తెలంగాణ జన సమితిలో ఉద్యమకారులకు అన్యాయం జరుగుతుందని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టిఆర్ఎస్ లో కూడా ఉద్యమకారులకు స్థానం లేకుండా చేసి అవమాన పరిచారని తెలంగాణ జనసమితిలోనైనా ఉద్యమకారులకు స్థానం ఉంటుందని ఆశిస్తే ఇక్కడ కూడా టిఆర్ఎస్ పాలసీ నడుస్తుందని పలువురు నేతలు తెలిపారు.
ముఖ్యంగా సీట్ల కేటాయింపుతో తెలంగాణ జన సమితిలో అగ్గి రాజేసుకుంది. మిర్యాలగూడ సీటు కేటాయింపు విషయంలో జనసమితిలో విబేధాలు బయటపడ్డాయి. టిజెఎసీ ఉన్నప్పుడు కోదండరామ్ వెంట అంబటి నాగయ్య, పందుల సైదులు, విటి. బేగ, కంచె శ్రీనివాస్ లు నల్లగొండ జిల్లాలో కీలక పాత్ర పోషించారు. కోదండరామ్ కి సన్నిహితులుగా ఉండేవారు. ఉద్యమ కాలంనాటి కొలువుల కొట్లాట, అమరుల స్పూర్తి యాత్రలో వీరంతా కీలక పాత్ర పోషించారు. తెలంగాణ జనసమితి ఏర్పడిన తర్వాత వీరంతా కోదండరామ్ తో కలిసి పార్టీలో చేరారు.
తెలంగాణ జన సమితిలో కూడా వీరికి మంచి ప్రాధాన్యతే దక్కింది. అయితే అనూహ్యంగా రిట్టైర్ట్ ఐఆర్ఎస్ అధికారి విద్యాధర్ రెడ్డి పార్టీలో చేరారు. విద్యాధర్ రెడ్డి ఆర్ధికంగా నిలదొక్కుకున్న వారు, విద్యావంతుడు కావడంతో పార్టీ కార్యక్రమాలకు ఇటువంటి నేత అవసరం ముఖ్యమని కోదండరాం విద్యాధర్ రెడ్డి పార్టీలో కీలక ప్రాధాన్యం కల్పించారు. అయితే ఉద్యమకారులకు దక్కుతుందనుకున్న మిర్యాలగూడ సీటు విద్యాదర్ రెడ్డికి కేటాయించారు.
మిర్యాలగూడ సీటు జానా బంధువుకు ఇస్తారనే అనుమానాలతో విద్యాధర్ రెడ్డి తెలంగాణ జన సమితిని తెలంగాణ జానా సమితి అని కూడా పిలిచారు. పార్టీ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన అనుచరులతో కలిసి వెళ్లి కోదండరాం ఇంటి ముందు ఆందోళన నిర్వహించారు. పార్టీ పరిస్థితుల దృష్ట్యా తప్పనిసరి పరిస్థితిలో కోదండరాం బీఫాం అందజేసినట్టు తెలుస్తోంది. అయితే ఇప్పడు అదే సీటులో కాంగ్రెస్ కూడా తన అభ్యర్దిగా ఆర్ కృష్ణయ్యని ప్రకటించింది.
టిఆర్ఎస్ లో ఉద్యమకారులకు అన్యాయం జరిగింది. ఉద్యమ రథసారధి కోదండరాం పెట్టిన పార్టీలో కూడా ఉద్యమకారులకు అన్యాయం జరుగుతుందంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారని పలువురు నేతల ద్వారా తెలుస్తోంది. పార్టీ కోసం అహర్నిషలు శ్రమించే వారికి తగిన గుర్తింపు ఇవ్వకుంటే ఇబ్బందులు వచ్చే పరిస్థితి ఉందన్నారు.
పార్టీ కేటాయించిన అన్ని స్థానాల్లోను దాదాపు నిన్న మొన్న వచ్చిన వారికే పట్టం కట్టారని ఉద్యమకారులకు సరైన గుర్తింపు దక్కలేదన్నారు.కోదండరాం ముందుగానే ఇటువంటి లుకలుకలను గమనించి పార్టీని సక్కదిద్దాలని లేకపోతే ప్రమాదం తప్పదని వారన్నారు. మొత్తానికి టిజెఎస్ లో అంతర్గత కుమ్ములాట చర్చనీయాంశమైంది.