KTR – KCR: కేటీఆర్ – కేసీఆర్ భేటీకి ప్రాధాన్యం.. కవిత లేఖపై స్ట్రాటజీ చర్చలు?

బీఆర్‌ఎస్ పార్టీలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో పార్టీ అధినేత కేసీఆర్‌ను వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎర్రవల్లి ఫార్మ్‌హౌస్‌లో కలవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల పార్టీపై, నాయకత్వంపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు, తన తండ్రికే బహిరంగ లేఖ రాసిన అంశం బీఆర్ఎస్ వర్గాల్లో కలకలం రేపింది. ఇప్పుడు కేటీఆర్ – కేసీఆర్ భేటీ ఈ పరిణామాల అనంతరం జరగడం విశేషంగా మారింది.

పార్టీలో ప్రస్తుతం నెలకొన్న అసంతృప్తి, నాయకత్వంలోని లోపాలు, భవిష్యత్ కార్యాచరణపై కేసీఆర్‌తో కేటీఆర్ సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. కవిత లేఖలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించి పార్టీలోనే గుసగుసల చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో, పార్టీ అంతర్గత విభేదాలను సమీక్షించేందుకు ఈ భేటీ జరిగినట్లు బీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి. రాబోయే రోజుల్లో పార్టీ తీరులో మార్పులు అవసరమా? అధికారంలో లేకుండా పార్టీని పునరుద్ధరించేందుకు ఏ మార్గాన్ని ఎంచుకోవాలి? అనే దానిపై కీలకంగా చర్చించారని తెలుస్తోంది.

ఇక మరోవైపు, జూన్ 2న జరిగే తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు పార్టీ ముందస్తు ప్రణాళికలు రూపొందిస్తోంది. అమెరికా పర్యటనకు ముందు ఈ వేడుకలపై స్పష్టమైన కార్యాచరణ రూపొందించేందుకు కేటీఆర్ ఇప్పటికే సిద్ధమయ్యారు. జూన్ 1న అమెరికాలో ఓ కార్యక్రమంలో పాల్గొనాల్సిన నేపథ్యంలో, రాష్ట్ర స్థాయిలో జరగబోయే వేడుకల బాధ్యతను ఎవరికీ అప్పగించాలి? ఏ స్ఫూర్తితో ప్రజల్లోకి వెళ్లాలి? అనే విషయాలపైనూ కేసీఆర్‌తో చర్చలు జరిగినట్లు సమాచారం. ఈ సమావేశంతో పార్టీ లోపలి విభేదాలకు మార్గం ఏర్పడుతుందా? లేదా అనే ఆసక్తి రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.

మగాళ్ళయితే అరెస్ట్ చెయ్ || Analyst Ks Prasad EXPOSED Ys Jagan Warning To Chandrababu || TeluguRajyam