంగా స్టేషన్ ఘన్పూర్ సీటును కేసిఆర్ ఆయనకే కేటాయించారు.
స్టేషన్ ఘన్పూర్ సీటును చాలామంది టిఆర్ఎస్ లో ఆశించారు. ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి కూతురు డాక్టర్ కడియం కావ్య కూడా స్టేషన్ ఘన్పూర్ సీటును ఆశించారు. ఆమెకు లేడీ కోటాలో సీటు ఖాయమన్న ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా పాత కాపు రాజయ్య కే సీటు దొరికింది. దీంతో ఒక దశలో కడియం ను పోటీ చేయాలంటూ కార్యకర్తలు వత్తిడి పెంచారు. అయితే అంతిమంగా రాజయ్యకే సీటు అని కేసిఆర్ తేల్చేశారు.
ఈ పరిస్థితుల్లో గతంలోనే సీటు హామీతో రాజారపు ప్రతాప్ కాంగ్రెస్ నుంచి టిఆర్ఎస్ లో చేరారని చెబుతున్నారు. కానీ ఆయనకు సీటు రాలేదు. సీటు వస్తుందన్న ఆశలు సన్నగిల్లిపోయాయి. దీంతో ఆయన టిఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. మొన్నట ివరకు కూడా వరంగల్ జిల్లాలో మూడు సీట్లలో అభ్యర్థులను మార్చబోతున్నట్లు గుసగుసలు వినబడ్డాయి. రాజయ్య మీద ఉన్న వ్యతిరేకత కారణంగా చివరి నిమిషంలో ఆయన సీటును వేరేవాళ్లకు ఇస్తారన్న చర్చ జరిగింది.
కానీ అవన్నీ చెల్లుబాటు కావని, కేసిఆర్ నిర్ణయమే ఫైనల్ అని పార్టీలో బలమైన సంకేతాలు అందుతున్నాయి. అందుకే ఇక టిఆర్ఎస్ లో ఉండకూడదన్న ఉద్దేశంతో రాజారపు ప్రతాప్ పార్టీని వీడారు. ఆయన తెలంగాణలో బిఎస్పీ నుంచి పోటీ చేసే తొలి అభ్యర్థిగా ఆయన మరో రికార్డు కూడా నెలకొల్పే చాన్స్ ఉంది. అయితే మహా కూటమిలో సీట్ల రాని గట్టి పట్టున్న నేతలు రానున్న రోజుల్లో బిఎస్పీ వైపు తొంగి చూసే అవకాశాలు లేకపోలేదు.