బీజేపీ ఆ ఒక్క పనీ చేసి ఉంటే కేసీఆర్‌ను ఇంకా ఎక్కువగా భయపెట్టేదేమో ?

BJP did small mistake in GHMC elections 
హోరాహోరీగా సాగిన గ్రేటర్ ఎన్నికల పోరు ఎట్టకేలకు ముగిసింది.  ప్రచార హోరు, వీడి పోరాటాలు, సవాళ్లు ప్రతిసవాళ్లు నేపథ్యంలో ప్రధాన పార్టీలు మూడు సత్తా చాటుకున్నాయి.  అధికార పార్టీ తెరాస చెప్పినట్లు 100 సీట్లు  గెలవలేకపోయినా 55 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది.  ఇక భారతీయ జనతా పార్టీ అయితే చెప్పినట్టే భీభత్సంగా పుంజుకుంది.  4 స్థానాల స్థాయి నుండి 48 స్థానాల స్థాయికి ఎగబాకింది.  ఇక మరొక ముఖ్య పార్టీ ఎంఐఎం 44 స్థానాలతో మరోసారి  హైదరాబాద్ మీద తన పట్టును చాటుకుంది.  కాంగ్రెస్ అయితే అప్పుడు ఇప్పుడు రెండు స్థానాలకే పరిమితం కాగా టీడీపీ పూర్తిగా కనుమరుగైపోయింది.  గ్రేటర్ ఓటర్లు ఇలా ఏ పార్టీకి కూడ పూర్తిస్థాయి మెజారిటీ ఇవ్వకుండా గొప్ప చిక్కే తెచ్చి పెట్టారు.  
 
BJP did small mistake in GHMC elections 
BJP did small mistake in GHMC elections
దీంతో నిన్నటి నుండి అధికార పార్టీ తన మిత్ర పక్షంతో చర్చలు మొదలుపెట్టేసింది.  మేయర్ పీఠాన్ని అధిరోహించడానికి సన్నాహాలు  చేసుకుంటోంది.  ఆ విషయాన్ని కాస్త పక్కనపెడితే అనూహ్యరీతిలో విజృంభించి 48 వరకు చేరుకున్న బీజేపీ ఇంకాస్త పక్కాగా ప్లాన్ చేసుకుని ఉంటే తెరాసను  మించిపోయేదేమో అనే అనుమానం వ్యక్తమవుతోంది పరిశీలకుల్లో.  అది కూడ మిత్రపక్షం జనసేన విషయంలో కాస్త ఎక్కువగా ఆలోచించాల్సింది అంటున్నారు.  మొదట పవన్ కళ్యాణ్ ఎన్నికల బరిలో  దిగడానికి నిర్ణయించుకుని నామినేషన్లు వేసుకోమని అభ్యర్థులకు చెప్పేశారు.  కానీ బీజేపీ పెద్దల చర్చల తర్వాత పోటీ నుండి విరమించుకున్నారు.  దీనికి కారణం ఓట్లలో చీలిక ఉండకూడదనే.  అయితే కొన్ని చోట్ల అయినా జనసేనను బరిలోకి దింపి ఉంటే ఆ పార్టీ సింగిల్ నెంబర్ సీట్లనైనా దక్కించుకునేదని అంటున్నారు.   
 
ప్రధానంగా ఆంధ్రా ఓటర్లు ఎక్కువగా ఉన్న చోట్ల తెరాస పట్టు కనబడింది.  అలాంటి స్థానాలు చాలా వరకు గులాబీ జెండా ఖాతాలోనే పడ్డాయి.  ఆంధ్రా సెటిలర్లు వేరే అప్షన్ లేక కారు గుర్తుకే ఓటు వేసేశారు.  అక్కడ బీజేపీకి కనీస  మద్దతు కూడ లభించలేదు.  అలాంటి స్థానాల్లో జనసేన నుండి బలమైన అభ్యర్థులను బరిలోకి దింపి ఉంటే తెరాసకు గెలుపు అంత ఈజీ అయి ఉండేది కాదు.  నిజానికి పవన్ కళ్యాణ్ ప్రవేశించి సెలెక్టెడ్ స్థానాల్లో గట్టిగా ప్రచారం చేసి ఉంటే జనసేన అభ్యర్థులు గెలిచినా గెలిచుండేవారు.  ఎందుకంటే తెరాస 99 స్థానాల నుండి 55కు పడిపోవడం చూశాక ఓటర్లు భిన్నంగా ఆలోచించారని, ప్రత్యామ్నాయం వెతికారని స్పష్టంగా అర్థమవుతోంది.  
 
ఈ వాతావరణాన్ని ముందే పసిగట్టి జనసేనను కొన్ని చోట్ల బరిలోకి దించి ఉంటే  ఈరోజు బీజేపీకి అందుబాటులో ఇంకో 6 నుండి 9 స్థానాలు ఉండేవి.  ఈ సీట్లతోనే  బీజేపీ గ్రేటర్ పీఠం దక్కించుకోలేకపోయినా కూటమి కడితే ఒంటరి తెరాసను  అధిగమించే బలం తమకుందని నిరూపించుకున్నట్టు ఉండేది.  కానీ చిన్న తొందరపాటుతో ఆ అవకాశాన్ని మిస్ చేసుకున్నారు కమల దళం.