సిరిసిల్ల : కాంగ్రెస్ విహెచ్ కు తృటిలో తప్పిన ప్రమాదం

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హన్మంతరావు ప్రమాదంలో చిక్కుకున్నారు. సిరిసిల్ల జిల్లాలో బుధవారం రోడ్ షో అనంతరం ఆయన హైదరాబాద్ తిరుగుపయనం అయ్యారు. ఈ సమయంలో తంగళ్లపల్లి మండలంలోని నేరెళ్ల గ్రామ శివారులో ఆయన ప్రయాణిస్తున్న వాహనం వెనుక చక్రాలు ఊడిపోయాయి. దీంతో ప్రచార రథం ఒక పక్కకు ఒరిగిపోయింది. 

ఈ ప్రమాదంలో విహెచ్ తో పాటు ప్రయాణిస్తున్న నాయకులకు తృటిలో ప్రమాదం తప్పింది. అయితే  విహెచ్ రోడ్ షో నిర్వహిస్తున్న సమయంలో ప్రచార రథం చక్రాల నట్లు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు విప్పి పడేశారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. అందుకే ప్రచార రథం వెనుక గిల్లలు ఊడిపోయాయని వారు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని తెలిసింది.

ఈ ఘటనపై ప్రభుత్వం విచారణ జరిపి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని విహెచ్ డిమాండ్ చేశారు. టిఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వారిని ఫినిష్ చేయాలని కేసిఆర్ ప్రభుత్వం చూస్తోందని ఆయన మండిపడ్డారు. ఈ ఘటన కాంగ్రెస్ వర్గాల్లో కలవరం రేపింది. అన్ని గిల్లలు ఒకేసారి ఊడిపోవడాన్ని కుట్రగా భావిస్తున్నారు విహెచ్. ఈ పని టిఆర్ఎస్ వారే చేశారని ఆయన ఆరోపించారు. నేరెళ్లలో బాధిత దళితులకు అండగా ఉన్నందుకు అక్కడి టిఆర్ఎస్ వారు ఈ పనిచేశారని ఆయన ఆరోపిస్తున్నారు. 

ఇసుకమాఫియా వివాదం నేరెళ్ల దళితుల విషయంలోనే…

సిరిసిల్ల జిల్లాలోని నేరెళ్ల గ్రామంలో ఇసుక లారీలను కొందరు యువకులు గత ఏడాది క్రితం తగలుబటెట్టారు. మెరుపు వేగంతో లారీలు తోలుతూ జనాలను భయబ్రాంతులకు గురిచేస్తుండడంతో గ్రామస్తులు ఆగ్రహంతో కొన్ని లారీలు ఆపి కాలబెట్టారు. అయితే ఇక్కడ ఇసుక మాఫియాను సర్కారే నడుపుతోందని కాంగ్రెస్ విమర్శించింది. దీంతో ఇసుకమాఫియా పెద్దల సూచన మేరకు పోలీసులు నేరెళ్ల యువకులను చితకబాదడమే కాదు థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఆరోపణలున్నాయి. 

నేరెళ్ల ఇష్యూలో విహెచ్ చివరి వరకు బాధితుల పక్షాన పోరాటం చేశారు. బాధితులకు అండగా ఉన్నారు. ఆ సమయంలో మాజీ లోక్ సభ స్పీకర్ మీరా కుమార్ కూడా నేరెళ్ల బాధితులను పరామర్శించి కంటతడి పెట్టారు. అయితే అదే గ్రామంలో విహెచ్ పై కుట్ర జరిగిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.