హరీష్ కు మంత్రి పదవి డౌట్, అందుకే అలా : సంపత్

టిఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి హరీష్ రావు గురించి  ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఆసక్తికరమైన కామెంట్ చేశారు. గాంధీభవన్ లో ఆయన పార్టీ నేతలు అద్దంకి దయాకర్ తదితరులుతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణలో పరిపాలన గందరగోళంలో పడిపోయిందని విమర్శించారు. కేసిఆర్ ఫ్రంట్ పేరుతో రాష్ట్రాలు తిరుగుతుంటే ఆయన కొడుకు కేటిఆర్ విదేశాల్లో చక్కర్లు కొడుతున్నారని అన్నారు. ఇక కీలక నాయకుడైన హరీష్ రావు మాత్రం తనకు మంత్రి పదవి దొరుకుతుందో లేదో అని బిక్కుబిక్కుమనుకుంటూ ఇంట్లో కూర్చున్నారని సెటైర్ వేశారు. మీడియా సమావేశంలో సంపత్ ఇంకా ఏం మాట్లాడారో చదవండి.

తెలంగాణలో పరిస్థితి గందరగోళంగా ఉంది. ప్రభుత్వం ఏర్పడి 15 రోజులు అయింది. కానీ ఇంతవరకు మంత్రి వర్గ విస్తరణ లేదు. అసెంబ్లీ లో ఎమ్యెల్యే ల ప్రమాణం కూడా జరగకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. తెలంగాణతో పాటు ఎన్నికైన మిగతా 4 రాష్ట్రాలలో అన్ని ఏర్పాటు అయ్యాయి. ఇక్కడ మాత్రం ఏమి లేదు. 

ఈవీఎం టాంపరింగ్ వల్ల టిఆర్ఎస్ గెలిచింది. ఇది ప్రజల గెలుపు కాదు, ఈవీఎం ల గెలుపు అని మేము ముందుగానే చెప్పాము. ఇది నిజమని మేము ఆధారాలు చూపుతాం అంటే టిఆర్ఎస్ ముందుకు రాలేదు. కేటిఆర్ కు లై డిటెక్టర్ పరిశెలనకు రమ్మని అడిగితే వెనుకడుగు వేశాడు. మౌనం అంగీకరమే కదా?

ముఖ్యమంత్రి పాలన వదిలేసి, తెలంగాణ ప్రజలను పక్కన పడేసి ఢిల్లీలో ఫ్రంట్ అంటూ తిరుగుతున్నారు. తెలంగాణలో ప్రజలకు ఇచ్చిన హామీలు పక్కన పెట్టి గుళ్ళు గోపురాలు తిరుగుతూ కాలం వెళ్లదీస్తున్నాడు. టాంపరింగ్ ల రాబందుల సమితి గా టిఆర్ఎస్ మారిపోయింది. కేసీఆర్ ఢిల్లీలో తిరుతుంటే కేటిఆర్ దుబాయిలో విలసాలు చేస్తున్నాడు. టిఆర్ఎస్ కార్యకర్తలు ఊళ్ళల్లో మిగిలిన మందు తో ఎంజాయ్ చేస్తున్నారు.

ఇక హరీష్ రావు తనకు మంత్రి పదవి రాదేమోనని భయవుడుతూ ఇంటికి పరిమితం అయ్యాడు. అయ్య, కొడుకులు ఎంజాయ్ చేస్తుంటే హరీష్ రావు మాత్రం బాధపడుతూ ఇల్లు దాటి బయటకు రావడంలేదు. తెలంగాణ సర్కారు సుప్తా చేతనావస్థలో ఉంది. ఈ పరిస్థితి మరీ దారుణం.