తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలన కేసు నమోదు అయింది. బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి హరీష్ రావుపై బాచుపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. స్థానిక వ్యక్తి చక్రధర్ గౌడ్ తనకు ప్రాణహాని ఉందంటూ ఫిర్యాదు చేయడంతో, పోలీసులు భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)లోని సెక్షన్ 351(2), రెడ్ విత్ 3(5) కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసులో హరీష్ రావును రెండో నిందితుడిగా పేర్కొనడం గమనార్హం. త్వరలోనే ఆయనకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇదంతా జరిగితేనేమో, మరోవైపు ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ఘటన తెలంగాణలో రాజకీయం మరింత వేడెక్కించేలా చేస్తోంది. ప్రాజెక్ట్ ప్రమాద స్థలాన్ని పరిశీలించేందుకు హరీష్ రావు వెళ్లినప్పుడు పోలీసులు అడ్డుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేయగా, మంత్రి జూపల్లి కృష్ణారావు దీన్ని రాజకీయం చేయడమేనంటూ స్పందించారు. హరీష్ రావుపై నిలదీసేలా మూడు కీలక ప్రశ్నలు కూడా సంధించారు.
జూపల్లి వ్యాఖ్యలు చూస్తే, టన్నెల్ పనులను కేసీఆర్ హయాంలో ఎందుకు పూర్తి చేయలేదన్నది ప్రధాన ప్రశ్నగా మారింది. కాంగ్రెస్ హయాంలో ప్రారంభమైన టన్నెల్ నిర్మాణం ఎందుకు వదిలేశారని ఆయన ప్రశ్నించారు. లాభసాటి కాంట్రాక్ట్ కాదని మిగిలిన పనులు నిర్లక్ష్యం చేశారా? లేక ప్రాజెక్ట్ పూర్తి అయితే క్రెడిట్ ఇతరులకు వెళ్లొచ్చనే భయమా? అని ప్రశ్నించారు. హరీష్ రావుపై కేసు, టన్నెల్ వివాదం ఒకదానికొకటి సంబంధం ఉన్నాయా? లేక రాజకీయ వైరం వల్లే ఈ చర్యలా? అనేది ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనా, ఈ పరిణామాలు తెలంగాణ రాజకీయాల్లో కొత్త మలుపుని తెచ్చేలా కనిపిస్తున్నాయి.