విజయశాంతి రాజకీయ నాయకురాలుగా ఉండటం వల్ల ఏ పార్టీకైనా ఉపయోగం ఉందా? అసలు ఆమె వల్ల అదనంగా ప్రయోజనం ఏమైనా ఉంటుందా? కానీ ప్రతిసారీ విజయశాంతి పార్టీ మారుతున్నారని జరిగే ఆర్భాటపు ప్రచారానికి మాత్రం తక్కువేమి లేదు. విజయశాంతి మెదక్ ఎంపీగా ఒకసారి గెలిచారు. అదీ టీఆర్ఎస్ పుణ్యమా అని. అప్పటి నుండి విజయశాంతి తనకు తెలంగాణలో సూపర్ ఇమేజ్ ఉందని ఇంకా భ్రమలోనే ఉన్నారు.ఏవీ లేని విస్తరాకు ఎగిరెగిరిపడుతుందట. అలా ఉంది విజయశాంతి పరిస్థితి.
టీఆర్ఎస్ లో విభేదించిన తర్వాత బీజేపీలో చేరారు. అక్కడి నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లారు. ఒక్క టీఆర్ఎస్ లో తప్ప విజయశాంతికి ఎక్కడా వర్క్ అవుట్ కాలేదు. విజయశాంతి ఏ పార్టీలో చేరినా ఢిల్లీ వెళ్లి చేరాల్సిందే. అక్కడి పెద్దల సమక్షంలో ఆమె కండువా కప్పేసుకుంటారు. ఇక్కడి నేతలు ఆమెకు పురుగులతో సమానం. పార్టీ కార్యాలయానికి కూడా రారు. ఒకసారి ఆహ్వానం అందలేదంటారు. మరోసారి తీరిక లేదంటారు.
ఇక తాజాగా విజయశాంతి మరోసారి వార్తల్లోకి ఎక్కారు. కాంగ్రెస్ ను వీడి బీజేపీలోకి వెళుతుందని. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డితో భేటీ ఈ ప్రచారానికి మరింత ఊతమిచ్చింది. అయితే ఇంతలోనే కాంగ్రెస్ నేతలు ఆమె ఇంటికి వెళ్లి వెళ్లవద్దంటూ అభ్యర్థించారని వార్తలొచ్చాయి. విజయశాంతి కాంగ్రెస్ లోనే కొనసాగుతారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అసలు విజయశాంతికి అంత సీన్ ఉందా? అన్న చర్చ సాధారణ ప్రజల్లోనూ జరుగుతుండటం విశేషం. విజయశాంతిని చూసి ఓటేసే వారు ఎవరూ లేకపోయినా ఎన్నికల సమయంలో స్టార్ క్యాంపెయినర్ గా ఉపయోగపడతారు అని ఆమె విషయంలో జాతీయ పార్టీ కాంగ్రెస్ వాళ్ళు ఇంతలా తపన పడుతున్నారని విశ్లేషకుల అభిప్రాయం.