సీఎం కేసీఆర్‌కు కాంగ్రెస్ దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ

తెలంగాణలో జరిగిన టిచర్స్, లెక్చరర్ల బదిలీల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజ్ శ్రవణ్ సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. బదీలీలు ఇష్టారాజ్యంగా చేశారని, గ్రామీణ మారుమూల ప్రాంతాల్లో ఉపాధ్యాయులు లేక చదువులు కొనసాగుతలేవని ఆయన లేఖలో విమర్శించారు. పైరవీలు చేసి ఇష్టమొచ్చినట్టు బదిలీల ప్రక్రియ చేపట్టారని ఆయన లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కు దాసోజు శ్రవణ్ రాసిన బహిరంగ లేఖ కింద ఉంది చదవండి…

టీచర్స్, లెక్చరర్స్ ట్రాన్స్ ఫర్ల  అవినీతి పై 

తెలంగాణా ముఖ్యమంత్రి గారికి డాక్టర్ శ్రవణ్ దాసోజు బహిరంగ లేఖ

తేది : 19.08.2018

గౌరవనీయులైన మాన్యశ్రీ  కల్వకుంట చంద్రశేఖర్ రావు గారికి,

తెలంగాణా రాష్ట్రం ఏర్పాటయ్యాక నాలుగు సంవత్సరాలు ఎలాంటి బదిలీలు చేపట్టని విద్యాశాఖ ఇటీవల చేపట్టిన బదిలీల్లో భారీ అక్రమాలు, అడ్డుఅదుపు లేని అవినీతికి తెరలేపాయి. విద్యాబుద్దుల నేర్పి సమాజానికి ఆదర్శవంతంగా నిలవాల్సిన  విద్యాశాఖలో కూడా అవినీతి కంపు, అక్రమాల రొచ్చులో మునగడం శోచనీయం. మరోవైపు నాలుగు సంవత్సరాలు నిరీక్షణ తర్వాత కూడా భార్యాభర్తల కు సంబంధించిన అంతర్ జిల్లా బదిలీలకు అనుమతి ఇవ్వకపోవడం పట్ల  తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాం. తెలంగాణా ఉద్యమంలో సబ్బండ వర్గాల తో పాటు కదం కదం కలిపిన ఉపాధ్యాయ ఉద్యోగులు తమ ఉద్యోగాలు పోయినా ఫర్వాలేదని ఉద్యమానికి మద్దతుగా తరగతులు బహిష్కరించి ఉద్యమంలో పాల్గొన్నరు. జేఏసీ సంఘాలను ఏర్పాటుచేసి పోరాటం చేసిన్రు. ఉద్యమం వైపు సమాజాన్ని ఉత్తేజపరచడంలో ఎంతో విజ్నత ప్రదర్శించిన్రు. ఉమ్మడి రాష్ట్రంలో దూరదూరంగా పనిచేస్తున్న భార్యభర్తలు స్వరాష్ట్రమొస్తే ఒకే చోట పనిచేసుకునే అవకాశం వస్తుందని, కుటుంబాలతో కలిసి హాయిగా జీవించొచ్చని కలలు గన్నరు.

పాఠశాల విద్యాశాఖ 2018 జూన్ 6 న మొదలుపెట్టి నెలరోజుల పాటు నిర్వహించిన ఉపాధ్యాయుల బదిలీలను  వెబ్‌ కౌన్సెలింగ్ విజయవంతంగా ముగించామని చెప్పుకుంటున్నా అంతర్జిల్లా బదిలీలకు అవకాశం ఇవ్వక పోవడం వెనుక ఉద్దేశాలేంటో అర్ధం కావడం లేదు. వెబ్ కౌన్సిలింగ్ ద్వారా ఎదురయిన ఇబ్బందులను ఎప్పటికప్పుడు పరిష్కరించిన విద్యాశాఖ అంతకు ముందే విడుదల చేసిన జీవోను మాత్రం అసలే మాత్రం పట్టించుకోలేదు.  ‘’దేవుడు వరమిచ్చినా పూజారి వరమియ్యేలేదన్న’’ సామెత చందంగా ఓ వైపు ప్రభుత్వం జీవో విడుదలచేసినా అందుకనుగుణంగా విద్యాశాఖ ఎందుకు అంతర్జిల్లా బదిలీలను చేపట్ట లేకపోయిందో మీరే చెప్పాలి. మీ ప్రభుత్వం ఏర్పాటయ్యిన రోజునుంచి ఇప్పటివరకు నాలుగు సార్లు  అంతర్ జిల్లా బదిలీలుంటాయిని స్వయంగా మీరే ప్రకటన చేసినా  అధికారులు షెడ్యూల్‌ విడుదల చేయక పోవడం మీ ప్రభుత్వ చిత్తశుద్దిని తెలుపుతోంది.

ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియలో ఏ ఒక్కరికి నష్టం జరగకుండా.. పాయింట్ల వారీగా  వారికి లభించే ప్రాంతాలకు బదిలీ చేశామని చెబుతున్నమీ ప్రభుత్వం మొత్తం 75 వేల 317 మంది దరకాస్తు చేసుకుంటే దాదాపు అందులో సగం మందికి అంటే 31వేల 514 మందికి బదిలీలు చేశారు. ఇన్ని వేల మంది కుటుంబాల్లో వెలుగులు నింపిన మీరు కేవలం 400 లోపు ఉన్న అంతర్ జిల్లా భార్యాభర్తల ఉపాధ్యాయుల బదిలీలను పక్కన పెట్టేయడం వారిని మానసికంగా వేధింపులకు గురిచేయడమే అవుతుంది. మీరు తీసుకున్న ఈ నిర్ణయం  వారి కుటుంబాల్లో తీవ్ర నిరాశను మానసిక వేదనను నింపిందని గుర్తించండి.

2014 ఎన్నికల హామీల్లో భాగంగా కాంట్రాక్ట్ లెక్చరర్లను రెగ్యులరైజ్ చేస్తామని ప్రకటించినారు. కాని మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినతర్వాత కూడా వారిని రెగ్యులరైజ్ చేస్తామన్న హామీని మరిచిపోయారు.  సుదీర్ఘ కాలంగా ఒకేచోట పనిచేస్తున్న వారినిట్రాన్స్ ఫర్ చేస్తామని  క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నాకూడా ఆచరణలో పెట్టలేకపోయారు. కొత్త ఉద్యోగాల కోసం నోటిపికేషన్ విడుదల చేయకుండా ఉద్యోగాలను భర్తీచేయకుండా  గెస్ట్ లెక్చరర్ ల పేరిట కళాశాలలను నడుపుతున్నారు. బాన్స్ వాడ లాంటి కళాశాలలో లెక్చరర్లందరిని బదిలీ చేసేసి కేవలం గెస్ట్ లెక్చరర్ లతో నడుపుతున్నారు. పూర్తి స్ధాయి లెక్చరర్లు , ప్రిన్సిపాల్  లేకుండా ఇంచార్జీలతో కాలం వెళ్లదీస్తుంటే నాణ్యమైన విద్య ఎలా అందుతుందో మీరే చెప్పాలి. 

లోకల్ బాడీస్ లో పనిచేస్తున్నభార్య భర్తలను ఒకే జిల్లాలోకి బదిలీ చేస్తామని అందుకోసం జీవో ఎంఎస్ నెంబర్ 182.తేదీ 21.05.2016 నాడు  ఉత్తర్వును విడుదల చేసిన విషయం పాఠశాల విద్యశాఖ అధికారులు మరిచిపోయారు. మీరు విడుదల చేసిన 182 జీవో తో రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న అంతర్జిల్లా ఉద్యోగులు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. ఎన్నో సంవత్సరాలుగా దూరప్రాంతాల్లో ఉద్యోగభాద్యతలను నిర్వహిస్తూ కుటుంబాలను కలుసుకోబోతున్నమని ఆనందం వ్యక్తం చేసిన్రు. ఏళ్లుగా దూరదూరంగా ఉంటున్న వారికి మీ ఉత్తర్వు ఎంతో స్వాంతన చేకూర్చింది. వారి వారి కుటుంబాలను కలుసుకోవచ్చన్న ఆనందం వారి కుటుంబాల్లో వెల్లివిరిసింది.  మీరు ఇచ్చిన జీవోతో బదిలీలుంటాయని రెండేళ్ల తర్వాతైన  మంచి రోజులొచ్చాయిని భావించిన ఉద్యోగులకు మళ్లీ అడియాసే ఎదురయ్యింది.  ఎదురుచూపులతర్వాత  నిర్వహించిన బదిలీల్లో మీరు గతంలో విడుదల చేసిన జీవో ఊసే లేకుండా  అధికారులు ప్రవర్తించడం పట్ల, అంతర్జిల్లా బదిలీలు చేపట్టకుండా వారిని యధాతంగా ఉంచడం వల్ల ఉద్యోగులు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారు. ఈ వ్యవహారంతో గతంలో భార్యాభర్తలను ఒకే జిల్లాకు బదిలీ చేస్తామన్ని మీ నిబంధనను మీరే తుంగలో తొక్కారని గుర్తుచేస్తున్నాం.

