దానం నాగేందర్ స్పీచ్, కేకే కూతురు ఏం చేశారంటే (వీడియో)

కాంగ్రెస్ లో ఉండి ఉండి చాలా ఆలస్యంగా టిఆర్ఎస్ గూటికి చేరిపోయారు మాజీ మంత్రి దానం నాగేందర్. కాంగ్రెస్, టిడిపి పార్టీల నుంచి చాలా మంది తెలంగాణలో టిఆర్ఎస్ అధికారంలోకి రాగానే బంగారు తెలంగాణ సాధించాలన్న ఆశయంతో టిఆర్ఎస్ లో చేరిపోయారు. వారందరినీ బిటి బ్యాచ్ అని ముద్దుగా పిలుచుకుంటారు.

తొలుత దానం నాగేందర్ కూడా టిఆర్ఎస్ లో ఎప్పుడో జాయిన్ కావాల్సిన వ్యక్తి. కానీ కండువా కప్పే దగ్గర తేడా రావడంతో ఆయన జాయినింగ్ వాయిదా వేసుకున్నారు. పెట్టిన ఫ్లెక్సీలు ఉడబీకేయించారు. తర్వాత కండువా కప్పాల్సిన వ్యక్తి గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే బంగారు తెలంగాణ సాధన కోసం దానం నాగేందర్ కూడా కలిసొచ్చారు. టిఆర్ఎస్ గూటిలో చేరిపోయారు.

ఇంత వరకు బాగానే ఉన్నా దానం కు ఇప్పుడు సీటు భయం పట్టుకున్నది. ఆయనేమో ఖైరతాబాదే కావాలని అంటున్నారు. కానీ ఆయనకు గోషామహల్ పొమ్మని అధిష్టానం చెబుతున్నది. మరి గోషామహల్ లోనేమో తన చిరకాల దోస్తు ముఖేష్ గౌడ్ ఉన్నడు. చూసి చూసి ఆయన మీద పోటీ చేయడం దానంకు సుతారం ఇష్టం లేదని వార్తలొస్తున్నాయి.

 

దానం పోటీపై ఇంకా తుది ినిర్ణయం ప్రకటించలేదు గులాబీ బాస్. దానం ఖైరతాబాద్ లోనే పోటీ చేయవచ్చని చూఛాయగా వార్తలొస్తున్నాయి. ఈ సమయంలో దానం నాగేందర్ ప్రచారం కూడా చేపట్టారు. ఒక ప్రచార సభలో దానం నాగేందర్ స్పీచ్ దంచి కొడుతున్నారు.. ఆ సమయంలో కేకే కుమార్తె, సిటీ కార్పొరేటర్ విజయలక్ష్మి మెల్లగా అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు ప్రిపేర్ అయింది. తను వెళ్లిపోయేందుకు సైడ్ ఇవ్వాలంటూ పక్కనున్న మహిళలకు విజయలక్ష్మి సైగ చేసింది. 

ఆ సమయంలో దానం నాగేందర్ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల గురించి టిఆర్ఎస్ సర్కారు చేస్తున్న కార్యక్రమాలను వివరిస్తున్నారు. ఇంతలో విజయలక్ష్మి బయటకు వెళ్లిపోతున్న విషయం గుర్తించిన దానం ఆమె చెయ్యి పట్టుకుని మీరు ఎటు పోతున్నరు అక్కా ఉండండి అంటూ ఆపేశారు. దాంతో విజయలక్ష్మి అక్కడ నిలబడిపోయారు. దానం స్పీచ్, విజయలక్ష్మి ఎస్కేప్ ప్లాన్, ఆమెను దానం నిలువరించడం అన్నీ పైన ఉన్న వీడియోలో క్లియర్ గా కనబడుతున్నాయి. ఒకసారి చూడండి.

 

రేస్ లో పిజెఆర్ కుమార్తె విజయారెడ్డి 

ఖైరతాబాద్ బరిలో పోటీకి దిగేందుకు దివంగత కాంగ్రెస్ నేత పి జనార్దన్ రెడ్డి కుమార్తె, స్థానిక కార్పొరేటర్ విజయారెడ్డి కూడా సీరియస్ గా ఏర్పాట్లలో ఉన్నారు. ఆమె ఎట్టి పరిస్థితుల్లోనూ ఖైరతాబాద్ నుంచే పోటీ చేస్తానని ప్రకటించారు. తనకు టికెట్ వస్తుందన్న ఆశతో ఉన్నారు. అయితే దానం కూడా ఆ సీటులోనే పోటీకి దిగుతానని ప్రకటించారు. మరోవైపు టిఆర్ఎస్ యూటి బ్యాచ్ నేత మన్నె గోవర్దన్ రెడ్డి కూడా పోటీకి రెడీ అయ్యారు. దీంతో ఈ సీటుపై పీటముడి పడింది. ఎవరికి ఇవ్వాలో తేల్చలేకపోయారు కేసిఆర్.

పిజెఆర్ కుమార్తె విజయారెడ్డి

ఒకవేళ ఈ సీటును దానం నాగేందర్ కు ఇస్తే విజయారెడ్డి పార్టీ మారుతారని, కాంగ్రెస్ పార్టీకి వెళ్లి ఆ పార్టీ తరుపున పోటీ చేస్తారని కూడా రాజకీయ వర్గాల్లో టాక్ జోరుగా నడుస్తోంది.