కేసిఆర్ పై ఎటాక్ స్టార్ట్ చేసిన బిజెపి

ఫెడరల్ ఫ్రంట్ పేరుతో జాతీయస్థాయిలో హడావుడి చేస్తున్న కేసిఆర్ ను కట్టడి చేసేందుకు బిజెపి కొత్త ఆయుధాన్ని సంధించింది. ఇప్పటి వరకు బిజెపి టిఆర్ ఎస్ మధ్య స్నేహపూర్వక బంధం ఉందన్న చర్చ జరిగింది. కానీ బిజెపి కేసిఆర్ ను ఇరకాటంలో పెట్టేందుకు మాజీ మంత్రి, బిజెపి ఎంపీ, ప్రొఫెసర్, అడ్వకేట్ అయిన ఫైర్ బ్రాండ్ సుబ్రమణ్య   స్వామిని రంగంలోకి దించింది.  ఒక్క దెబ్బకు రెండు పిట్టలన్నట్టు అటు చంద్రబాబుపై, ఇటు కేసిఆర్ పై సుబ్రమణ్య  స్వామి గేమ్ మొదలు పెట్టింది.

టిటిడి వివాదాలపై కేసు వేస్తానంటున్న సుబ్రమణ్య స్వామి ఇప్పుడు తెలంగాణ సీఎంపై ఫైర్ అయ్యారు. పరిపూర్ణానంద స్వామి బహిష్కరణపై ఆయన ప్రభుత్వానికి లేఖ రాశారు. పరిపూర్ణానంద స్వామి పై పెట్టిన కేసుల పట్ల ఆయన లేఖలో తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గూండాలకు పెట్టే కేసులు స్వామిజీపై పెడతారా అంటూ ధ్వజమెత్తారు. ఒక సాధువును గూండాల చూస్తారా అని ఆయన మండిపడ్డారు. వెంటనే ఆ కేసులను వెనుకకు తీసుకోకపోతే చట్ట ప్రకారం తాను ముందుకు వెళుతానని అప్పుడు ప్రభుత్వ పరువునష్టం కూడా చెల్లించాలని హెచ్చరించారు. పరిపూర్ణానంద స్వామిని 1980 సంఘ వ్యతిరేక, ప్రమాద కార్యకలాపాల నిరోధక చట్టం సెక్షన్ యు/ఎస్ 3 కింద నగర బహిష్కరణ చేశారని, ఇది గుండాలను నగరం నుంచి బహిష్కరించేందుకు ఉపయోగించే చట్టమన్నారు. పరిపూర్ణానంద ఏమైనా గూండానా అని లేఖలో ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

సుబ్రమణ్య స్వామి తెలంగాణ ప్రభుత్వానికి రాసిన లేఖతో రెండు తెలుగు రాష్ట్రాల్లోను చర్చ జరుగుతోంది. ఎందుకంటే బిజెపికి దక్షిణ భారత రాష్ట్రాలపై పెద్దగా పట్టులేదు. అందునా తెలుగు రాష్ట్రాలలో చెప్పుకోదగ్గ బలం లేదు. దీంతో స్థానికంగా ఉన్న సమస్యలపై బిజెపి నాయకులు స్పందించినా అది పెద్దగా ఉపయోగపడటం లేదు. దీంతో జాతీయ స్థాయి నేతలను రంగంలోకి దించాలనుకుందేమో బిజెపి. తెలంగాణ పోలీసు శాఖ పరిపూర్ణానంద స్వామి రథయాత్రను అడ్డుకొని మత ఘర్షణలు జరుగుతాయని భావించి అతనిపై నగర బహిష్కరణ వేటు వేసింది. దీంతో బిజెపి నాయకులు భారీ ఎత్తున ఉద్యమించినా అది చెప్పుకోదగ్గ స్ధాయిలో వారికి వర్కవుట్ కాలేదు. దీంతో బిజెపి పెద్దలు స్వామి వ్యవహారంలో జోక్యం చేసుకున్నారు. దీంతో జాతీయస్థాయి మాస్ లీడర్ గా పేరున్న సుబ్రమణ్య స్వామి తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాశారు.

ఆంధ్రప్రదేశ్ లో ఉన్న తిరమలలో కొద్ది రోజుల నుంచి వివాదాలు తలెత్తుతున్నాయి. శ్రీవారి ఆభరణాలు మాయమయ్యాయని పెద్ద గొడవే జరిగింది. అలాగే అర్చకుల తొలగింపు అంశం కూడా తారాస్థాయిలో నడిచింది. దీంతో సుబ్రమణ్యస్వామి తాను టిటిడి వివాదాలపై కేసు వేస్తానని ప్రకటించారు. ఇప్పటికి మూడు సార్లు ప్రకటించినా దానిపై ఆయన ఇంకా స్పష్టమైన వైఖరి చెప్పటం లేదు. అలా ఆంధ్రప్రదేశ్ లో తన మార్కు చూపిస్తున్న స్వామి తాజాగా తెలంగాణ రాజకీయాల్లో కూడా తన మార్కును చూపిస్తున్నారు. పరిపూర్ణానంద అంశాన్ని సీరియస్ గా తీసుకొని ఆయన తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాశారు. దీంతో బిజెపి బలపడేందుకే రెండు రాష్ట్రాల్లో సుబ్రమణ్య స్వామిని బలంగా ఉపయోగించుకుంటుదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.