సికింద్రాబాద్ లో ఘోరా అగ్నిప్రమాదం … 8 కి చేరిన మృతుల సంఖ్య…!

సోమవారం రాత్రి సికింద్రాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అగ్ని ప్రమాదం వల్ల దట్టమైన పొగ వ్యాపించటంతో సమీపంలో ఉన్న లాడ్జిలో వసతి పొందుతున్న ఏడుగురు పర్యాటకులు మృతి చెందారు. వీరిలో ముగ్గురు అక్కడికక్కడే మరణించగా మరో నలుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. తాజాగా మృతుల సంఖ్య ఎనిమిదికి చేరుకుంది. ఎలక్ట్రిక్ బైక్ షోరూంలో అంటుకున్న మంటలు పై అంతస్తులో ఉన్న లాడ్జికి వ్యాపించి లాడ్జి మొత్తం మంటలు అంటుకోవటంతో ఈ భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.

వివరాలలోకి వెళితే.. సికింద్రాబాద్ పాస్‌పోర్టు ఆఫీస్ సమీపంలో ఐదంతస్తుల రూబీ లగ్జరీ ప్రైడ్‌ భవనంలో సెల్లార్ గ్రౌండ్ ఫ్లోర్లో రూబీ ఎలక్ట్రిక్ వాహనాలు షోరూమ్ ఉంది. మిగిలిన నాలుగు అంతస్తులో హోటల్ ఉంది. ఈ క్రమంలో సోమవారం రాత్రి 9.40 గంటల సమయంలో గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న ఎలక్ట్రిక్ బైక్ షోరూం లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఉన్నట్లుండి మంటలు చెలరేగాయి. దీంతో షో రూమ్ లో ఉన్న ఎలక్ట్రిక్ బైక్ లో ఉన్న బ్యాటరీలు పేలి మంటల ఉద్ధృతి మరింత పెరిగింది. ఈ క్రమంలో మంటలు పై అంతస్తులకు కూడా పాకాయి. దట్టమైన పొగతో మంటలు అమ్ముకోవటం వల్ల హోటల్ రూమ్ లో ఉన్న పర్యాటకులు ఊపిరాడక సృహ కోల్పోయి పడిపోయారు.

దీంతో వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేసి సమాచారం అందించారు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది చాలా సమయం శ్రమించి మంటలను అదుపు చేశారు. దీంతో లాడ్జిలో బస చేస్తున్న మొత్తం 25 మంది పర్యాటకులను గాంధీ ఆసుపత్రికి తరలించారు. 25 మంది పర్యాటకులలో ముగ్గురు అక్కడే ప్రాణాలు కోల్పోగా ఐదు మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన వారి ఆరోగ్య పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ కూడా విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు నష్టపరహారం అందేలా చూడమని అధికారులను ఆదేశించాడు.