తెలంగాణలో ప్రజాకూటమి ఘన విజయం సాధించబోతోందని కాంగ్రెస్ నేత, నల్లగొండ అభ్యర్ధి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఈ విషయం పోలింగ్ సరళిని చూస్తేనే అర్ధమవుతుందని తెలంగాణకు టిఆర్ఎస్ చేసిందేం లేదని ఆయన విమర్శించారు. ప్రభుత్వం పై వ్యతిరేకత ఉండటం వల్లే పోలింగ్ శాతం పెరిగిందన్నారు. టీఆర్ఎస్ ను ఓడించాలనే ఉద్దేశంతోనే హైదరాబాదు నుంచి సొంత ఊళ్లకు వచ్చి ప్రజలు ఓటు వేశారని అన్నారు.
జాతీయ మీడియా వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ వాస్తవం కాదని చెప్పారు. దక్షిణాది రాష్ట్రాలను జాతీయ మీడియా ఎక్కువగా పట్టించుకోదని తెలంగాణ వార్తలు వాటిలో ఎక్కువగా రావన్నారు. వాళ్లకు తెలంగాణ రాష్ట్ర పరిస్థితులపై ఎక్కువ అవగాహన ఉండదని వెంకట్ రెడ్డి చెప్పారు. పది, పదిహేనేళ్లుగా లగడపాటి రాజగోపాల్ చేస్తున్న సర్వేలన్నీ నిజమయ్యాయని తెలిపారు. కేసీఆర్ కు ఫాం హౌజే దిక్కన్నారు.
ఎన్నో ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న తనకు తెలంగాణపై పూర్తి అవగాహన ఉందని… ప్రజాకూటమి 70 నుంచి 75 స్థానాలను గెలుచుకుంటుందని చెప్పారు. ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చని కేసీఆర్ ఏ విధంగా మళ్లీ సీఎం అవుతారని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ తీసుకువచ్చిన పథకాలు ఏమిటో ప్రజలకు తెలియదా అని ప్రశ్నించారు.
ఇందిరమ్మ ఇళ్లు, 108, ఆరోగ్యశ్రీ, 104, ఫీజు రీయింబర్స్ మెంట్, కళ్యాణ లక్ష్మీ, 2 రూపాయలకు కిలో బియ్యం, పెన్షన్ల పెంపు, ప్రాజెక్టుల ఏర్పాటు, యూనివర్సీటిల నిర్మాణం, ఇవన్నీ కాంగ్రెస్ హయాంలోనే జరిగాయన్నారు. రాజశేఖర్ రెడ్డి తీసుకువచ్చిన పథకాలే తర్వాత ఉన్న ప్రభుత్వం అమలు చేసిందన్నారు. వాటినే కొన్ని మార్పులు చేర్పులతో కేసీఆర్ అమలు చేశారు. ప్రజా సంక్షేమాన్ని పక్కకు పెట్టి ఉన్న ప్రాజెక్టులను రీ డిజైన్ పేరుతో చెడగొట్టి ప్రజలకు నీరందకుండా చేశారని ఆయన విమర్శించారు. ఖచ్చితంగా మహా కూటమి అధికారంలోకి రాబోతుందని అందులో అనుమానాలే అక్కర్లేదన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. టిఆర్ఎస్ ఘోరంగా ఓడిపోతుందన్నారు.
తెలంగాణలో నాలుగున్నరేళ్లు అరాచక పాలన జరిగిందని విమర్శించారు. అసెంబ్లీలో సమస్యల పై నిరసన తెలిపితే అకారణంగా చేయని తప్పుకు సస్పెన్షన్ విధించారన్నారు. ప్రగతి భవన్ ద్వారా పరిపాలన చేసి తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ భ్రష్టు పట్టించారని, అతని దరిద్రం రెండు రోజుల్లో పోతుందన్నారు. తెలంగాణలో దొర పాలనకు, నియంత పాలనకు ప్రజలు తమ ఓటు ద్వారా గుణపాఠం చెప్పారన్నారు. తెలంగాణలో మహా కూటమి విజయం సాధిస్తుందని, ప్రజలకు సంతృప్తికర పాలన అందిస్తుందని కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.