ఎన్నికల హడావిడి తెలంగాణలో మరింతగా ఊపందుకున్నది. ఒకవైపు టిఆర్ఎస్ 105 అభ్యర్థులను ప్రకటించి రణరంగంలోకి అడుగు పెట్టింది. ఇక కాంగ్రెస్ సహా మహా కూటమి సీట్ల బేరాలు తేలక ప్రచారానికి దిగలేని పరిస్థితి ఉంది. కూటమి మధ్య సీట్ల పంచాయతీ పిస్తాన్ పడింది. అయితే సిట్టింగ్ లు, బలంగా ఉన్న కాంగ్రెస్ నేతలకు ఇప్పటికే ప్రచారం చేసుకోవాలని సంకేతాలు అందినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో సంగారెడ్డిలో జగ్గారెడ్డ ిప్రచారం చేయకుండా తన బిడ్డ జయారెడ్డి చేత ప్రచారం చేయిస్తున్నారు. ఆయన వీలైతే హైదరాబాద్ లో ఉంటున్నారు. లేదంటే సంగారెడ్డిలో ఉంటున్నారు. కానీ ప్రచారానికి మాత్రం వెళ్లడంలేదు. గాంధీభవన్ లో ప్రెస్ మీట్లు పెట్టి కేసిఆర్ ను కడిగి పారేస్తున్నారు. ప్రచారం అంతా తన భుజాల మీద వేసుకుని నడుపుతున్నారు జయా రెడ్డి. మధ్య మధ్యలో జగ్గారెడ్డి సతీమణి నిర్మలా రెడ్డి కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. మరి అసలు జగ్గారెడ్డి సైలెంట్ గా ఉండి తన బిడ్డ జయారెడడ్డితో ఎందుకు ప్రచారం చేయిస్తున్నారని సంగారెడ్డిలోనే కాక తెలంగాణ అంతటా జోరుగా చర్చనీయాంశమైంది. మరి ఆ అసలు కిటుకేందో తెలుసుకుందాం.
ఎన్నికలకు పోతామని ప్రకటించిన సమయంలోనే కాంగ్రెస్ నేత జగ్గారెడ్డిని టిఆర్ఎస్ సర్కారు పద్నాలుగేండ్ల పాత కేసును తిరగదోడి అరెస్టు చేసి జైలుపాలు చేసింది. 14 ఏండ్ల కిందటి పాత కేసులో అరెస్టయిన జగ్గారెడ్డి 13 రోజులు జైలులో ఉన్నారు. తర్వాత బెయిల్ మీద బయటకొచ్చారు. బయటకొచ్చినప్పటి నుంచీ జగ్గారెడ్డిలో మునుపటి స్పీడ్ మాత్రం తగ్గిందని అందరూ అంటున్నారు. దానికి కారణాలేమైనా ఆయన గతంలో మాదిరిగా దూకుడు ప్రదర్శించడంలేదు.
జగ్గారెడ్డి 13 రోజులు జైలులో ఉంటే ఆయన తరుపున ఆయన కూతురు జయారెడ్డి ఎక్కడా ప్రచారం చేసిన దాఖలాలు లేవు. ఆయన జైలు నుంచి బయటకొచ్చిన తర్వాతే జయా రెడ్డి ప్రచార బరిలోకి దిగారు. ఇందులో ఏం మతలబు ఉందబ్బా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఇక ప్రచార పర్వంలో జయారెడ్డి పెద్దగా తన తండ్రిని జైలులో పెట్టారని, తన తండ్రి మీద టిఆర్ఎస్ సర్కారు కుట్ర చేస్తున్నదని ఎక్కడా మాట్లాడినట్లు కనబడతలేదు. సానుభూతి కోసం ఆమె ప్రసంగాలు లేవు.
జగ్గారెడ్డిని మొన్న అరెస్టు చేసిన విషయం రాజకీయ కక్ష సాధింపులో భాగమే అని లోకమంతా కోడై కూస్తున్నది. ఇందులో ఎవరికీ రెండో ఒపీనియన్ లేదు. ఎందుకంటే అదే కేసులో టిఆర్ఎస్ నేతలు హరీష్ రావు, సోలిపేట రామలింగారెడ్డి తదితరులు కూడా భాగస్వాములుగా ఉన్నట్లు ప్రచారంలో ఉంది. ఏకంగా కేసిఆర్ కూడా ఆ కేసులో ఇరుక్కున్నట్లు విమర్శలున్నాయి.
