తెలంగాణ సిఎం కేసిఆర్ తీరుపై ఎపి సిఎం చంద్రబాబు చురకలు వేసేలా మాట్లాడారు. అమరావతిలో చంద్రబాబు మీడియాతో కేసిఆర్ పర్యటనల గురించి ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. నిన్నటి వరకు ఫ్రంట్ పేరుతో దేశంలోని వివిధ పార్టీలను కలిసిన కేసిఆర్ సడెన్ గా ఇవాళ మోదీతో భేటీ కావడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అని ప్రశ్నించారు.
కేసిఆర్ ప్రధానిని కలిసి ఆయనకు ఏం చెబుతారు అని ప్రశ్నించారు. ఫ్రంట్ పేరుతో ఒకవైపు పర్యటనలు చేస్తూ అన్ని పార్టీలను కలిసి మాట్లాడి మరోవైపు ప్రధానిని కలవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు. ప్రధానికి రాష్ట్ర సమస్యలు విన్నవించడానికి ఆయనతో కలుస్తున్నారా? లేదంటే ఆయనకు బ్రీఫ్ చేయడానికి వెళ్తున్నారా అని నిలదీశారు.
అందుకే కేసిఆర్ యాక్షన్ మీద ఎవరికీ నమ్మకం లేకుండా పోతున్నదని విమర్శించారు. అతని యాక్షన్స్, బిజెపి యాక్షన్స్ ఒకేలా ఉన్నాయి కదా? అని ఎద్దేవా చేశారు. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో కేసిఆర్ చెబుతున్న మాటలు వేరు, చేస్తున్న పనులు వేరుగా ఉన్నాయన్నారు.
ఫెడరల్ ఫ్రంట్ పేరుతో కేసిఆర్ ఒడిషా నవీన్ పట్నాయక్, బెంగాల్ మమతా బెనర్జీని కలిసిన విషయం తెలిసిందే. అయితే ఇవాళ కేసిఆర్ సాయంత్రం మోదీని కలవనున్నారు. ఒకవైపు కాంగ్రెస్, బిజెపియేతర ఫ్రంట్ అని చెబుతూనే తిరిగి మోదీని ఎందుకు కలుస్తున్నారనేది చంద్రబాబు ప్రశ్నగా తెలుస్తోంది.
అయితే విశాఖపట్నం నుంచి తన యాత్ర ప్రారంభించిన కేసిఆర్ ఆంధ్రా సిఎం చంద్రబాబును మాత్రం కలవలేదు. ఈ విషయంలో చంద్రబాబు అసహనంగా ఉన్నట్లు తెలుస్తోంది. జాతీయ పార్టీల సహకారం లేకుండా కూటమి నిర్మాణం సాధ్యం కాదని చంద్రబాబు మరోసారి పునరుద్ఘాటించారు.