టికెట్ల కేటాయింపులో కాంగ్రెస్ పార్టీ మొండిచేయి చూపడంతో నిజామాబాద్ జిల్లా బోధన్ కు చెందిన బిసి నేత ఉప్పు సంతోష్ కుమార్ కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పారు. ఆయన తన అనుచరులతో కలిసి ఆర్ఎస్ ఎంపి కవిత సమక్షంలో ఆ పార్టీలో చేరారు.
ఉప్పు సంతోష్ కు గులాబి కండువా కప్పి ఆయనను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు ఎంపి కవిత. కార్యక్రమంలో బోధన్ టీఆర్ఎస్ అభ్యర్థి షకీల్ పాల్గొన్నారు.
బోధన్ టికెట్ కోసం కాంగ్రెస్ పార్టీలో ఉప్పు సంతోష్ సీరియస్ గా ప్రయత్నించారు. బోధన్ లో 70 ఏండ్లు దాటిన సుదర్శన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో మళ్లీ టికెట్ ఇవ్వడాన్ని సంతోష్ జీర్ణించుకోలేకపోయారు. బిసి కోటాలో తనకు టికెట్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ విషయమై సంతోష్ గాంధీభవన్ లో ధర్నా చేశారు. ఇప్పటికే 6సార్లు చేసిన రెడ్డి నేతకు టికెట్ ఇస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిసి లకు అవకాశాలు ఇవ్వరా అని నిలదీశారు. సంతోష్ గాంధీభవన్ లో ధర్నా చేసిన సమయంలో స్ర్కీనింగ్ కమిటీ సభ్యుడు భక్త చరణ్ దాస్ గాంధీభవన్ లోనే ఉన్నారు. ఆ సమయంలో ఆయన బయటకొచ్చి సంతోష్ ను సముదాయించారు. టికెట్ ఇచ్చే అవకాశాలను పరిశీలిస్తానని స్పష్టం చేశారు.
కానీ సుదర్శన్ రెడ్డికే మళ్లీ టికెట్ ఖరారు కావడంతో సంతోష్ ఆగ్రహం చెందారు. దీంతో కాంగ్రెస్ లో బిసిలకు ప్రాధాన్యత ఉండబోదని భావించి ఆయన ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. టిఆర్ఎస్ ఎంపి కవిత ఆధ్వర్యంలో టిఆర్ఎస్ లో చేరారు.