ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో మూడూ ప్రధానపార్టీలైన బీఆరెస్స్, బీజేపీ, కాంగ్రెస్ లు ఎవరి వ్యూహాలు వారు రచించుకుంటున్నారు. ఎవరి ఎత్తుగడలు వారు వేస్తున్నారు. ఇక బీఆరెస్స్ పై కాంగ్రెస్ మరీ దూకుడు పెంచింది. ఈ సమయంలో తాముకూడా తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు తెలంగాణ టీడీపీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే జ్ఞానేశ్వర్ రూపంలో టీడీపీ అడప దడపా కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే తాజాగా జ్ఞానేశ్వర్ కు చంద్రబాబు భారీ షాకిచ్చారు.
గతకొంతకాలంగా చంద్రబాబు రాజకీయంగా ఎలాంటి కీలక నిర్ణయాలూ తీసుకోలేకపోతున్నారు. ఏపీలో వైఎస్ జగన్ ని తప్ప మరే పార్టీని కానీ, మరే నేతను కానీ విమర్శించే ధైర్యం చేయలేకపోతున్నారు. ఓటు కు నోటు కేసు అనంతరం హైదరబాద్ పార్టీ ఆఫీసుకు దూరమైపోయిన చంద్రబాబు… తాజాగా జూబ్లిహిల్స్ లోని ఎన్టీఆర్ భవన్ కు వచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ టీడీపీ నేతలు ఆయన్ని సన్మానించారు.
ఈ సందర్భంగా స్పందించిన చంద్రబాబు… ఏపీ ముఖ్యమంత్రి అభివృద్ధి జరగకుండా విధ్వంసానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఏదో ఒక రోజు ఖచ్చితంగా టీడీపీ పూర్వవైభవం సాధిస్తుందని.. ఇందులో ఎలాంటి అనుమానం లేదని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ సమయంలో చంద్రబాబు రెండు రాష్ట్రాల్లోని రాజకీయ పరిస్థితుల పైన స్పందించారు.
ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తరువాత తెలంగాణ ఆర్దిక పరిస్థితి మెరుగైందని మొదలుపెట్టిన చంద్రబాబు… తెలంగాణ ముఖ్యమంత్రి ఎలాంటి విధ్వంసం చేయడంలేదని, టీడీపీ నాడు ప్రారంభించిన అభివృద్ధిని కేసీఆర్ ఆపలేదని కొనియాడారు. తనదైన శైలిలో కేసీఆర్ తెలంగాణను అభివృద్ధి చేస్తున్నారన్నట్లుగా చంద్రబాబు… కేసీఆర్ ని పరోక్షంగా పొగిడివదిలారు.
దీంతో తలలు పట్టుకుంటున్నారంట తెలంగాణ టీడీపీ నేతలు. ఇంతోటి దానికి ఎన్నికల్లో పోటీ చేయడం ఎందుకు అని ప్రశ్నించుకుంటున్నారంట. చంద్రబాబు వ్యవహారం చూస్తుంటే… తెలంగాణలో టీడీపీ పోటీ చేసేది… ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడానికి అన్నట్లుగా ఉందని తెలంగాణ టీడీపీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు. పరోక్షంగా కేసీఆర్ కు సహకరించి.. ఓటుకు నోటు కేసు విషయంలో కేసీఆర్ కి కలిగించిన ఆగ్రహాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తున్నారంటూ చెవులు కొరుక్కుంటున్నారు!
దీంతో పాపం జ్ఞానేశ్వర్ కి పార్టీలో చేరిన అతి తక్కువ సమయంలోనే చంద్రబాబుకు తన మార్కు పొలిటికల్ షాకిచ్చారని అంటున్నారు పరిశీలకులు!