ప్లేట్ ఫిరాయించిన కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ రాములమ్మ

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్, మాజీ అగ్రశ్రేణి సినీ నటి విజయశాంతి అలియాస్ రాములమ్మ మనసు మార్చుకున్నారా? ఆమె నిన్నటి వరకు ఒక మాట చెప్పి ఇప్పుడు ఇంకో మాట చెబుతున్నారా? ఒక్క మాటలో చెప్పాలంటే విజయశాంతి   ప్లేట్ ఫిరాయించారా? అంటే అవుననే సమాధానం వినబడుతున్నది. సంచలనం రేపిన ఈ వార్త తాలూకు పూర్తి వివరాలు కింద చదవండి.

విజయశాంతి తెలంగాణ ఎన్నికల రణరంగంలో దిగి తన సత్తా ఏంటో నిరూపించుకోవాలని తాజాగా అనుకుంటున్నారు. నిన్నటి వరకు ఆమె తాను ఎక్కడా పోటీ చేయబోనని తెలంగాణ అంతటా తిరిగి ప్రచారం చేస్తానని ప్రకటించారు. దీంతో ఆమెకు కాంగ్రెస్ అధిష్టానం కీలక బాధ్యతలు కట్టబెట్టింది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి స్టార్ క్యాంపెయినర్ గా ఆమెను నియమించింది.

అలా నియమించిన తర్వాత పాలమూరుతోపాటు పలు జిల్లాల్లో రాములమ్మ పర్యటించారు. ఆమె వండర్ ఫుల్ స్పీచ్ లతో అదరగొట్టారు. కేసిఆర్ పై విమర్శ ల వర్షం కురిపించారు. కేసిఆర్ ఫ్యామిలీ తాలూకు లోగుట్టును కూడా విప్పేశారు. ఇక రాములమ్మ మిగతా తెలంగాణ జిల్లాల్లో కూడా ప్రచారం చేస్తారని చెప్పుకున్నారు. ఆమె స్పీచ్ లతో అదరగొట్టేశారని కాంగ్రెస్ కూడా జోష్ లో ఉంది.

ఈ పరిస్థితుల్లో ఒక్కసారిగా రాములమ్మ కాంగ్రెస్ పార్టీతోపాటు మహా కూటమిలోనే బాంబు పేల్చారు. తాను ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. ఆమె పోటీ కూడా కొత్త నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. గతంలో ఆమె మెదక్ జిల్లా కేంద్రంలో పోటీ చేసి పద్మా దేవేందర్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఈ సారి అక్కడినుంచే ఆమె పోటీ చేయవచ్చని ప్రచారం సాగింది. 

కానీ విజయశాంతి పోటీ చేయనని నిన్నమొన్నటి వరకు చెప్పి తీరా ఇప్పుడు తాను మెదక్ జిల్లాలోని దుబ్బాక నుంచి పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు. అక్కడ ఇప్పటికే కాంగ్రెస్ సీటు కోసం మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డి కాసుకుని ఉన్నారు. ఒకవేళ ఆయనకు టికెట్ రాని పక్షంలో ఆయన తనయుడికి ఇవ్వాలని అడుగుతున్నారు.

అంతేకాకుండా మహా కూటమిలో భాగంగా దుబ్బాక సీటును తెలంగాణ జన సమితి బలంగా కోరుతున్నది. ఆ సీటును ఎట్టి పరిస్థితుల్లోనూ తమకే కావాలని పట్టుబడుతూ ఉన్నది. టాప్ ప్రయార్టీ లిస్టులో తెలంగాణ జన సమితి పార్టీ దుబ్బాక సీటు కూడా ఉంది. ఈ పరిస్థితుల్లో రాములమ్మ మనసు మార్చుకోవడంతో తెలంగాణ జన సమితి నేతల్లో టెన్షన్ మొదలైంది. 

తెలంగాణ జన సమితికి దుబ్బాక నియోజకవర్గంలో బలమైన నాయకుడే ఉన్నట్లు చెబుతున్నారు. మాజీ జెడ్పీటిసి, టిఆర్ఎస్ మాజీ నేత చిందం రాజేందర్ దుబ్బాక సీటు ఆశిస్తున్నారు. ఆయన టిఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి తెలంగాణ జన సమితిలో చేరారు. ఇంతకాలం ఆ సీటు తమకే వస్తుందనుకుంటున్న జన సమితి వర్గాలు విజయశాంతి బరిలోకి దిగబోతున్నట్లు తెలియడంతో పరేషాన్ అవుతున్నారు. 

పైగా కాంగ్రెస్ పార్టీ గెలిచే చాన్సెస్ ఉన్న చోట తెలంగాణ జన సమితి పూర్తిగా సపోర్ట్ చేయాలంటూ విజయశాంతి మంగళవారం సాయంత్రం వెలువరించిన ఒక ప్రెస్ నోట్ లో కోరారు.  అలా అయితేనే మహా కూటమి విజయం సాధిస్తుంది అని ఆమె ఆకాంక్షించారు.

కోదండరాం పార్టీ తమకు కచ్చితంగా వస్తుందనుకుంటున్న సీటుకు విజయశాంతి ఎసరు పెట్టడంతో వారు ఆందోళన చెందుతున్నారు. నిన్నటి వరకు పోటీ చేయబోనని, రాష్ట్రమంతా తిరిగి ప్రచారం చేస్తానని మాట్లాడిన విజయశాంతి ఇలా యూటర్న్ తీసుకోవడమేంటని జెఎసి నేతలు ప్రశ్నిస్తున్నారు. నిజంగా విజయశాంతి పోటీ చేయాలనుకుంటే ఆమె గతంలో పోటీ చేసిన మెదక్ లోనే పోటీ చేయవచ్చు కదా అని జెఎసి కీలక నేత ఒకరు ప్రశ్నించారు.  రాములమ్మ వేసిన ఈ స్టెప్ పై తెలంగాణ జన సమితి ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.