ఆ విషయంలో కేసీఆర్ సైలెన్స్.. మునుగోడు అభ్యర్థి ఎంపిక ఎప్పుడో?

తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో జరగనున్న మునుగోడు ఉపఎన్నికలో ఎవరు విజయం సాధిస్తారనే స్పష్టత లేదు. సర్వేల ప్రకారం మునుగోడులో బీజేపీకి అనుకూలంగా ఫలితాలు ఇచ్చే అవకాశం ఉండగా అదే సమయంలో అభ్యర్థిని తేల్చుకునే విషయంలో కేసీఆర్ కు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మునుగోడులో ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ లకు అభ్యర్థులు ఫైనల్ కాగా అధికార పార్టీకి మాత్రం అభ్యర్థి ఫైనల్ కావాల్సి ఉంది.

అధికార పార్టీ తరపున అభ్యర్థుల రేసులో చాలామంది పేర్లు పరిశీలనలో ఉండగా ఎవరిని ఎంపిక చేయాలనే విషయంలో కేసీఆర్ కు సైతం కన్ఫ్యూజన్ నెలకొందని సమాచారం అందుతోంది. వాస్తవానికి మునుగోడు నియోజకవర్గంలో బీసీల సంఖ్య ఎక్కువగా ఉంది. బీజేపీ నుంచి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన రాజగోపాల్ రెడ్డి అభ్యర్థిగా ఉండగా కాంగ్రెస్ పార్టీ నుంచి పాల్వాయి స్రవంతి పోటీ చేస్తుండటం గమనార్హం.

గతంలో కేసీఆర్ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే కొంతమంది బీసీ అభ్యర్థికి టికెట్ ఇస్తే బాగుంటుందని సూచనలు చేయడంతో బూర నర్సయ్య గౌడ్, కర్నె ప్రభాకర్ పేర్లు తెరపైకి వచ్చాయి. బీసీ నేతలకే టికెట్ ఇవ్వాలని స్థానిక నేతల నుంచి కూడా ప్రతిపాదనలు వచ్చాయని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.

అయితే ఇందుకు సంబంధించి కేసీఆర్ తుది నిర్ణయం ఏంటనే చర్చ కూడా అభిమానుల మధ్య జరుగుతోంది. కేసీఆర్ సరైన అభ్యర్థిని ఎంపిక చేస్తే ఎన్నికల్లో టీ.ఆర్.ఎస్. బీజేపీకి గట్టి పోటీ ఇవ్వడం గ్యారంటీ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్ సరైన అభ్యర్థి ఎంపిక దిశగా అడుగులు వేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. మునుగోడు ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే మాత్రం టీ.ఆర్.ఎస్ కు భారీ షాక్ తప్పదని 2024 ఎన్నికల్లో కూడా బీజేపీకే అనుకూల ఫలితాలు వచ్చే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.