Munugode By-Poll: మేఘాల్లో తేలిపోతున్న టీఆర్ఎస్.! దారుణంగా నష్టపోయిన ‘కోమటిరెడ్డి’.!

Munugode By-Poll: మునుగోడు ఉప ఎన్నికలో తెలంగాణ రాష్ట్ర సమితి విజయం సాధించింది. ఈ విజయం తెలంగాణ రాష్ట్ర సమితికి అత్యవసరం. అందుకే, మంత్రులు మొత్తంగా మునుగోడు మీదనే ఫోకస్ పెట్టారు. ముఖ్యమంత్రి కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సి వచ్చింది. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందర ఈ మునుగోడు ఉప ఎన్నిక సెమీ ఫైనల్ లాంటది తెలంగాణ రాష్ట్ర సమితికి.

ఎలాగైతేనేం, మునుగోడులో తెలంగాణ రాష్ట్ర సమితి గెలిచేసింది గనుక, జాతీయ పార్టీ బీఆర్ఎస్ విషయమై గులాబీ బాస్ ఒకింత దూకుడుగా వ్యవహరించేందుకు అవకాశముంది. మునుగోడు ఓటర్లు బీజేపీని తిరస్కరించారా.? అంటే, నిజానికి.. బీజేపీ చాలానే లాభపడింది మునుగోడులో. తీవ్రంగా నష్టపోయింది కాంగ్రెస్ పార్టీ.

తెలంగాణలో పొలిటికల్ ఈక్వేషన్ ఇంకాస్త క్లారిటీతో కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ – బీజేపీ మధ్య పోటా పోటీ ఫైట్ వుండబోతోంది. ట్రయాంగిల్ ఫైట్‌లో అంతిమ లాభం మాత్రం తెలంగాణ రాష్ట్ర సమితికే. కాంగ్రెస్ పార్టీ నామమాత్రపు పోటీ మాత్రమే ఇవ్వగలదు.

ఇంతకీ, కోమటిరెడ్డి బ్రదర్స్ పరిస్థితేంటి.? ఓడిన రాజగోపాల్ రెడ్డికి బీజేపీలో విలువ వుండదు. ఎంచక్కా ఇంకో ఏడాదిపాటు ఎమ్మెల్యేగా వుండేవారు.. ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వుండకపోతే. ఇప్పుడు వెన్నకి వెళ్ళలేరు.. బీజేపీలో వుండలేరు. రాజగోపాల్ రెడ్డి సంగతి సరే.. ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిస్థితేంటి.? కాంగ్రెస్ ఆయన్ని బయటకు పంపేయొచ్చు. ఆయన బీజేపీలో చేరితే, రాజీనామా చెయ్యాలి.. చేస్తే, ఓడిపోతే.? అంతే సంగతులు.
మునుగోడు ఉప ఎన్నిక ఫలితంతో కోమటిరెడ్డి బ్రదర్స్ హవా ఇక లేనట్టే తెలంగాణ రాజకీయాల్లో.