మరి ఈ పరిస్థితుల్లో తన తండ్రిని అక్రమంగా పాత కేసుల్లో జైలు పాలు చేశారని జయారెడ్డి స్పీచ్ లు ఇస్తే సానుభూతి వచ్చే అవకాశాలుండేవి. కానీ ఆమె ఎక్కడా ఆ రకమైన ప్రసంగాలు చేయడంలేదు. గతంలో జగ్గారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏం చేశారు? ఎక్కడ రోడ్లు వేశారు? టిఆర్ఎస్ నాలుగున్నరేళ్లలో ఏం చేస్తున్నారు? రోడ్లు వేశారా? లేదా? జగ్గారెడ్డి వస్తే మరింత అభివృద్ధి జరుగుతది అని చెబుతున్నారు. తప్ప జైలు ముచ్చటను ముందుకు తెచ్చి సానుభూతి కోసం మాట్లాడిన దాఖలాలు లేవు.
మరి ఆమె ప్రచారం చేయడంలో జగ్గారెడ్డికి ఒక రిలీఫ్ దొరికిందని సంగారెడ్డి జనాల్లో చర్చ. అదేమంటే.. జగ్గారెడ్డి ఎక్కడ ప్రచారం చేసినా ఆయన విపరీతంగా డబ్బు ఖర్చు పెడతారన్న పేరుంది. గత ఎన్నికల్లో ఆయన ఇలాంటి ఓపెన్ స్టేట్ మెంట్లు కూడా ఇచ్చారు. ఎటిఎం మిషన్ ఏర్పాటు చేస్తా మీరంతా డబ్బులు తీసుకోని పోండ్రి అని ఓపెన్ గా ప్రకటించారు. జనాల్లో కూడా ఈ ఇంప్రెషన్ బాగా ఉంది. జగ్గారెడ్డి ప్రచారానికి వచ్చిండంటే డబ్బే డబ్బు అని జనాలు అనుకుంటారు. అసలే నాలుగున్నరేళ్లపాటు అపోజీషన్ లో ఉన్నారు.. పైగా జైలుకు వెళ్లి వచ్చే. దీంతో గతంలో మాదిరిగా జగ్గారెడ్డి డబ్బు ఖర్చు చేసే పరిస్థితి లేదని అంటున్నారు.
అందుకోసమే జగ్గారెడ్డి కొత్త స్కెచ్ వేసి జయారెడ్డిని ప్రచార బరిలోకి దింపినట్లు చెబుతున్నారు. దీంతో జగ్గారెడ్డి ప్రచారానికి వెళ్తే రోజుకు రూపాయి ఖర్చయితే జయారెడ్డి ప్రచారం చేస్తే అందులో పదో వంతు మాత్రమే ఖర్చు అవుతున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అసలే కరువు కాలం కావడంతో ఈ మేరకు జగ్గారెడ్డి ఖర్చు తగ్గించుకుంటున్నారని జనాల్లో చర్చ మొదలైంది. జగ్గారెడ్డి మానసికంగా ఇబ్బందిలో ఉన్నారు కాబట్టి రాలేకపోయారని జయారెడ్డి చెబుతున్నారు. కానీ జగ్గారెడ్డి ఫిట్ గా ఉన్నారని ఆయనను చూస్తేనే తెలుస్తున్నది.
ఇదే కాకుండా తన ప్రచారం కంటే జయారెడ్డి ప్రచారానికి స్పందన బాగుందని జగ్గారెడ్డి భావనకు వచ్చారు. అమ్మాయి, భార్యను ఇద్దరిని ప్రచారంలోకి దింపితే జనాల్లో బాగా స్పందన వస్తున్నట్లు ఆయన గ్రహించారు. అందుకే నియోజకవర్గమంతా వారిచేత ప్రచారం చేయిస్తున్నారు. అంతేకాకుండా తమ అభిమాన నాయకుడైన జగ్గారెడ్డి బిడ్డ ప్రచారానికి వచ్చిందంటే ఆమెను చూడడం కోసం, ఆమె మాటలు వినడం కోసం తెగ వస్తున్నారు. అందుకే కంటిన్యూ చేయిస్తున్నారు.
ఇక తండ్రి మాదిరిగానే జయారెడ్డి మాటల తూటాలు పేలుస్తున్నారు. ఇప్పటి వరకు 120 గ్రామాల్లో జయారెడ్డి ప్రచారం చేశారంటే ఆమె స్పీడ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇగ భారమంతా బిడ్డ మోస్తుండడంతో జగ్గారెడ్డి కేవలం ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్నారు. మోక మీదకు వచ్చినప్పుడు ఆయన ప్రచార బరిలోకి దిగే చాన్స్ ఉందని టాక్.
జయారెడ్డి ప్రచారం ఎలా సాగుతుందో కింద వీడియో ఉన్నాయి చూడండి.