కరోనా మహమ్మారి కేసులు రోజురోజుకి పెరిగిపోతుండటంతో వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా , ఎప్పుడు మాకు ఈ బెడద తప్పిపోతుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు. ఇక ఈ మద్యే ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ అనేది కొన్ని దేశాలు ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కరోనా టీకాలు వేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైన తరుణంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా కరోనా వ్యాక్సిన్ వేసే తేదీలను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది.
జనవరి 18వ తేదీన తెలంగాణలో తొలి కరోనా టీకా వేయాలని నిర్ణయించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
తెలంగాణ కేంద్రంగా వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేస్తున్న భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాక్సిన్‌ను రాష్ట్రంలో వేయనున్నట్టు సమాచారం.కరోనా టీకా వేయడానికి సంబంధించిన అన్ని వసతులు, ఏర్పాట్లు చేసుకోవాలంటూ ఇప్పటికే రాష్ట్రాలకు కేంద్రం కొన్ని మార్గదర్శకాలు సూచించింది. కరోనా వ్యాక్సిన్ ఎప్పుడు పంపిణీ చేయాలి, ఎలా చేయాలి, ఎవరికి ముందు ఇవ్వాలనే అంశాలకు సంబంధించి రెండు రోజుల పాటు తెలంగాణ వైద్య శాఖ అధికారులు ముమ్మర కసరత్తు చేశారు. రెండు లేదా అంతకంటే ఎక్కువ రకాలైన కరోనా వ్యాక్సిన్లు రాష్ట్రంలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.