కెసిఆర్ కల నెలవేరుస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే…

తెలంగాణ 2018  అసెంబ్లీ ఎన్నికల్లో కెసిఆర్ కల 100 సీట్లు గెలవడం.

డిసెంబర్లో హుస్నాబాద్ నుంచి ఎన్నికల క్యాంపెయిన్ మొదలుపెట్టడానికి ఒక రోజు ముందు ఆయన హైదరాబాద్ లో విలేకరులతో మాట్లాడు తన నూరు సీట్ల గెలుపు కల గురించి చెప్పారు. 

అంటే అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యులు నూరు మంది ఉండాలి. ఎన్నికల్లో ఘన విజయం సాధించినా ఈ కోరిక మాత్రం నెరవేరలేదు. టిఆర్ ఎస్ ఈ మ్యాజికల్ ఫిగర్ నూరు ను చేరుకోలేకపోయింది. 88 దగ్గిరే ఆగిపోయింది. కెసిఆర్ కల నెరవేరకుండాపోయింది.

అయితే, లక్ష్యసాధనలో కెసిఆర్ ను మించిన వారెవరూ లేరు. ఏదో విధంగా ఆయన అనుకున్నది సాధించి తీరతారు. అందుకే ఎన్నికల్లో దొరకని సెంచురీని ఆయన ఎన్నికల తర్వాత కొట్టాలనుకున్నారు.కొట్టబోతున్నారు.

తనకు తెలిసిన రాజకీయవశీకరణ విద్యను  ఆయన  ప్రయోగించారు. అంతే, ఇండిపెండెంట్, టిడిపి , కాంగ్రెస్ సభ్యులు అలా టిఆర్ ఎస్ వైపు కొట్టుకుపోవడం మొదలయింది.కెసిఆర్ బలగం 99 దాకా చేరింది. ఇక మిగిలింది ఒక్కరే.. ఆ ఒక్కరు ఎవరు… ఆగౌరవం ఎవరికి దక్కుతుంది. కెసియార్ కలను నిజం చేస్తున్న ఆయన ఎమ్మెల్యే పేరు చరిత్రలో మిగిలిపోనున్నది.


కెసిఆర్ కలను నిజం చేస్తున్నది కాంగ్రెస్ ఎమ్మెల్యే. ఆయన పేరు వనమా వేంకటేశ్వరరావు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కొత్త గూడెం నుంచి కాంగ్రె స్ అభ్యర్థిగా గెలుపొందారు. నిజానికి ఆయన మంచి మెజారిటీ తో గెలుపొందారు. వనమాకు 81,118 (46.78 శాతం) ఓట్లు వచ్చాయి. తెలంగాణ రాష్ట్రసమితి అభ్యర్థి జలగం వెంకటరావు కు 76,979 (44.39 శాతం) ఓట్లు పోలయ్యాయి. అయినా సరే ఆయన ప్రజాభీష్టం మేరకు పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు.

ఆయన నిన్న కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. తర్వాత ముఖ్యమంత్రి కెసియార్ ను దర్శించుకున్నారు. ఆయన కారు ఎక్కేస్తే అసెంబ్లీ లో ట్రజరీ బెంచెస్ సంఖ్య నూరు చేరుతుంది. నూరు చేరిందిన ఇంకా పెరగకుండా మానదు. అందుకే వనమా వేంకటేశ్వరరావు ను టిఆర్ ఎస్ నేతలు తెగ అభినందిస్తున్నారట.
జనాభీష్టం మేరకే తాను కాంగ్రెస్ కు రాజీనామా చేసి టిఆర్ ఎస్ లోచేరుతున్నానని ఆయన ప్రకటించారు.

2014 ఎన్నికల్లో ఘన విజయం సాధించి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నరేంద్రమోదీ తన కలను వ్యక్తం చేశారు. అది ‘కాంగ్రెస్ ముక్త్’ భారత్.అంటే కాంగ్రెస్ ఎక్కడా కనిపించని భారతదేశం. అదేమో గాని, కాంగ్రెస్ ముక్త్ తెలంగాణ అనే కెసిఆర్ కల నిజమయ్యేలా కనిపిస్తూ ఉంది.