అవినీతికి అక్రమాలకు తావులేదని ఎవరైనా పాల్పడితే కఠినచర్యలు తప్పవని పదే పదే మీరు హెచ్చరించినా ఉన్నతవిద్య శాఖా బదిలీల్లో జరుగుతున్నఅవినీతి అక్రమాలకు లెక్కేలేకుండా పోయింది. కోరుకున్న చోటికి బదిలీలు చేసిన విద్యాశాఖాధికారులు యూనియన్ పెద్దల అకృత్యాలతో దాదాపు కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారు.

డిగ్రీ కళాశాల లెక్చరర్స్ అంశంలో, అవసరం లేకున్నా  ఆన్ డ్యూటీల అనే నెపంతో  సరికొత్త అవినీతి నాటకానికి తెరలేపి ఉద్యోగి కోరుకున్న చోటికి యధేశ్చగా బదిలీలు చేసేశారు. ఒకే ఉద్యోగమున్నచోట సైతం ఆన్ డ్యూటీ పేరిట ఇంటర్ జోనల్ పోస్టింగ్ అవకాశం కల్పించారు.  కరీంగనగర్ , మహబూబ్ నగర్, సిద్దిపేట, హన్మకొండ ఖమ్మం జిల్లాల్లో అధికారులు ప్రజాప్రతినిధుల సిఫారసులతో లెక్కలేనన్న అక్రమ బదిలీలు చోటుచేసుకున్నాయి. యూనియన్ లీడర్లే ఏజెంట్లుగా మారి ఈ దందాకు పాల్పడడం శోచనీయం. నిజానికి గత జూన్  30 వ తేదీ నాటికే బదిలీలను ముగించాల్సి ఉన్నా ఆన్ డ్యూటీల పేరిట ఇంకా బదిలీలు చేపడుతున్నారు.

డిగ్రీ  కళాశాల లెక్చరర్స్  విషయంలో   లెక్కకు మించిన ఆన్ డ్యూటీ ట్రాన్స ఫర్ లతో ఉన్నత విద్యాశాఖలో ఎన్నో అక్రమాలు చోటు చేసుకున్నాయి. అధికారుల పారదర్శకత లేని బదిలీల వల్ల అధ్యాపకుల, వారి కుటుంబ సభ్యులు అంతా నిద్రలేనిరాత్రులు గడుపుతున్నారు.

ఉన్నత విద్యాశాఖా చేపట్టిన బదిలీల్లో జానా రెడ్డి అనే ఉద్యోగి పటాన్ చెరువుకు, ప్రభాకర్ అనే ఉద్యోగికి సంగారెడ్డికి కౌన్సిలింగ్ ద్వారా ట్రాన్స్ఫర్ ఆర్దర్ ఇచ్చి, .  అంతలోనే ప్రభాకర్ కు తిరిగి నిజామాబాద్ ట్రాన్స్ ఫర్ చేస్తూ మరో ఉత్తర్వు ఇచినట్లు సమాచారం.. ఇలా కౌన్సిలింగ్ లో ఒకటి , మ్యానువల్ మరోక  ఉత్తర్వులు ఇచ్చిన అక్రమ పోస్టింగ్ ఉదంతాలు దాదాపు 50 కి పైగా ఉన్నాయి. అలాగే మొత్తం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 142 మంది ఉద్యోగులను ఆన్ డ్యూటీ ల పేరిట కోరుకున్నచోటికి పంపించారు.  అశోక్ మోరే  అనే లెక్చరర్ కు స్సౌజ్ పాయింట్స్ ఉన్నప్పటికి ఆయన భార్య జనగాంలో పనిచేస్తుంటే భర్తకు పక్కనేఉన్న ఆలేరులో ఇవ్వాల్సిఉండగా ఆయనకు ఇవ్వకుండా మరోకరికి అక్కడ పోస్టింగ్ ఇచ్చి భర్తకు సిద్దిపేట లో పోస్టింగ్ ఇచ్చి 50 కిలోమీటర్ల లోపు భర్తకు అవకాశం కల్పించాల్సిన స్పౌజ్ పాయింట్ల నిభంధనను తుంగలో తొక్కారు.  ఇలా ఉద్యోగులు కోరుకున్నపట్టణ ప్రాంతాలకు  నిబంధనలు ధిక్కరించి  అనర్హులకు పోస్టింగులు ఇవ్వడం, అనాలోచితంగా 100 శాతం బదిలీలు చేపట్టడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ కళాశాలలు మూతపడే దుస్తితి కల్పించారు.

