కేసిఆర్ కు హరీష్ తిరుగుబాటు భయం.. అందుకేనా ఇలా ?

టిఆర్ఎస్ అధినేత కేసిఆర్ కు ఒక పెద్ద భయం పట్టుకుందని కాంగ్రెస్ నేత జిల్లెల చిన్నారెడ్డి పేర్కొన్నారు. తన మేనల్లుడు, ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు తిరుగుబాటు చేస్తాడన్న భయంతోనే కొత్త కొత్తగా చేస్తున్నారన్నారు.

వనపర్తి జిల్లా కేంద్రంలో చిన్నారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ మధ్య కాలంలో హరీష్ రావు తిరుగుబాటు చేస్తాడన్న భయంతో కేసిఆర్, ఆయన కొడుకు వనికిపోతున్నారని ఎద్దేవా చేశారు. అందుకోసమే ఎన్నడూ లేనిది హరీష్ రావుతో కేటిఆర్ కలిసి తిరుగుతున్నారని తెలిపారు. ఈ విషయాన్ని ఏ టిఆర్ఎస్ నాయకుడిని అడిగినా చెబతారన్నారు.

కొంగర కలాన్ లో అట్టర్ ప్లాఫ్ అయినట్లే వనపర్తిలోనూ కేసిఆర్ జరిపిన సభ అట్టర్ ప్లాఫ్ అయిందన్నారు చిన్నారెడ్డి. తెలంగాణలో కాంగ్రెస్ గ్రాఫ్, కూటమి గ్రాఫ్ పెరగడాన్ని జీర్ణించుకోలేక కేసిఆర్ అటు చంద్రబాబు మీద, ఇటు కాంగ్రెస్ మీద విమర్శలు గుప్పిస్తున్నారని అన్నారు. కేసిఆర్ నోటి నుంచి వస్తున్న పచ్చి బూతులు వింటుంటే అసహ్యం కలుగుతుందన్నారు. ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండడం దురదృష్టకరమన్నారు.

బాధ్యతాయుతమైన సిఎం హోదాలో ఉన్న కేసిఆర్ బాధ్యత మరచి రౌడీలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉమ్మడి పాలమూరు జిల్లాలో కేవలం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు మాత్రమే ప్రారంభించారు తప్ప మిగతా ప్రాజెక్టుల జోలికి పోలేదన్నారు. 

నిజంగా పాలమూరుపై కేసిఆర్ కు ప్రేమ ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టినంత వేగంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు చేపట్టాలని చాలెంజ్ చేశారు. అధికారం దక్కదన్న భయంతోనే కేసిఆర్ నోరు పారేసుకుంటున్నాడని విమర్శించారు. 

పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు తెలంగాణకు మంచిదే అంటూ తాను ఏనాడూ వ్యాసం రాయలేదన్నారు. తన పేరుతో వేరే వాళ్లు రాసినట్లు చెప్పారు. మంత్రి తలసాని కోసమే ఆంధ్రా నుంచి చేపపిల్లలను తెచ్చి ఇక్కడి చెరువుల్లో వదులుతున్నారని విమర్శించారు.

టిఆర్ఎస్ నేతలు ఎన్ని జిమ్మిక్కులు చేసినా, బూతు పంచాంగం ఎత్తుకున్నా తెలంగాణ ప్రజలు ఈసారి ఓడించి ఇంటికి పంపడం ఖాయమన్నారు.