అసెంబ్లీ రద్దు అనంతరం కేసీఆర్ ప్రకటించిన టికెట్ల జాబితాలో తన పేరు లేకపోవడంతో చెన్నూరు తాజా మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు అసంతృప్తితో ఉన్నారు. చెన్నూరు సీటును ఎంపీ బాల్క సుమన్ కు కేటాయించారు. దీంతో మనస్థాపం చెందని ఓదేలు కేసీఆర్ ను కలిసేందుకు ప్రయత్నించిన తనకు అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదని ఆరోపించారు.
చెన్నూరు టికెట్ తనకు ఇవ్వక పోవడంతో మందమర్రిలోని తన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి ఓదేలు స్వీయ నిర్బందంలో ఉన్నారు. ఉదయం 9 దాటినా ఇంటి తలుపులు తెరుచుకోకపోవడంతో ఆందోళన చెందిన స్థానికులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్నారు. తనకు టికెట్ ఇచ్చి న్యాయం చేసేంత వరకు ఆందోళన విరమించేది లేదని ఓదేలు స్పష్టం చేశారు.
తనకు న్యాయం చేయకుంటే ఎంత వరకైనా తెగిస్తానని నల్లాల ఓదేలు హెచ్చరించారు. ఓదేలు ఆందోళనతో కార్యకర్తలు, స్థానికులు, అనుచరులు భారీ సంఖ్యలో ఓదేలు ఇంటికి చేరుకున్నారు. ఏం జరుగుతుందో అని ఆందోళనలో ఉన్నారు. పోలీసులు చేరుకొని ఓదేలుతో చర్చించినప్పటికి కూడా ఆయన బయటికి రాలేదు. టిఆర్ ఎస్ జిల్లా నాయకులు అక్కడికి చేరుకున్నారు. రాష్ట్ర నాయకత్వం దృష్టికి ఓదేలు విషయాన్ని వారు తీసుకెళ్లారు. ఏం జరుగుతుందో అనే టెన్షన్ అందరిలో నెలకొంది.