అక్రమంగా ఆన్ డ్యూటి పోస్టింగులు చేసినట్లు సమాచారం వస్తుంది.  కరీంనగర్లో 15, వరంగల్ లో 14, ఆదిలాబాద్ లో, 12,  ఖమ్మంలో 10, మహబూబ్ నగర్ లో 12, మెదక్ లో 8, నల్లగొండ లో 6, నిజామాబాద్ లో 6, రంగారెడ్డిలో 4 వరకు ఉన్నాయని చెపుతున్నారు.  అలాగే ఆన్ డ్యూటీ పేరిట ఇతర జోన్ లలో ఉద్యోగాలు చేస్తున్నవారిలో ఐదో జోన్ కు చెందిన కెమిస్ట్రీ లెక్చరర్ వేణుగోపాల్…ఆన్ డ్యూటీ పేరిట  ఆరో జోన్ అంటే మహబూబ్ నగర్ కు పంపించారాని చెపుతున్నారు. అలాగే పల్లవి అనే మైక్రోబయాలజీ లెక్చరర్ జోన్ 5 నుంచి  ఆరో జోన్ అంటే హన్మకొండకు;  డి. స్వామీ అనే హిస్టరీ లెక్చరర్ జోన్  5 నుంచి  ఆరోజోన్ కు;  భాషా అనే మరో కెమిస్ట్రీ లెక్చరర్  జోన్ 5 నుంచి  ఆరో జోన్లోని జమ్మికుంటకు ఆన్ డ్యూటీపై పంపించినట్లు చెబుతున్నారు. ఇలాంటి ఉద్యోగులను, వారికి సహకరించిన అధికారుల పై కఠినచర్యలు తీసుకోవాలని నిజమైన అర్హులకు అవకాశాలు కల్పించాలని కోరుతున్నం. 

తెలంగాణా రాష్ట్రంలో ఉద్యోగుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వారు ఆనందమయ జీవితాన్ని గడిపేందుకు అవకాశం కల్పిస్తామన్న మీ మాటకు విలువ లేదు. మీరు విడుదల చేసిన జీవోలకు దిక్కులేదు.  ఒక్క రాష్ట్ర ప్రభుత్వ రంగంలోనే కాకుండా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో, ఇతర ప్రభుత్వ రంగ సంస్ధల్లో చెట్టుకొకరు పుట్టకొకరుగా పనిచేస్తున్న భార్యభర్తలను ఒకచోటకు చేర్చి వారి కుటుంబాల్లో ఆనందం నింపి, తద్వారా వారు  మరింత ఉత్సాహం పనిచేసే అవకాశం లభిస్తుందని తెలియజేస్తున్నాం. ముఖ్యమంత్రిగా మీరిచ్చిన హమీలను నెరవేర్చడం మీ కనీస ధర్మం.. అందునా కేవలం 400 మంది భార్యభర్తలకు సంబందించిన బదిలీల వ్యవహారంలో మీర తక్షణమే జోక్యం చేసుకోవాలి.

ప్రస్తుత కాలేజీ విద్య కమీషనర్, ఐఏఎస్ అధికారి, విద్యాశాఖ మంత్రి సన్నిహితులు మధ్యవర్తులుగా ఉండి ఓడీల పేరు మీద పెద్ద ఎత్తున ఈ అక్రమాలు  చేసినట్లు బలమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంచేత అక్రమంగా చేపట్టిన లెక్చరర్ల ట్రాన్స్ఫర్ లను పున: పరిశీలించి అర్హులకు న్యాయం చేయాలని కోరుతున్నాం. తద్వారా ఎంతో కాలంగా భార్యాబిడ్డలకు  దూరంగా పనిచేస్తున్న కుటుంబాలకు స్వాంతన చేకూరుతుందని విజ్నప్తి చేస్తున్నాం.  గతంలో మీరిచ్చిన జీవో 182 ఆధారంగా తక్షణమే బదిలీలు చేపట్టాలని, వెంటనే అధికారులకు ఆదేశమివ్వాలని కోరుతున్నాం. అదే విధంగా అంతర్‌జిల్లా, మోడల్‌ స్కూల్‌, కేజీబీవీ ఉపాధ్యా యుల బదిలీలు నిర్వహించాలని కోరుతున్నాం. మొత్తం ట్రాన్సఫర్ల వ్యవహారంలో జరిగిన అవినీతి పై సమగ్ర విచారణ  జరిపించి, తప్పు చేసిన వారిని శిక్షించాలని విజ్ఞప్తి.. 

ఇట్లు

డా శ్రవణ్ దాసోజు   

ముఖ్యఅధికార ప్రతినిధి

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