2024 ఎన్నికలకు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో మిత్రపక్షంగా ఎవర్ని నమ్మాలో భారతీయ జనతా పార్టీ అధినాయకత్వానికి అర్థం కావడంలేదు. ‘ఎన్నికల సమయంలో పొత్తుల గురించి మాట్లాడతాం..’ అంటోంది బీజేపీ, ‘తెలంగాణలో ఒంటరిగానే వెళతాం.. ఆంధ్రప్రదేశ్‌లో జనసేనతో కలిసి వున్నాం..’ అన్నది బీజేపీ తాజా వెర్షన్.
తెలంగాణలో ఈ ఏడాదే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. బీజేపీకి తెలంగాణలో జనసేన అలాగే టీడీపీ మద్దతు కూడా అవసరం. ఆ దిశగా తెరవెనుకాల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆ రెండు పార్టీలతో మంతనాలు జరుపుతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి కూడా. పలువురు సినీ ప్రముఖులతోనూ హైద్రాబాద్ కేంద్రంగా బీజేపీ అధినాయకత్వం రాజకీయ చర్చలు ప్రారంభించింది.
ఇదిలా వుంటే, జనసేనతో పొత్తు విషయమై బీజేపీ పునరాలోచనలో పడిందన్నది తాజా ఖబర్. అంటే, తిరిగి జనసేనతో తెలంగాణలో పొత్తు కొనసాగించాలనా.? లేదంటే, పూర్తిగా తెలుగు రాష్ట్రాల్లో జనసేనతో తెగతెంపులు చేసుకోవాలనా.? ఈ విషయమై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. బీజేపీకి తెలంగాణలో ప్రస్తుతం టైమ్ బాగానే వుంది. ఈ సమయంలో జనసేనని దూరం చేసుకోవడం మంచిది కాదన్నది కొందరు బీజేపీ నేతల వాదన.
‘తెలంగాణలో మాతో బీజేపీ సరిగ్గా వుండటంలేదు’ అని స్వయానా పవన్ కళ్యాణ్ ఇటీవల ప్రకటించారు. ఏపీలోనూ దాదాపు అదే పరిస్థితి అని ఆయన చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో త్వరలోనే జనసేన అధినేతతో అధికారిక చర్చలు బీజేపీ అధినాయకత్వం ప్రారంభించబోతోందిట.