నిన్న మొన్న గాంధీభవన్, టిడిపి భవన్ ముందు ధర్నాలు జరిగాయి. కూటమిలో సీటు మా లీడర్ కే రావాలని కార్యకర్తలు వచ్చి ధర్నాలు చేశారు. తెలంగాణ జన సమితి ఆఫీసు ముందు కూడా మహబూబ్ నగర్ కు చెందిన నాయకుడి మనుషులు వచ్చి ధర్నా చేశారు. గాంధీ భవన్ ముందైతే కొందరు కార్యకర్తలు ఒక మెట్టు పైకెక్కి ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేశారు. కానీ సహచర కార్యకర్తలు అడ్డుకున్నారు. తాజాగా హైదరాబాద్ లో టిఆర్ఎస్ ఆఫీసు ముందు కూడా కొత్తగా ఆందోళనలు షురూ అయ్యాయి.
అదేంటి 107 మంది అభ్యర్థులను క్లియర్ చేసినా ధర్నాలు చేయడమేంటి అనుకుంటున్నారా? పెండింగ్ సీట్లు ఉన్నాయి కదా ఇంకా. ఆ స్థానాలకు చెందిన నాయకులు తమకు సీటు వస్తదో రాదో అన్న భయమో? లేదంటే తమకే సీటు రావాలంటే వత్తిడి పంచడమే మంచిదన్న ముందుచూపుతోనో కానీ టిఆర్ఎస్ భవన్ ముట్టించారు ఖైరతాబాద్ టిఆర్ఎస్ నేతలు.
మన్నె గోవర్దన్ రెడ్డి ఖైరతాబాద్ నాయకుడిగా ఉన్నారు. ఆయన సతీమణి ప్రస్తుతం కార్పొరేటర్ గా ఉన్నారు. ఖైరతాబాద్ సీటు తనకే రావాలని ఆయన తన ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఆయనతోపాటు ఖైరతాబాద్ ను మాజీ మంత్రి దివంగత నేత పిజెఆర్ కూతురు విజయా రెడ్డి కూడా ఆశిస్తున్నారు.
వీరిద్దరే కాకుండా బిసిలకు కాంగ్రెస్ పార్టీలో అన్యాయం జరుగుతుందంటూ సంచలన విమర్శలు గుప్పించి పార్టీకి గుడబ్ చెప్పి టిఆర్ఎస్ లో చేరిన మాజీ మంత్రి దానం నాగేందర్ కూడా ఇదే సీటును ఆశిస్తున్నారు. ఇలా ఆశావహులు పెద్దసంఖ్యలో ఉండడంతో ఈ సీటు పెండింగ్ లో పడింది. అతి త్వరలోనే ఈ సీటులో అభ్యర్థిని ఫైనల్ చేయబోతున్నట్లు సమాచార అందడంతో మన్నె గోవర్దన్ రెడ్డి మనుషులు తెలంగాణ భవన్ ముందు ఆందోళన చేపట్టారు.
వారి డిమాండ్ ఏమంటే ఖైరతాబాద్ సీటును ఉద్యమకారుడైన మన్నె గోవర్దన్ రెడ్డికే ఇవ్వాలని. కొత్తగా వచ్చిన దానం కు ఆ సీటు ఇస్తే ఉద్యమ కారులకు గౌరవం దక్కదని అంటున్నారు. అంతేకాదు ఒకప్పుడు దానం నాగేందర్ ఉద్యమకారులను లాఠీ చేతబట్టి ఉరికించి కొట్టిన విషయాన్ని మన్నె అనుచరులు చెబుతున్నారు. అటువంటి వ్యక్తికి టికెట్ ఇస్తే సహించేదిలేదంటున్నారు.
జై కేసిఆర్, జై టిఆర్ఎస్ అంటూనే ఉద్యమ కారులకు టికెట్ ఇవ్వాలని వారు నినాదాలు చేశారు. పోలీసులు జోక్యం చేసుకుని వారి ఆందోళనను విరమింపజేశారు. ఆందోళన కారుల వీడియో కింద ఉంది చూడండి.