బోయినపల్లిలో ఘోర ప్రమాదం… పెట్రోల్ ట్యాంక్ ఢీకొట్టడంతో ప్రాణాలు కోల్పోయిన యువకుడు..!

ప్రతిరోజు వందల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. వాహనాలు నడిపే సమయంలో నిర్లక్ష్యంగా వాహనాలు నడపటం వల్ల ఈ ప్రమాదాలు చోటుచేసుకుని ప్రతిరోజు ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే ఈ ప్రమాదాలు జరగటానికి వాహనాల రద్దీ పెరగటం కూడా ఒక కారణం అని చెప్పవచ్చు. ప్రమాదాలను అరికట్టటానికి పోలీసులు కఠిన చర్యలు చేపడుతూ అధిక మొత్తంలో పైన వసూలు చేస్తున్న కూడా వాహనదారులు అతివేగంగా వాహనాలు నడుపుతూ ప్రమాదాలు చేస్తున్నారు. బోయినపల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. యువకుడు పెట్రోల్ ట్యాంకర్ కిందపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… అదిలాబాద్ జిల్లాకు చెందిన అభినవ రెడ్డి అనే యువకుడు కొంతకాలంగా హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నాడు. అయితే గురువారం కూడా తన పని ముగించుకొని బాలానగర్ నుండి సికింద్రాబాద్ వైపు తన ద్విచక్ర వాహనం మీద వెళ్తున్నాడు. అభినవ్ రెడ్డి బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ చౌరస్తా వద్ద మలుపు తిరుగుతున్న సమయంలో ఆ మార్గంలో వేగంగా వస్తున్న పెట్రోల్ ట్యాంక్ తగిలి ద్విచక్ర వాహనం నుండి కింద పడిపోయాడు.

పెట్రోల్ ట్యాంకర్ నడుపుతున్న డ్రైవర్ అభినవ్ రెడ్డి పడిపోయిన విషయం గమనించకుండా వేగంగా టాంకర్ నడపటంతో కింద పడిపోయిన అభినవరెడ్డి మీదుగా టాంకర్ వెళ్ళింది. ఈ ఘటనలో అభినవ్ రెడ్డి ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ప్రమాదం గమనించిన స్థానికులు వెంటనే అక్కడికి చేరుకొని పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అభినవ్ రెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ప్రమాదానికి కారణమైన పెట్రోల్ ట్యాంకర్ డ్రైవర్ పరారీలో ఉండగా అతని కోసం గాలింపు చర్యలు మొదలుపెట్టారు.