తెలంగాణ రాష్ట్ర సమితి కాస్తా భారత్ రాష్ట్ర సమితి అయ్యింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో భారత్ రాష్ట్ర సమితి, దేశంలోని ఇతర రాష్ట్రాల్లోనూ పోటీ చేయబోతోంది. ప్రస్తుతానికైతే బీఆర్ఎస్ ముందున్న టార్గెట్ తెలంగాణలో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికలు.
నిజానికి, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకి పూర్తిగా ఏడాది సమయం కూడా లేదు. ముందైతే, ఆ అసెంబ్లీ ఎన్నికల మీద బీఆర్ఎస్ ఫోకస్ పెట్టాలి. ఆ తర్వాతే, ఇతర రాష్ట్రాల్లో పోటీపై ఆలోచన చేయాలి.
వరుసగా మూడోసారి తెలంగాణలో అధికారంలోకి రావడమంటే అదేమీ అంత ఈజీ టాస్క్ కాదు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి. పార్టీ పేరు మారింది.. ‘తెలంగాణ సెంటిమెంట్’ కూడా తన పార్టీకి దూరమయ్యే పరిస్థితులు కనిపిస్తున్న దరిమిలా, కేసీయార్ ఒకింత ఆందోళనతో కనిపిస్తున్నారు.
ఇదిలా వుంటే, త్వరలో అమరావతిలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయాన్ని ప్రారంభించబోతున్నారట. అదే సమయంలో బెంగళూరులోనూ రాష్ట్ర కార్యాలయాన్ని స్థాపించేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీయార్ వ్యూహ రచన చేస్తున్నారు.
ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపనకి కేసీయార్ కూడా హాజరైన సంగతి తెలిసిందే. అప్పట్లో ఏపీ రాజధానికి తెలంగాణ తరఫున ఆర్థిక సాయం చేయాలనుకున్నట్లు కేసీయార్ చెప్పారుగానీ.. ప్రధాని మోడీనే ఏమీ చేయనప్పుడు, తాము చేస్తే బావుండదన్న కోణంలో వెనక్కి తగ్గారట. ఇంతకీ, అమరావతిలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయం ఎక్కడ.? ఆ పార్టీని ఏపీలో డీల్ చేసెదెవరు.? ముందు ముందు స్పష్టత రానుంది.