తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపిన కల్వకుంట్ల కవిత లేఖపై ఆమె సోదరుడు, బీఆర్ఎస్ నేత కేటీఆర్ మొదటిసారిగా స్పందించారు. శనివారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీకి సంబంధించిన అంశాలు పార్టీ లోపలే చర్చించాలి అనే తుది మాట చెప్పారు. వ్యక్తిగతంగా ఎవరి అభిప్రాయమైనా పార్టీ అధ్యక్షుడికి తెలిపే అవకాశముందని చెప్పారు. ఆ అభిప్రాయం లేఖగా అయినా, నేరుగా కలిసి అయినా తెలియజేయొచ్చని వివరించారు.
కవిత చేసిన ఆరోపణలు, ముఖ్యంగా “పార్టీలో దెయ్యాలు చేరాయి”, “బీజేపీతో పొత్తులకు సంకేతాలు వెళుతున్నాయి”, “ఉద్యమ తరాన్ని అవమానిస్తున్నారు” వంటి వ్యాఖ్యలపై పరోక్షంగా స్పందిస్తూ, కేటీఆర్ ఒక్క మాట చెప్పారు.. “పార్టీలో అందరం కార్యకర్తలమే. కొన్ని విషయాలను అంతర్గతంగానే చర్చించాలి.” ఇది కవితకు పరోక్షంగా క్లాస్ ఇచ్చినట్లే అయింది. మీడియా ప్రశ్నలపై కేటీఆర్ స్పష్టంగా స్పందించేందుకు మాత్రం ఆసక్తి చూపలేదు. ఆమె పేరు కూడా ఒక్కసారి కూడా ప్రస్తావించలేదు.
ఇక బీఆర్ఎస్ పార్టీలో కోవర్టులు ఉన్నారని కవిత చేసిన ఆరోపణపై ప్రశ్నించగా, “ప్రతి పార్టీలో ఉండేవాళ్లు ఉంటారు. సమయం వచ్చినప్పుడు బయటపడతారు” అన్నారు. రేవంత్ రెడ్డిని “రాష్ట్రానికి పట్టిన దయ్యం”గా అభివర్ణించారు. తమ దృష్టంతా కాంగ్రెస్‌ను ఓడించడంపైనే ఉందని తెలిపారు. కవిత లేఖ రాజకీయంగా విభిన్న దిశలో చర్చలు నడిపిస్తున్నా, కేటీఆర్ మాత్రం మెల్లిగా, కానీ స్పష్టమైన పద్దతిలో పార్టీ క్రమశిక్షణపై తన వైఖరిని స్పష్టం చేశారు. అలాగే పార్టీ అంతర్గత వ్యవహారాలు బయటకు రావొద్దనే సంకేతాన్ని పంపినట్లయ్యింది.