వారిలో నమ్మకం కోసం… తెలంగాణలో చంద్రబాబు సపోర్ట్ జనసేనకేనా?

ప్రస్తుతం రాజకీయాల్లో ఎవరు ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఎందుకు సపోర్ట్ చేస్తున్నారో.. సపోర్ట్ చేస్తారో ఎవరికీ అర్ధంకాని పరిస్థితులు నెలకొన్నాయి. భావసారుప్యత అనేది మచ్చుకైనా కనిపించడం లేదనే కామెంట్లూ వినిపిస్తున్నాయి. ఎప్పుడైతే రాజకీయాలను ప్రజాసేవకు మార్గాలుగా కాకుండా… 100% ప్రాఫిట్ బిజినెస్ గా, పార్ట్ టైం జాబ్ గా పరిగణిస్తారో ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయనే విమర్శలూ వినిపిస్తున్నాయి. ఆ సంగతి అలా ఉంటే… ఇప్పుడు తెలంగాణలో టీడీపీ ఎవరికి సపోర్ట్ చేస్తుందనేది ఆసక్తిగా మారింది.

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇప్పటికే పార్టీలన్నీ ప్రచారాలతో హోరెత్తించేస్తున్నాయి. ఓటర్లపై హామీల వర్షాలు కురిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో బీఆరెస్స్ ఒంటరిగా పోటీలో దిగుతుండగా.. కాంగ్రెస్ – సీపీఐ కలిసి వెళ్తున్నాయి. ఇదే సమయంలో తాజాగా బీజేపీ – జనసేన మధ్య పొత్తు పొడిచిందని అంటున్నారు. పొత్తు పొడిచిందా.. లేక, ఎన్డీయే లో జనసేన ఉండటంవల్ల కలిసిపోటీచేయాల్సి వచ్చిందా అనేది ప్రస్తుతానికి అస్పష్టం! ఆ సంగతి అలా ఉంటే ఇప్పుడు టీడీపీ సపోర్ట్ హాట్ టాపిక్ అయ్యింది.

ఇప్పుడు ఇదే అంశంపై టీడీపీ, జనసేనలో తీవ్ర చర్చలు జరుగుతున్నాయని తెలుస్తుంది.. తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ మిత్రపక్షంగా జనసేన పోటీచేస్తున్న విషయం తెలిసిందే. పొత్తులో భాగంగా జనసేనకు ఎనిమిది నియోజకవర్గాలను బీజేపీ కేటాయించిందని అంటున్నారు. ఇందులో ఖమ్మం, వైరా, కొత్తగూడెం, అశ్వారావుపేట, మధిరతో పాటు కోదాడ, కూకట్‌ పల్లి, నాగర్ కర్నూల్ నియోజకవర్గాల్లో బీజేపీతో పొత్తులో భాగంగా జనసేన పోటీ చేయబోతోంది.

మరి ఈ ఎనిమిది స్థానాల్లో టీడీపీ సపోర్ట్ ఎవరికి..? కాంగ్రెస్ కా.. లేక, జాన్సేనకా? ఈ ఎనిమిది నియోజకవర్గాల్లోనూ నాగర్ కర్నూల్ మినహా మిగిలిన ఏడింటిలో సీమాంధ్రులు ఎక్కువగా ఉంటారు! దీంతో ఈ ప్రాంతంలో చంద్రబాబు మాట చాలా కీలకమైనదని చెబుతున్నారు. ఇందులో భాగంగా… మీడియా ముఖంగా సపోర్ట్ ప్రకటించకపోయినా.. లోపయకారీగా ఆయన తీసుకోబోయే నిర్ణయం చాలా కీలకంగా చెబుతున్నారు.

కారణం… కాంగ్రెస్‌ గెలుపుకు సహకరించాలనే ఉద్దేశ్యంతోనే తెలంగాణ ఎన్నికల్లో పోటీ నుండి టీడీపీ తప్పుకుందని టీడీపీ నేతలే చెబుతున్నా పరిస్థితి. మరి ఏపీలో మిత్రపక్షంగా ఉన్న జనసేన తెలంగాణలో పోటీ చేస్తున్నపుడు గెలిపించుకోవాల్సిన బాధ్యత చంద్రబాబుపైన ఉంది! పైగా జనసేన పోటీ చేస్తున్నది కూడా ఎక్కువగా సీమాంధ్రులు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలోనే! మరి ఈ విషయంలో బాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూడాలి!

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే… తెలంగాణ ఎన్నికల్లో జనసేన పోటీచేసే స్థానాల్లో ప్రధానంగా ఖమ్మం, మధిర, కొత్తగూడెం, కోదాడ, వైరాతో పాటు గ్రేటర్ పరిధిలోని కూకట్ పల్లిలో కమ్మ సామాజికవర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నాయనే ప్రచారం సంగతి తెలిసిందే! మరి తమ సామాజివకవర్గం ఓట్లతో పాటు ఇతర ఓట్లను జనసేనకు వేయించి గెలిపిస్తేనే తర్వాత జరగబోయే ఏపీ ఎన్నికల్లో టీడీపీ మీద జనాలకు ముఖ్యంగా కాపులకు నమ్మకం ఏర్పడుతుందని అంటున్నారు పరిశీలకులు.

అలాకాకుండా తెలంగాణలో పోటీచేసిన నియోజకవర్గాల్లో కనీసం 3 – 4 స్థానాల్లో అయినా జనసేన గెలవకపోతే, ఆ గెలుపులో టీడీపీ సపోర్ట్ పాత్ర ఉండకపోతే.. తెలంగాణ ఎన్నికల ఫలితాల ప్రభావం ఏపీ ఎన్నికల్లో పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు పరిశీలకులు. మరి ఈ సమయలో చంద్రబాబు చేయబోయే న్యాయం ఎలా ఉండబోతుందనేది ఇప్పుడు కీలకం!