తెలంగాణలో బీజేపీ పార్టీ ఊపుని చూస్తుంటే వచ్చే ఎన్నికలలో అధికారం తమదేనన్న కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. వివిధ రకాల ఎత్తుగడలు, ప్రయత్నాలతో కెసిఆర్ నుండి ఈ సారి కుర్చీని లాక్కునేందుకు శతవిధాలుగా శ్రమిస్తున్నారు.క్షేత్రస్థాయిలో పార్టీని ఒకపక్క బలోపేతం చేస్తూనే , మరో పక్క తమ రాజకీయ ప్రత్యర్ధులకు ఎక్కడికక్కడ చెక్ పెట్టేందుకు రకరకాల వ్యూహాలను అనుసరిస్తూ ముందుకు వెళ్తోంది. ఈ విషయంలో తెలంగాణ బీజేపీ నేతలంతా సమిష్టిగా పని చేస్తూ, అన్ని విషయాల్లోనూ బీజేపీ దే పై చేయి ఉండే విధంగా ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ ను దెబ్బతీయడమే ఏకైక లక్ష్యంగా బీజేపీ ముందుకు వెళుతోంది.
ముఖ్యంగా టిఆర్ఎస్ పార్టీ నుంచి పెద్దఎత్తున నాయకులను చేర్చుకోవాలనే వ్యూహానికి బిజెపి తెరతీసింది.మొన్నటి వరకు తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ హవా నడిచింది.2014 ఎన్నికలలో విజయం సాధించిన దగ్గర నుంచి ఆ పార్టీ తన రాజకీయ ప్రత్యర్థులైన కాంగ్రెస్, టిడిపిలను దెబ్బతీయడమే లక్ష్యంగా పెద్ద ఎత్తున వలసలను ప్రోత్సహించింది.దీంతో కాంగ్రెస్ టిడిపి లు బలహీనమైయ్యాయి.ఇవన్నీ టిఆర్ఎస్ కు బాగా కలిసి రావడం, తెలంగాణలో ఆ పార్టీ ని ఎదుర్కొనే బలమైన పార్టీలు లేకపోవడం వంటి వాటితో తమకు ఎదురే లేకుండా చేసుకుంటూ వచ్చింది.కానీ అనూహ్యంగా ఇప్పుడు బిజెపి టిఆర్ఎస్ కు ముచ్చెమటలు పట్టిస్తోంది.
టిఆర్ఎస్ కు చెందిన అసంతృప్తి నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఓటర్లను ప్రభావితం చేయగల నాయకులను, క్షేత్రస్థాయిలో పట్టు ఉన్న నాయకులను, కుల సంఘాల నాయకులను, ఇలా ఎవర్ని విడిచిపెట్టకుండా అందరినీ బిజెపిలో చేర్చుకునే విషయంపై పూర్తిగా దృష్టి సారించింది.ఈ మేరకు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ వలసలపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టారు.జూపల్లి కృష్ణారావు, కడియం శ్రీహరి, మహేందర్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు వంటి నేతలను చేర్చుకోవాలనే వ్యూహంతో బి.జె.పి ముందుకు వెళుతుంది.
ఇప్పటికే కొంతమంది నాయకులు బిజెపిలో చేరేందుకు అంగీకరించగా, మరికొంతమంది తెలంగాణ రాజకీయ పరిస్థితులను అంచనా వేసి మరి కొంత కాలం వేచి చూడాలనే ధోరణితో ఉన్నట్లుగా బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి.జాతీయ స్థాయి నాయకులను తెలంగాణకు రప్పించి, వారి సమక్షంలోనే ఒకేసారి పెద్ద ఎత్తున చేరికలకు ముహూర్తం పెట్టాలి అని ప్లాన్ చేస్తున్నారు.దీంతో వచ్చే రేస్ లో కారు వెనకపడటం ఖాయమని బిజేపి నాయకులు బల్లలు చరిచి మరీ ఆనంద పడుతున్నారట.